జర్నలిస్ట్ శ్రీవాస్తవ మృతి ఘటనపై ప్రియాంక గాంధీ ఫైర్

ABN , First Publish Date - 2021-06-15T05:24:28+05:30 IST

జర్నలిస్ట్ శ్రీవాస్తవ మృతి ఘటనపై ప్రియాంక గాంధీ ఫైర్

జర్నలిస్ట్ శ్రీవాస్తవ మృతి ఘటనపై ప్రియాంక గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: లిక్కర్ మాఫియాపై ఇటీవల వార్తా కథనం రాసిన జర్నలిస్టు సులభ్ శ్రీవాస్తవ ‘‘రోడ్డు ప్రమాదంలో’’ మృతి చెందిన ఘటనపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా యూపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నిప్పులు చెరిగారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‘‘ఆటవిక పాలన’’ సాగిస్తోందంటూ ఆమె దుయ్యబట్టారు. కాగా ఓ న్యూస్‌ ఛానెల్‌లో పనిచేస్తున్న 42 ఏళ్ల శ్రీవాస్తవ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు యూపీ పోలీసులు చెబుతున్నారు. కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుఖ్‌పాల్ నగర్ ఇటుకల బట్టీ వద్ద మోటార్ సైకిల్ ఓ విద్యుత్ పోల్‌ను ఢీకొట్టడంతో శ్రీవాస్తవ చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. లిక్కర్ మాఫియా గుట్టురట్టు చేసిన కొద్దిరోజులకే ఆయన మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఇవాళ ట్విటర్ వేదికగా స్పందిస్తూ... ‘‘అలీగఢ్ నుంచి ప్రతాప్‌గఢ్ వరకు లిక్కర్ మాఫియా మరణ మృదంగం మోగిస్తోంది. ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు మౌనంగా ఉంది..’’ అని ప్రియాంక ఆరోపించారు. ‘‘జర్నలిస్టులు నిజాలను వెలికితీస్తారు. జరగబోయే ప్రమాదాలపై ముందే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. ఈ ప్రభత్వం నిద్రపోతోంది..’’ అని ఆమె దుయ్యబట్టారు. ‘‘జంగిల్ రాజ్ పాలన’’ సాగిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు కుటుంబం కన్నీటి శోకానికి ఏం సమాధానం చెబుతోందంటూ ఆమె ప్రశ్నించారు. ఇటీవలే జర్నలిస్టు శ్రీవాస్తవ లిక్కర్ మాఫియాపై సంచలన కథనం వెలువరించారు. ఈ నెల 12న తనకు ప్రాణహాని ఉందంటూ ప్రయాగ్ రాజ్ అదనపు ఏడీజీపీని కలిసి భద్రత కల్పించాలని కోరారు.



Updated Date - 2021-06-15T05:24:28+05:30 IST