పళ్లాలు మోగించి 'మన్ కీ బాత్' చాటిన రైతన్న
ABN , First Publish Date - 2020-12-28T00:54:03+05:30 IST
కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోజుకో రీతిలో నిరసన ..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్న రైతులు ఆదివారంనాడు మోదీ 'మన్ కీ బాత్' సమయంలో వినూత్న నిరసన తెలిపారు. రైతుల మనసులో మాట వినండంటూ ప్రధాని ప్రసంగం చేస్తున్నంత సేపూ భోజనం పళ్లాలను మోగించి నిరసన తెలిపారు. తద్వారా మోదీ మనసులో మాట తమకు చేరలేదనే సందేశం పంపారు.
ప్రతి నెలా చివరి ఆదివారంనాడు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆదివారం మోదీ మాట్లాడారు. ఇదే సమయంలో, ఢిల్లీ సరిహద్దుల్లో గత నెల రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న రైతులు వంటపాత్రలు, అన్నం కంచాలపై దరువులు వేశారు. ప్రధాని సందేశం తమకు చేరలేదనే సంకేతాలు ఇచ్చారు. ప్రధాని మనసులో మాట వినివినీ అలసిపోయాయమని, ఇకనైనా తమ గోడు వినాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. కరోనా తొలినాళ్లలో పళ్లాలు మోగించి, చప్పుళ్లతో నిరసన తెలపాలని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. రైతులు ఇప్పుడు అదే తరహాలో వంటపాత్రలు మోగించి రైతు గుండె చప్పుళ్లు వినాలంటూ సందేశం పంపారు.