క్వారంటైన్‌లు ఖాళీ

ABN , First Publish Date - 2020-05-04T10:59:05+05:30 IST

కరోనా కట్టడికి వేములవాడ, బద్దెనపల్లి, గొల్లపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లు, జిల్లా ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ కేంద్రం ఆదివారం ఖాళీ అయ్యాయి.

క్వారంటైన్‌లు ఖాళీ

 వేములవాడలో కట్టడిప్రాంతాల ఎత్తివేత

హోం క్వారంటైన్‌లో 978 మంది 

కరోనా సేఫ్‌లో సిరిసిల్ల జిల్లా 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): కరోనా కట్టడికి వేములవాడ, బద్దెనపల్లి, గొల్లపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లు, జిల్లా ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ కేంద్రం ఆదివారం ఖాళీ అయ్యాయి.  వేములవాడ నుంచి మర్కజ్‌కు వెళ్లివచ్చిన నలుగురిలో ముగ్గురికి పాజిటివ్‌ రాగా హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  వారి నుంచి ఇతరులకు కరోనా వ్యాప్తి చెందలేదు. ఇంతకుముందు జిల్లా వ్యాప్తంగా 128 మంది అనుమానితుల నుంచి శాంపిళ్లు సేకరించగా 125 మందికి నెగెటివ్‌ వచ్చింది. వేములవాడ మండలంలో 70 మంది, తంగళ్లపల్లి ఏడుగురు, ఇల్లంతకుంట నలుగురు, ఎల్లారెడ్డిపేట 14, సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో 15, చందుర్తి నలుగురు, గంభీరావుపేట ముగ్గురు, ముస్తాబాద్‌లో నలుగురికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 125 మందికి నెగెటివ్‌ వచ్చింది.


పాజిటివ్‌ వచ్చిన ముగ్గురికి నెగెటివ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇతర దేశాల నుంచి జిల్లాకు వచ్చిన 1032 మంది హోం క్వారంటైన్‌ను పూర్తి చేశారు.  ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారిలో 978 మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు.   అధికార యంత్రాంగం లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.  అరెంజ్‌ జోన్‌లో ఉన్న జిల్లా  గ్రీన్‌ జోన్‌వైపు అడుగులు వేస్తోంది.  ఈ నెల 7న లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత వచ్చే సడలింపుల కోసం ప్రజలు అసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


 వేములవాడలో కట్టడిప్రాంతాల ఎత్తివేత  

వేములవాడ: వేములవాడ పట్టణంలోని సుభాష్‌నగర్‌, ఉప్పుగడ్డ వీధిలో కట్టడిప్రాంతాలను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశాలతో ఆదివారం ఎత్తివేశారు. మర్కజ్‌ వెళ్లి వచ్చిన సుభాష్‌నగర్‌కు చెందిన ఓ యువకుడికి ఏప్రిల్‌ 8వ తేదీన కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ ప్రాంతాన్ని కట్టడిప్రాంతంగా ప్రకటించారు. రాకపోకలను నిషేధించారు. మర్కజ్‌ వెళ్లివచ్చిన మిగతా ముగ్గురిలో మరో ఇద్దరికి ఏప్రిల్‌ 18న కరోనా పాజిటివ్‌గా తేలడంతో సుభాష్‌నగర్‌తోపాటు ఉప్పుగడ్డ ప్రాంతాన్ని కట్టడిప్రాంతంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం ద్వారా  నిత్యావసరాలు సరఫరా చేశారు. 

 

అధికారుల పర్యటన 

సుభాష్‌నగర్‌ ప్రాంతంలో డీఎస్పీ చంద్రకాంత్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఎ.సుమన్‌మోహన్‌రావు తదితరులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని ప్రజలకు మైక్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులు ఈ నెల 21వ తేదీ వరకు హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, కమిషనర్‌ మట్ట శ్రీనివాసరెడ్డి, వైద్యాధికారి డాక్టర్‌ రేగులపాటి మహేశ్‌రావు, ఎస్సై రఫీక్‌ఖాన్‌ ఉన్నారు.  

Updated Date - 2020-05-04T10:59:05+05:30 IST