పశుగ్రాసం పెంపకానికి చర్యలు

ABN , First Publish Date - 2021-05-08T06:52:34+05:30 IST

రాష్ట్రంలో పశుగ్రాసం కొరతను తీర్చి పశు సంపద ఉత్పత్తిని మరింత ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పశు సంవర్థక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాల కొండయ్య తెలిపారు.

పశుగ్రాసం పెంపకానికి చర్యలు

 పశు సంపద ఉత్పత్తికి ప్రోత్సాహం 

 రూ.250 కోట్ల వ్యయం : పూనం మాలకొండయ్య 

అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పశుగ్రాసం కొరతను తీర్చి పశు సంపద ఉత్పత్తిని మరింత ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పశు సంవర్థక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాల కొండయ్య తెలిపారు. ఇందుకోసం సమగ్ర పశుగ్రాస విధానం 2021-26ను  అమలు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అత్యధిక వృద్ధి సామర్ధ్యంతో జీఎస్డీపీలో 7 శాతం, దేశీయ వ్యవసాయ ఉత్పత్తిలో 26 శాతం ఈ రంగం అందిస్తోందన్నారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో  కీలకంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుకూల వాతావారణ పరిస్థితులు, సమృద్ధిగా వనరుల లభ్యత ఉన్నప్పటికీ వేసవి, కరువు సమయాల్లో పశుగ్రాసం కొరత ప్రధాన సమస్యగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో పశుగ్రాసం పెంచే భూముల పునరుద్ధరణతో పాటు అవసరాలకు సరిపడే గ్రాసం అందించడమే లక్ష్యంగా రూ.250 కోట్ల వ్యయంతో రాబోయే ఐదేళ్లలో సమగ్ర పశుగ్రాస విధానం అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. స్వయం సమృద్ధి సాధించుకునేలా విధానాలు రూపొందించడం, ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు వీలుగా తగిన విధానాలు అమలు చేయనున్నట్లు వివరించారు. కరువు, విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో పాడి రైతులకు 75 శాతం వరకు రాయితీపై పశువుల దాణా, అవసరమైన పనిముట్లు అందించనున్నట్టు వెల్లడించారు. ఎన్‌ఆర్‌జీఎ్‌స, ఎన్‌ఎల్‌ఎం పథకాల కింద పశుగ్రాస అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా రూ.773.94 కోట్ల వ్యయంతో ఐదేళ్ల వ్యవధిలో లక్ష ఎకరాల్లో శాశ్వత పశుగ్రాస పెంపకం చేపట్టనున్నట్టు వివరించారు. లైవ్‌స్టాక్‌ సంబంధిత కార్యక్రమాల ద్వారా ఎంసీసీల ఆధ్వర్యంలో సంవత్సరానికి రూ.154.78 కోట్ల వ్యయంతో 20 వేల ఎకరాల్లో చేపట్టనున్న ఈ కార్యక్రమంలో ఎకరాకు రూ.77,204 ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. పాడి పరిశ్రమ ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. ప్రభు త్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల రాబోయే 5 ఏళ్లలో ప్రస్తుతం 152.63 మెట్రిక్‌ టన్నులుగా ఉన్న పాల దిగుబడి, 850 ఎల్‌ఎంటీ మాంసం ఉత్పత్తి రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు.   


Updated Date - 2021-05-08T06:52:34+05:30 IST