ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా

ABN , First Publish Date - 2022-02-25T08:53:39+05:30 IST

రెండు దశాబ్దాలకు పైగా రష్యాపై పుతిన్‌ పట్టు.. అడ్డొచ్చినవారు నయానో, భయానో దారికి!’ పుష్ప సినిమాలో హీరో.. ఎర్ర చందనం స్మగ్లర్ల దగ్గర కూలీగా చేరి.. భాగస్వామిగా మారి..

ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా

రెండు దశాబ్దాలకు పైగా రష్యాపై పుతిన్‌ పట్టు..

అడ్డొచ్చినవారు నయానో, భయానో దారికి!’

పుష్ప సినిమాలో హీరో.. ఎర్ర చందనం స్మగ్లర్ల దగ్గర కూలీగా చేరి.. భాగస్వామిగా మారి.. 

సిండికేట్‌ శాసించే స్థాయికి ఎదుగుతాడు! 

‘ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా’ అని గర్వంగా క్లెయిమ్‌ చేస్తాడు. స్మగ్లర్‌తో పోల్చడం సరికాదుగానీ.. రష్యా అధ్యక్షుడి పుతిన్‌ కథా అంతే. నిరుపేద కుటుంబంలో పుట్టి కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో జీవనం గడిపి.. వీధి పోరాటాలు చేసి రష్యన్‌ గూఢచార సంస్థలో చేరి ఆపై దేశాధ్యక్షుడిగా మారి, రెండు దశాబ్దాలకు పైగా అప్రతిహత అధికారం చలాయిస్తున్న పుతిన్‌ చరిత్ర ఆద్యంతం ఆసక్తికరం. ప్రస్తుత ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో ఆ కథ మీకోసం..


‘‘చెచెన్యాలో మీ దళాలు విచక్షణరహితంగా మందుపాతరలను అమర్చడం వల్ల అమాయకులైన ప్రజలు చనిపోతున్నారు కదా?’’

...దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఫ్రాన్స్‌కు చెందిన ఒక పాత్రికేయుడు పుతిన్‌ను అడిగిన ప్రశ్న ఇది.

‘‘నువ్వు ఇస్లామిక్‌ ఉగ్రవాదివి కావాలనుకుంటే.. సున్తీ చేయించుకోవాలనుకుంటే.. నిన్ను మాస్కోకు ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే, మాది విభిన్న మతాలవారు ఉండే దేశం. సున్తీ చేయడంలో మా దగ్గర నిపుణులున్నారు.’’


..ఫ్రెంచ్‌ పాత్రికేయుడి ప్రశ్నకు పుతిన్‌ కోపంగా చెప్పిన సమాధానమిది. అమాయక పౌరుల ప్రాణాల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఒక దేశాధ్యక్షుడు ఇంత కటువుగా, కర్కశంగా సమాధానం చెప్పాల్సిన పని లేదు. కానీ.. అదే పుతిన్‌ శైలి. స్థిరమైన అభిప్రాయాలు... చావో రేవో, అనుకున్న పనిని పూర్తిచేయడం.. ఇవీ పుతిన్‌ లక్షణాలు.


