సమస్యల వర్సిటీలు..!

ABN , First Publish Date - 2021-07-31T08:09:50+05:30 IST

జిల్లాలోని యూనివర్సిటీల్లో సుదీర్ఘ కాలంగా సమస్యలు తాండవిస్తున్నాయి.

సమస్యల వర్సిటీలు..!

విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తోడ్పాటు ఏదీ?

నేడు జిల్లాకు యూజీసీ చైర్మన్‌ ధీరేంద్రపాల్‌ సింగ్‌ రాక


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూలై 30: జిల్లాలోని యూనివర్సిటీల్లో సుదీర్ఘ కాలంగా సమస్యలు తాండవిస్తున్నాయి. వీటిపై విద్యార్థులు, ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించినా పరిష్కరించిన దాఖలాల్లేవు. ఎస్వీయూ, పద్మావతి, ద్రవిడ, వెటర్నరీ, స్విమ్స్‌, వేద, సంస్కృత విద్యాపీఠం యూనివర్సిటీల్లో అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. జిల్లాకు శనివారం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ ధీరేంద్రపాల్‌ సింగ్‌ రానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని యూనివర్సిటీలకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేక కథనం.. 

డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో పనిచేసే సుమారు 8 వేల మంది అధ్యాపకులకు యూజీసీ వేతన సవరణ బకాయిలు రూ.251.5 కోట్లు యూజీసీ నుంచి గతేడాది జూలైలో రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరైనా, ఇంతవరకు అధ్యాపకులకు అందలేదు. యూజీసీ మంజూరు చేసిన రూ.251 కోట్లకు తోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లు మ్యాచింగ్‌ గ్రాంట్‌ మంజూరు చేయలేదు. దీనిపై యూజీసీ దృష్టి సారించాలి. రివైజ్డ్‌ పే స్కేల్స్‌ (ఆర్‌పీఎస్‌)-2016 ప్రకారం ఒక్క ఎస్వీయూకు మాత్రమే రూ.25 కోట్లు పెండింగ్‌లో ఉంది. యూజీసీ మంజూరు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటుందనే ఆరోపణలున్నాయి. 

మేజర్‌... మైనర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులు, స్పెషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రామ్స్‌ (శాప్‌), రీసెర్చ్‌ అసోసియేట్‌, రీసెర్చ్‌ ఫెలోషిప్స్‌ను యూజీసీ చాలా తగ్గించింది. వీటిని పెంచాలనే డిమాండ్‌ యూనివర్సిటీ వర్గాల నుంచీ వస్తోంది.

రీసెర్చ్‌ ప్రాజెక్టుల కోసం ఏటా యూజీసీ నోటిఫికేషన్‌ రావాలి. కానీ, ఐదేళ్లుగా నోటిఫికేషన్‌ పెండింగ్‌లోనే ఉంది. 

హైదరాబాదులో యూజీసీ రీజినల్‌ ఆఫీస్‌లో రెండేళ్లుగా ఖాళీగా ఉన్న యూజీసీ జాయింట్‌ సెక్రెటరీ పోస్టును భర్తీ చేయాలి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీల అత్యవసర పనులకు ఈ పోస్టు భర్తీ కాకపోవడంతో ఇబ్బందిగా ఉంది. 

రిటైర్డు కాబోతున్న వారికి ఎమిరిటస్‌ ఫెలోషిప్‌, రీసెర్చ్‌ స్కాలర్లకు బీఎస్‌ఆర్‌ ఫెలోషిప్‌ కోసం బోర్డ్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (బీఎస్‌ఆర్‌) నుంచి నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. 

 రాష్ట్రీయ ఉన్నత శిక్షా అభియాన్‌ (రుసా) రెండో విడత నిధులు ఇంత వరకూ మంజూరు కాలేదు. మొదటి విడత మంజూరు చేసిన నిధులను సక్రమంగా వినియోగించుకోలేని యూనివర్సిటీలపై మరింత పర్యవేక్షణ అవసరం.

యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తేనే కేంద్ర ప్రభుత్వ నిధులు అందుతాయి అనే నిబంధనను మరింత కఠినతరం చేయాల్సి ఉంది. 

 యూనివర్సిటీల్లో పనిచేసే అధ్యాపకులకు పదవీ విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలనే ఆదేశాలను గతంలో యూజీసీ ఇచ్చింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. దీనిపై దృష్టి సారించాలి. 

ఎస్వీయూలోని యూజీసీ అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. మెరుగైన శిక్షణ అందించడానికి అవసరమైన ఆర్థిక వనరులను యూజీసీ సమకూర్చాల్సి ఉంది.

 పద్మావతి యూనివర్సిటీలోని యూజీసీ ఉమెన్‌ స్టడీస్‌ సెంటర్‌కు రావాల్సిన నిధులను మంజూరు చేయలేదు. యూజీసీ గుర్తింపు పొడిగింపు ఇచ్చారు కానీ, నిధులు మంజూరు చేయలేదు. దీని వల్ల 15 మంది అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారు. 


Updated Date - 2021-07-31T08:09:50+05:30 IST