Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధనవంతులకే ఇక పులస రుచి..!

వెండి రూపు.. ‘బంగారం రేటు’!

ఒక చేపే రూ.17 వేల నుంచి 25 వేల మధ్య ధర

అంటే ఐదారు గ్రాముల బంగారం రేటుతో సమానం

పదేళ్లలో వెయ్యి నుంచి రూ.20 వేలకు పైగా చేరిన వైనం

పులసల రాక తగ్గిపోవడమే ప్రధాన కారణం

చేప దొరికితే క్షణాల్లో వాలిపోతున్న పులసప్రియులు

గోదావరిలో ఎక్కడ దొరికినా వేలం ద్వారానే అన్ని అమ్మకాలు

ఇటు ఒడిశా విలసలతో నకిలీ వ్యాపారం

గుర్తించే అనుభవం లేకపోతే బుట్టలో పడ్డట్టే


యానాం: పుస్తెలమ్మెయినా పులస తినాల్సిందే.. ఈ నానుడి ఎలా పుట్టిందో తెలీదుగానీ, ఇప్పుడు ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఒక పులస కొనాలంటే దాని ఖరీదు అరకాసు పైనే. కాసుకు కొంచెం తక్కువ ఉన్నట్టు ఉంది. నిజానికి గోదావరి పులస పులుసు పట్టుకుని మంత్రులు దగ్గరకో, ఓ పెద్ద ఉన్నతాధికారి దగ్గరకో వెళితే, వెళ్లిన పని పూర్తయిపోయేదట. డబ్బుతో కొనలేని పనులు కూడా ఒక్క పులస చక్కబెట్టేసేదని పెద్దలు చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే కోనసీమలో కుండలో పెట్టిన పులస పులుసు ఉందంటే ఆగమేఘాల మీద హైదరాబాద్‌ నుంచి పెద్ద పెద్ద వాళ్లంతా వాలిపోయేవారంటే అతిశయోక్తి కాదు. నిజానికి పులస కొనాలంటే ఐదొందలో, వెయ్యో ఉంటే సరిపోయేది. కానీ ఇది పదేళ్ల కిందటి మాట.


ఐదారేళ్ల నుంచి పులస కావాలంటే రెండు నుంచి ఐదు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. గత రెండేళ్ల నుంచి చూస్తే కిలో పులస పదిహేను వేలకు తక్కువకు దొరకడం లేదు. దాంతో సామాన్యులు, మధ్యతరగతి దాని పేరే తలచుకోవడం మానేశారు. ఈ ఏడాది సీజన్‌ మొదలయ్యాక కేవలం వేలం ద్వారానే పులస కొనుగోలు చేసే పరిస్థితి. గోదావరిలో కొన్నేళ్ల నుంచి పులసలు దొరకడం గగనమైపోయింది. ఒకటీ అరా దొరికితే దాన్ని సొంతం చేసుకునేందుకు చాంతాడంత క్యూ. దీంతో వేలం ద్వారానే కొనుగోళ్లు మొదలయ్యాయి. ఆరోహ వలస జాతికి చెందిన పులసలు సాధారణంగా సముద్రంలో జీవిస్తాయి. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, టాంజానియా వంటి దేశాల నుంచి వచ్చి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి, అక్కడ నుంచి బంగాళాఖాతం మీదుగా వరదల సమయంలో గోదావరిలోకి వచ్చి చేరతాయి. గోదావరి వరద నీరొచ్చి సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టేందుకు ఈ చేపలు గోదావరిలోకి ప్రవేశిస్తాయి.


గుడ్లు పెట్టిన తర్వాత అక్టోబరు నాటికి మళ్లీ సాగరానికి చేరుకుంటాయి. అలా వచ్చి, వెళుతున్న క్రమంలో జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదలు వచ్చినప్పుడు కొన్ని చేపలు జాలర్లకు చిక్కుతాయి. గతంలో ఈ చేపలు ఎక్కువగా ధవళేశ్వరం సమీపంలోను, కోనసీమతోపాటు యానాం తీరంలోనూ దొరికేవి. ఇప్పుడు దాదాపుగా ధవళేశ్వరంలో దొరకడం లేదు. కాస్త ఎక్కువగా యానాం తీరంలోనే పులసల జాడ కనిపిస్తోంది. ఇక్కడ దొరికిన చేపను ఈ సీజన్‌లో తొలుత రూ.20 వేలకు కొనుగోలు చేశారు. ఈమధ్య రెండు పెద్ద పులసలు దొరకకగా, వేలంలో ఒకటి రూ.23 వేలు, మరొకటి రూ.25 వేలకు పాట వెళ్లింది. వీటిని మత్స్యకార మహిళలు పాడుకోగా, మరో రెండు మూడు వేలు వేసుకుని పులసప్రియులకు అమ్మారు. దాంతో బంగారం ధరతో పోల్చి మరీ జనం చర్చించుకోవడం విశేషం.


నైపుణ్యం ఉండాలి..

ధగధగలాడే వెండి రూపులో కనిపించే పులసను గుర్తించడంలో కూడా నైపుణ్యం ఉండాలి. పులసలకు ఉన్న డిమాండును సొమ్ము చేసుకునేందుకు ఒడిశా నుంచి తెచ్చిన విలసలనే పులసలుగా నమ్మించి కొందరు విక్రయాలు సాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇవి పులసలుగానే నమ్మి కొంటున్నారు. సముద్రంలో కాలుష్యం పెరిగిపోవడంతో పులసల రాక తగ్గిపోయిందని నిపుణులు చెబుతుండగా, ప్రస్తుత రేట్లతో ఇదొక ‘గోల్డెన్‌’ పిష్‌గా మారిపోయింది.

Advertisement
Advertisement