కోవిడ్ సెకండ్ వేవ్‌కు కారణం కేంద్రం విధానాలే : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-04-10T19:38:41+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ట్వీట్ల పోరు కొనసాగిస్తున్నారు

కోవిడ్ సెకండ్ వేవ్‌కు కారణం కేంద్రం విధానాలే : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ట్వీట్ల పోరు కొనసాగిస్తున్నారు. ఆయన శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, దేశంలో భయానక కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్‌కు కారణం కేంద్ర ప్రభుత్వ విఫల విధానాలేనని దుయ్యబట్టారు. వలస కార్మికులు మళ్ళీ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యాక్సినేషన్‌ను పెంచడంతోపాటు ప్రజల చేతుల్లో డబ్బు పెట్టవలసిన అవసరం ఉందన్నారు. సామాన్యులు జీవించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ఇది అవసరమని చెప్పారు. కానీ మంచి సలహాలంటే ఈ దురహంకార ప్రభుత్వానికి ఎలర్జీ అని, ఇష్టం ఉండదని అన్నారు. 


రాహుల్ గాంధీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ల ఎగుమతులను నిలిపేయాలని డిమాండ్ చేశారు. కరోనా సంక్షోభం పెరుగుతున్న సమయంలో వ్యాక్సిన్ల కొరత చాలా తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. దేశ ప్రజలను రిస్క్‌లోకి నెట్టి, వ్యాక్సిన్లను ఎగుమతి చేయడం సరైనదేనా? అని ప్రశ్నించారు. 


మన దేశంలో కోవిడ్-19 నిరోధక వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభంలో ఆరోగ్య సంరక్షకులకు, కోవిడ్ మహమ్మారిపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్నవారికి వ్యాక్సిన్ ఇచ్చారు. 45 సంవత్సరాల వయసు పైబడిన అర్హులకు ఈ నెల 11 నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతోందని, దీనిని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ప్రధాన మోదీకి రాసిన లేఖలో, అవసరమైనవారందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. పక్షపాతం లేకుండా అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలన్నారు. 




Updated Date - 2021-04-10T19:38:41+05:30 IST