‘‘యుద్ధం అనివార్యమైతే.. మొదటి దెబ్బ మనదే కావాలి. యాభై ఏళ్ల క్రితం లెనిన్‌గ్రాడ్‌ వీధులు నాకు నేర్పిన పాఠమిది’’.. ఇదీ పుతిన్‌ బలంగా నమ్మి, ఆచరించే సిద్ధాంతం. 2015 అక్టోబరులో ఆయనే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మనస్తత్వానికి మూలాలు ఆయన బాల్యంలో ఉన్నాయి. 1952లో రష్యాలోని లెనిన్‌గ్రాడ్‌ (నేటి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌) లో జన్మించిన పుతిన్‌ది చాలా పేద కుటుంబం. చిన్నప్పుడు పుతిన్‌ పెరిగిన వాతావరణమంతా ఆయనలో ‘స్ట్రీట్‌ ఫైటర్‌’ మనస్తత్వం పెరగడానికి కారణమైంది. పేదరికమో.. ఆకలో.. కారణమేదైనాగానీ, అక్కడి పిల్లలంతా చాలా మొరటుగా ఉండేవారు. వారిని ఎదుర్కొని జీవించాలంటే యుద్ధ విద్యలు నేర్చుకోవడం అవసరమని భావించిన పుతిన్‌ చిన్నవయసులోనే జూడో, రష్యా యుద్ధకళ అయిన సాంబో నేర్చుకున్నారు. ఎప్పటికైనా కేజీబీ (రష్యా గూఢచార సంస్థ) లో చేరాలని ఆ వయసులోనే నిర్ణయించుకున్నారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ హైస్కూల్లో విద్యను అభ్యసించిన పుతిన్‌.. లెనిన్‌గ్రాడ్‌ స్టేట్‌ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివి.. పీహెచ్‌డీ కూడా పూర్తిచేశారు. 1975లో రష్యన్‌ గూఢచార సంస్థ కేజీబీలో చేరి 1990 దాకా అందులోనే కొనసాగారు. 1985-90 నడుమ జర్మనీలో ట్రాన్స్‌లేటర్‌గా (అండర్‌కవర్‌ ఏజెంట్‌) పనిచేశారు. 1989లో డ్రెస్డెన్‌లోని కేజీబీ కార్యాలయాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకులు చుట్టుముట్టినప్పుడు రక్షణ కోసం పుతిన్‌ పై అధికారిని సంప్రదించారు. అప్పుడా అధికారి.. ‘‘మాస్కో నుంచి ఆదేశాలు రానిదే మనం ఏమీ చేయలేం. మాస్కో నిశ్శబ్దంగా ఉంది’’ అని సమాధానమిచ్చారు. ‘‘మాస్కో నిశ్శబ్దంగా ఉంది’’ అనే మాట పుతిన్‌ను చాలా బలంగా తాకింది. ‘‘అప్పుడు నాకు.. ‘అసలు మన దేశమే లేదు’ అనే భావన కలిగింది. సోవియెట్‌ యూనియన్‌ బలహీనమవుతోందని.. అధికార పక్షపాతంతో, మందులేని వ్యాధితో బాధపడుతోందని అనిపించింది’’ అని పుతిన్‌ ఒక సందర్భంలో చెప్పారు. సోవియెట్‌ యూనియన్‌ ప్రాభవం గురించి తెలిసిన పుతిన్‌.. గత వైభవాన్ని రష్యాకు మళ్లీ తీసుకురావాలని అప్పుడే నిశ్చయించుకున్నారు.


అధికార నిచ్చెన మెట్ల పైకి..

1991లో కేజీబీకి రాజీనామా చేసిన పుతిన్‌ మళ్లీ లెనిన్‌గ్రాడ్‌కు చేరుకున్నారు. అప్పటికి ఆ నగర మేయర్‌గా పనిచేస్తున్న తన గురువు అనటోలీ సోబ్‌చాక్‌ వద్ద విదేశీ వ్యవహారాల సలహాదారుగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1998 నాటికి అప్పటిఅధ్యక్షుడు బోరిస్‌ ఎల్త్సిన్‌ విశ్వాసం చూరగొని ఫెడరల్‌ సర్వీసెస్‌ బ్యూరో చీఫ్‌ అయ్యారు. ఎల్త్సిన్‌ పుతిన్‌ను తన రాజకీయ వారసుడిగా భావించేవారు. ఈ క్రమంలోనే 1999 డిసెంబరు 31న ఎల్త్సిన్‌ తన పదవికి రాజీనామా చేయడంతో పుతిన్‌ రష్యా యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ అయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడయ్యారు. చెచెన్‌ తిరుగుబాటుదారులను ఉక్కుపాదంతో అణచివేయడం ద్వారా పాలనపై తనదైన ముద్ర వేశారు. ఎల్త్సిన్‌ హయాంలో రాజకీయంగా ఊడలు దించి పాతుకుపోయిన ఓలిగార్క్‌లపై దృష్టి సారించారు.  ‘‘మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నంతవరకూ.. నేను మీ వ్యాపారాలకు అడ్డురాను. ప్రైవేటీకరణలో భాగంగా మీరు కొనుక్కున్న సంస్థలు, ఆస్తులను మళ్లీ జాతీయం చేయను’’ అని వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు ఒప్పుకోని వారిని రకరకాల కేసుల్లో ఇరికించి అడ్డుతప్పించుకున్నారు.


