చంద్రబాబు ముందు మూడు ప్రత్యామ్నాయాలు.. వారం రోజుల్లో నిర్ణయం!

ABN , First Publish Date - 2021-09-04T20:57:49+05:30 IST

టీడీపీ నాయకత్వంపై నిర్ణయం వాయిదా పడింది. గురు, శుక్రవారాల్లో రెండు పర్యాయాలుగా జిల్లా, పుంగనూరు ముఖ్యనేతలతో చర్చించిన పార్టీ అధినేత చంద్రబాబు

చంద్రబాబు ముందు మూడు ప్రత్యామ్నాయాలు.. వారం రోజుల్లో నిర్ణయం!

‘పుంగనూరు’ టీడీపీ నాయకత్వంపై నిర్ణయం వాయిదా

అమర్‌.. అనీషారెడ్డి దంపతుల్లో ఒకరు.. చల్లా బాబు


  తిరుపతి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకత్వంపై నిర్ణయం వాయిదా పడింది. గురు, శుక్రవారాల్లో రెండు పర్యాయాలుగా జిల్లా, పుంగనూరు ముఖ్యనేతలతో చర్చించిన పార్టీ అధినేత చంద్రబాబు తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. వారంలోపు మరోసారి సంబంధిత నేతలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు గురు, శుక్రవారాల్లో సంభవించిన పరిణామాల వివరాలిలా వున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీకి సమర్థ నాయకత్వాన్ని అందించి రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా అధినేత చంద్రబాబు కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గురువారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. జిల్లా పరిశీలకులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్రతో పాటు జిల్లాకు చెందిన ముఖ్యనేతలు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, అమరనాథరెడ్డి, దొరబాబు, పులివర్తి నానీ, పుంగనూరు నేతలైన అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, ఎస్‌కే రమణారెడ్డి, మధుసూదన్‌ నాయుడు తదితరులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. శుక్రవారం మరోమారు నల్లారి కిషోర్‌, పుంగనూరు నేతలతో ఒక్కొక్కరినే పిలిచి ఏకాంతంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఎవరికి ఇస్తామన్న దానితో నిమిత్తం లేకుండా నియోజకవర్గానికి ఇంఛార్జిని నియమించాలని అధినేత ఆలోచిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మొదటగా.. పలమనేరు నుంచి మాజీ మంత్రి అమర్‌ను పుంగనూరుకు పంపి, నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. అమర్‌ ఎదుట ఈ ప్రతిపాదన ఉంచగా ఆలోచించుకోవడానికి తనకు కొంత గడువు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. రెండో ప్రత్యామ్నాయంగా ఇపుడున్న ఇంఛార్జి అనీషారెడ్డినే కొనసాగించడం లేదా ఆమె భర్త శ్రీనాధరెడ్డిని నియమించే అంశాన్ని పరిశీలించడం. ఈ రెండూ వీలుకాని పక్షంలో రొంపిచెర్లకు చెందిన చల్లా రామచంద్రారెడ్డి అలియాస్‌ చల్లా బాబును ఇంఛార్జిగా నియమించే ప్రతిపాదనను కూడా అధినేత పరిశీలిస్తున్నారు. వీటిలో ఇదివరకు పుంగనూరుకు ప్రాతినిధ్యం వహించిన అమరనాథరెడ్డినే తిరిగి ఇపుడు ఇంఛార్జిగా నియమించడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని, దానికి అమర్‌ అంగీకరించని పక్షంలో మిగిలిన ప్రత్యామ్నాయాలలో ఒకదాన్ని ఎంచుకుంటారని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమరనాథరెడ్డికి ఆలోచించుకునే గడువు ఇవ్వడం కోసమే వారం పాటు తన నిర్ణయాన్ని చంద్రబాబు వాయిదా వేసుకున్నట్టు సమాచారం. టీడీపీలో జరుగుతున్న ఈ పరిణామాలు పుంగనూరు నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజానీకంలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.

Updated Date - 2021-09-04T20:57:49+05:30 IST