రాఫెల్స్ ల్యాండయ్యాయి, కానీ రాహుల్ అక్కడే ఉన్నారు: రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2021-09-02T20:17:07+05:30 IST

రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారంపై తరచు కేంద్రంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్..

రాఫెల్స్ ల్యాండయ్యాయి, కానీ రాహుల్ అక్కడే ఉన్నారు: రాజ్‌నాథ్

కెవాడియా: రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారంపై తరచు కేంద్రంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. రాఫెల్స్ ల్యాండయ్యాయి కానీ రాహుల్ మాత్రం టేకాఫ్ కాలేదని అన్నారు. కెవాడియాలో గురువారం ప్రారంభమైన మూడు రోజుల గుజరాత్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సెషన్‌లో రాజ్‌నాథ్ మాట్లాడారు. రక్షణ సామగ్రి సేకరణపై మాట్లాడుతూ, రాఫెల్‌ను కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఒక అంశం చేశాయని, ఈ విమానాలు ఇప్పుడు ఇండియాలో ల్యాండ్ అయ్యాయని, రాహుల్ మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఇంతవరకూ టేకాఫ్ తీసుకోలేదని అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడంపై విపక్షాల వైఖరిని తప్పుపట్టారు. విపక్షాలు ఉన్నదే వ్యతిరేకించడానికనే భావం వల్లే పార్లమెంటు సమావేశాలకు అంతరాయాలు ఏర్పడ్డాయని అన్నారు. కాంగ్రెస్ కేవలం తమను తాము ప్రమోట్ చేసుకోవడానికే పరిమితమవుతూ, ప్రజాస్వామ్యాన్ని, మహాత్మాగాంధీల పేరును దుర్వినియోగం చేస్తోందని తప్పుపట్టారు. గాంధీ పేరును గరిష్టంగా వాడుకుంటూ, గాంధీజీ ఆశయాలను సాకారం చేయడంలో మాత్రం మరిచిపోయారని అన్నారు. అవినీతిని వ్యవస్థాగతం చేశారని పేర్కొన్నారు.


ప్రధాని మోదీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పాలనలో జవాబుదారీతనాన్ని పోలుస్తూ, గతంలో 100 పైసలకు 16 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతున్నాయనే ఫిర్యాదులు వచ్చావని, మోదీ హయాంలో డీబీటీ ద్వారా లబ్ధిదారుల అకౌంట్లలోకే సొమ్ములు నేరుగా చేరుతున్నాయని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజావిశ్వాసంతో గెలుపు సాధించడంలో బీజేపీ ముందుంటుందని, యూపీ, గుజరాత్ ఎన్నికల పరిణామాలపై కేవలం భారతీయులే కాకుండా విదేశాల్లోని రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారని అన్నారు. కాగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మీట్‌లో పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, కేంద్ర మంత్రి-గుజరాత్ ఇన్‌చార్జి భూపేంద్ర యాదవ్, పర్షోత్తమ్ రూపాల, దర్శన జర్దోష్, దేవుసిన్హ్ చౌహాన్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-02T20:17:07+05:30 IST