రెండో చెచెన్‌ వార్‌తో ‘మ్యాన్‌ ఆఫ్‌ యాక్షన్‌’గా పేరు తెచ్చుకున్నారు. సోవియెట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన తర్వాత నిస్తేజంగా మారిన రష్యాను ఇలా దూకుడుగా నడుపుతున్న పుతిన్‌ వ్యవహారశైలి ఆ దేశ యువతకు బాగా నచ్చింది. దీంతో వారు ఆయనకు బ్రహ్మరథం పట్టడం ప్రారంభించారు. ఫలితంగా 2004లో పుతిన్‌ మరోసారి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విమర్శించిన మీడియాపై ఉక్కుపాదం మోపడం ద్వారా తనను విమర్శించేవారే లేకుండా చేసుకున్నారు. అన్ని వ్యవస్థలనూ కేంద్రీకృతం చేసి, తన ఏకఛత్రాధిపత్యం కిందికి తీసుకొచ్చారు. జార్‌ చక్రవర్తుల కాలంలో రష్యాలో ఉన్న భూభాగమంతా రష్యాలో భాగమేనన్నది పుతిన్‌ భావన. ఉదాహరణకు.. ఉక్రెయిన్‌ విషయానికే వస్తే.. ఆ దేశానికి ఒక ప్రత్యేక చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు లేవని, అది రష్యాలో భాగమేనని, రష్యన్‌ సంస్కృతే ఉక్రెయిన్‌ సంస్కృతి అని పుతిన్‌ భావిస్తారు. ఆ ఒక్క దేశమే కాదు సోవియెట్‌ యూనియన్‌ నుంచి విడిపోయిన దేశాలన్నీ కూడా అంతేనని.. కాబట్టి, యూరప్‌ తూర్పు ప్రాంతమంతా రష్యా కనుసన్నల్లో ఉండాలని, తమ ప్రభావం ఉండాలని, అక్కడ తమ పట్టు సడలకూడదని బలంగా విశ్వసిస్తారు. ’’’


2036 దాకా..

రష్యా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టకూడదు. అందుకే 2008లో ఆయన దిమిత్రీ మెద్వెదేవ్‌ను అధ్యక్ష పదవికి రంగంలోకి దింపి గెలిపించారు. తాను ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 2012లో మెద్వెదేవ్‌ పదవీకాలం పూర్తికాగానే మరోసారి తాను అధ్యక్ష పదవి చేపట్టారు. 2014లో క్రిమియాను రష్యాలో కలిపేయడం ద్వారా మరోసారి రష్యన్ల మనసు చూరగొన్నారు. మెద్వెదేవ్‌ హయాంలో చేసిన రాజ్యాంగ సవరణ కారణంగా రష్యా అధ్యక్ష పదవీకాలం ఆరేళ్లకు పెరిగింది. 2018లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతినే మరోసారి గెలిచారు. అంతటితో ఆగలేదు.. తనకు మరో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీచేసే వీలు కల్పించే చట్టంపై గత ఏడాదే సంతకం చేశారు. తద్వారా.. 2036 దాకా తానే అధికారం చలాయించడానికి మార్గం సుగమం చేసుకున్నారు. పుతిన్‌ అధ్యక్షుడుగా ఉన్న 2000-2008 మధ్య రష్యా జీడీపీ 70ు పెరిగింది. పెట్టుబడులు 125ు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరం తర్వాత ఆటోమొబైల్‌ పరిశ్రమ పుంజుకోవడం.. అపార సహజవాయు వనరులున్న రష్యాకు మరింత కలిసొచ్చింది. దేశ కలిమిని పెంచడం కూడా ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. 




విలాసపురుష్‌

రష్యాలాంటి అతిపెద్ద దేశాన్ని రెండు దశాబ్దాలకు పైగా ఏకఛత్రాధిపత్యంతో పాలిస్తున్న పుతిన్‌ ఆస్తి.. ఆయన విలాసజీవితం, అందమైన ప్రియురాళ్లు, ఆయన దగ్గరున్న కార్లు, ఖరీదైన యాట్లు.. ఇవన్నీ ఎప్పుడూ చర్చల్లో నలుగుతూ ఉంటాయి. అనధికారిక లెక్కల ప్రకారమే పుతిన్‌ ఆస్తులు దాదాపు రూ.20 వేల కోట్ల దాకా ఉంటాయని అంచనా. పుతిన్‌ నివసించే విలాసవంతమైన భవంతి విలువ దాదాపుగా రూ.రెండు వేలకోట్ల దాకా ఉంటుందని చెబుతారు. అధ్యక్షుడిగా ఆయన జీతం నెలకు దాదాపు కోటి రూపాయలు. నిజమో, అబద్ధమో తెలియదుగానీ.. 43 విమానాలు, నాలుగు యాట్లు (విలాసవంతమైన పడవలు), 700 కార్లు, 15 హెలికాప్టర్లు, బంగారు టాయిలెట్‌తో కూడిన జెట్‌ విమానం, రూ.50 కోట్ల విలువైన చేతిగడియారాలు ఆయన వద్ద ఉన్నట్టు కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 

Updated Date - 2022-02-25T08:53:39+05:30 IST