Abn logo
Jun 26 2021 @ 03:26AM

కమ్మనైన కిమ్ము నెయ్యి!

ప్రయత్నం

పంజాబ్‌కు చెందిన కమల్‌జీత్‌ కౌర్‌, కొవిడ్‌ బారిన పడి కోలుకున్న తర్వాత, తనకు రెండోసారి జీవించే అవకాశం దక్కిందని భావించింది. ముగిసిపోతుందనుకున్న జీవితం కొత్తగా చేతికందింది కాబట్టి, దాన్ని మునుపటిలా వృథా చేయకుండా, అందరికీ ఉపయోగపడేలా వినియోగించాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలో అక్షరం ముక్క రాని 50 ఏళ్ల కమల్‌జీత్‌, కమ్మని నెయ్యి వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 


లూథియానా దగ్గరున్న జహంగీర్‌ అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన కమల్‌జీత్‌, పెళ్లి తర్వాత ముంబయికి తరలి వచ్చింది. గాలికి ఊగిసలాడే ఒత్తైన గోధుమ, ఆవాల పొలాలు, ఇంట్లో పండించిన కూరగాయలు, తాజా పాలు, ఘుమఘుమలాడే నెయ్యి వాసనల జ్ఞాపకాలు పెళ్లై ఏళ్లు గడుస్తున్నా ఆవిడను వదిలి పోలేదు. తల్లిగారింట్లో పాడిపశువులు, గడ్డ పెరుగు, కవ్వంతో చిలికి వెన్న తీయడం, కాచి నెయ్యి తయారుచేసుకోవడం... లాంటి మధురమైన జ్ఞాపకాలు కిమ్ము మనసులో మెదలడం మొదలుపెట్టాయి. కొవిడ్‌ కారణంగా, రెండోసారి అందివచ్చిన జీవితావకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో ఆమె గ్రహించేలా చేశాయి. అయితే ఆవిడకు 50 ఏళ్లు. ఈ వయసులో సొంత వ్యాపారం సరైన ఆలోచనేనా? అనే సందేహం వచ్చింది. దాంతో తన ఆలోచనను కుటుంబసభ్యుల ముందు ఉంచింది. భర్త, పిల్లలూ కిమ్ము ఆలోచనను మెచ్చి, భేష్‌ అంటూ భుజం తట్టారు. 


కవ్వంతో చిలికి...

బజార్లో ఎంత ధర పెట్టి కొన్న నెయ్యి అయినా, ఎంతో కొంత కల్తీ ఉంటుంది. పైగా నిల్వ కోసం ప్రిజర్వేటివ్స్‌, రుచి కోసం అడిటివ్స్‌ జోడిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి ఏవీ కలపకుండా, నేరుగా పల్లెల నుంచి పట్టణానికి తాజా నెయ్యిని తెప్పించి అమ్ముదామని నిర్ణయించుకుంది కిమ్ము. నెయ్యి తయారీ కోసం సంప్రదాయ బిలోనా పద్ధతిని అనుసరించింది. పెరుగును కవ్వంతో చిలికి వెన్న తీయడాన్నే బిలోనా అంటారు. ఈ తరహా పద్ధతిలో తీసిన వెన్నతో ఘుమఘుమలాడే నెయ్యి తయారవుతుంది. ఆ విధానం గురించి వివరిస్తూ... ‘‘మా అమ్మ, పిన్ని మజ్జిగ చిలికి వెన్న తీయడం చిన్నప్పటి నుంచీ చూస్తూ పెరిగా. పెళ్లయ్యాక అత్తింట్లోనూ అదే పద్ధతి అనుసరించడం గమనించా. పట్టణాల్లో తాజా నెయ్యి దొరకదు. కాబట్టి ఆ వ్యాపారమే మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నా.


మొదట్లో మా ఇంటి చుట్టుపక్కల దొరికే పాలతోనే నెయ్యిని తయారు చేయడం మొదలుపెట్టా. కానీ ఆ నెయ్యి అంత సంతృప్తికరంగా లేదు. గ్రామాల్లో నెయ్యికి అంతటి రుచి రావడానికి కారణం, అక్కడి పచ్చని గడ్డి, పోషకాలుండే మేత, చిక్కని తాజా పాలు అని గ్రహించాను. అందుకే కొన్ని పశువులను కొని, పుట్టిన ఊర్లోనే పాడిపరిశ్రమ మొదలుపెట్టాను. అక్కడ తయారుచేసిన నెయ్యిని ముంబయికి తెప్పించి కిమ్ముస్‌ కిచెన్‌ పేరుతో పంచుతున్నాను.’’ అంటూ చెప్పుకొచ్చింది కిమ్ము.


కిమ్ముస్‌ కిచెన్‌

తాను తయారుచేసే నెయ్యి జిడ్డుగా ఉండదనీ, పలుచగా, ఘుమఘుమలు వెదజల్లుతూ ఉంటుందనీ, తేలికగా జీర్ణమవుతుందనీ చెబుతోంది కిమ్ము. పశువుల ఫాం సొంతదే కాబట్టి, ఇతరుల మాదిరిగా అదనపు ఖర్చులయ్యే అవకాశం ఉండదు. కాబట్టి, తను తయారుచేసే నెయ్యిని తక్కువ ధరకే విక్రయిస్తున్నట్టు చెప్పుకొచ్చిందామె. కిమ్ముస్‌ కిచెన్‌ అనే వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మొదలైన సామాజిక మాధ్యమాల ద్వారా నెయ్యి విక్రయాలు జరుపుతున్న కిమ్ము తనకొచ్చే నెయ్యి ఆర్డర్లలో 80ు రిపీటెడ్‌ ఆర్డర్లేననీ అంటోంది.