వేటకు విరామం!

ABN , First Publish Date - 2021-04-14T05:09:38+05:30 IST

సముద్రంలో చేపల వేట నిషేధం నేటి అర్ధరాత్రి నుంచి అమలు కానుంది. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం ప్రభుత్వం ఏటా రెండు నెలల పాటు వేట నిషేధం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 15(బుధవారం అర్ధరాత్రి) నుంచి జూన్‌ 14 వరకూ సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. చేపలు గుడ్లు పెట్టే సీజన్‌ కావడంతో ఈ 61 రోజుల పాటు మర, మోటారు బోట్లతో వేటకు వెళ్లకూడదని ఆదేశించింది. సంప్రదాయ తెప్పలతో వేటాడుకోవచ్చని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్‌టీ నెంబరు 92ను జారీ చేసింది.

వేటకు విరామం!
గార : బందరువానిపేట వద్ద పడవను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న మత్స్యకారులు

 సముద్రంలో చేపల వేట నిషేధం

 నేటి అర్ధరాత్రి నుంచి జూన్‌ 14 వరకు అమలు 

 19న నవశకం సర్వే

 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ 

ఎచ్చెర్ల/గార/సోంపేట, ఏప్రిల్‌ 13: సముద్రంలో చేపల వేట నిషేధం నేటి అర్ధరాత్రి నుంచి అమలు కానుంది.   సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం ప్రభుత్వం ఏటా రెండు నెలల పాటు వేట నిషేధం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 15(బుధవారం అర్ధరాత్రి) నుంచి జూన్‌ 14 వరకూ సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  చేపలు గుడ్లు పెట్టే సీజన్‌ కావడంతో ఈ 61 రోజుల పాటు మర, మోటారు బోట్లతో వేటకు వెళ్లకూడదని ఆదేశించింది. సంప్రదాయ తెప్పలతో వేటాడుకోవచ్చని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్‌టీ నెంబరు 92ను జారీ చేసింది. జిల్లాలో 193 కిలో మీటర్ల పొడవునా సుదూర సముద్ర తీరముంది. 11 మండలాల్లో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. సుమారు 3,500 వరకు మోటారైజ్డ్‌ బోట్లు, సంప్రదాయ తెప్పలు ఉన్నాయి. ఏపీ మెరైన్‌ ఫిషింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ -1995 ప్రకారం.. వేట నిషేధ సమయంలో సముద్రంలోకి ఎటువంటి బోట్లు అనుమతించరు. తొలుత మోటార్‌బోట్లపై మాత్రమే నిషేధం విధించారు. ప్రస్తుతం నాటు పడవల్లో కూడా వేట నిషేధం అమలు చేయనున్నారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారులు ఉపాధి కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మత్స్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 9 కోస్టల్‌ జిల్లాల్లో ఒకేసారి ఈ నెల 19న నవశకం సర్వే జరగనుంది. ఒక్కో మోటారైజ్డ్‌ బోటుకు యజ మానితో పాటు ఆరుగురికి,  సంప్రదాయ తెప్పకు ముగ్గురి వంతున ఒక్కొక్కరికి రూ.10 వేలు అందజేస్తారు. ఇందుకోసం బోటుతో పాటు మత్స్యకారుల ఫొటో, వారి బ్యాంకు అకౌంట్‌, ఆధార్‌, రేషన్‌కార్డు, తదితర వివరాలను సర్వే ద్వారా సేకరిస్తారు. ఈ నెల 20, 21 తేదీల్లో నవశకం సర్వే వివరాలు పరిశీలించి, 22, 23 తేదీల్లో సంబంధిత సచివాలయాల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. 25న ఆన్‌లైన్‌లో వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. మే 18న మత్స్యకారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు భరోసా మొత్తం జమ అవుతుంది.  


 పక్కాగా అమలు


జిల్లాలో చేపల వేట నిషేధం పక్కాగా అమలు చేస్తాం.  మోటారు, మరబోట్లతో వేట సాగించేందుకు అవకాశంలేదు.   చేపలు గుడ్లు పెట్టే సీజన్‌ కావడంతో మత్స్యకారులు కూడా సహకరించాలి. 

- పీవీ శ్రీనివాసరావు, జేడీ, మత్స్యశాఖ 

Updated Date - 2021-04-14T05:09:38+05:30 IST