షారూక్...దేశం మీ వెంటే ఉంది: రాహుల్ గాంధీ లేఖ

ABN , First Publish Date - 2021-11-03T23:12:27+05:30 IST

''యావత్ దేశం మీతో ఉంది'' అని బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌కు కాంగ్రెస్..

షారూక్...దేశం మీ వెంటే ఉంది: రాహుల్ గాంధీ లేఖ

న్యూఢిల్లీ: ''యావత్ దేశం మీతో ఉంది'' అని బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌కు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఆ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలపై ఆర్యన్ ఖాన్ జైలులో ఉన్నప్పుడు అతని తండ్రి షారూక్‌ ఖాన్‌కు సినీ పరిశ్రమ దిగ్గజాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని అధికార శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నుంచి మద్దతు లభించింది. ఆ సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం షారూక్‌కు లేఖ రాశారు. ఆర్యన్ ఖాన్‌ను ఆర్ధర్ రోడ్డు జైలుకు పంపిన ఆరు రోజుల తర్వాత..అంటే అక్టోబర్ 14న రాహుల్ గాంధీ ఈ లేఖ రాశారు. ఆ సమయంలో 23 ఏళ్ల ఆర్యన్‌కు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఎట్టకేలకు అక్టోబర్ 28న ముంబై హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ డాక్యుమెంట్లు జైలుకు చేరిన తర్వాత గత శనివారంనాడు ఆర్యన్ జైలు నుంచి బయటకు వచ్చారు. గత అక్టోబర్ 2న క్రూయిజ్ షిప్ పార్టీపై ఎన్‌సీబీ అధికారులు జరిపిన దాడిలో ఆర్యన్ ఖాన్‌ అరెస్టయ్యారు. అప్పటి నుంచి సుమారు నెల రోజుల పాటు ఆయన జైలులోనే గడిపారు.


ఆర్యన్ వద్ద డ్రగ్స్ పట్టుబడనప్పటికీ, మాదక ద్రవ్యాల అక్రమ డీల్స్‌తో ఆయనకు ప్రమేయం ఉందనే విషయం ఆయన వాట్సాప్ ఛాట్స్ చెబుతున్నాయని ఎన్‌సీబీ వాదించింది. వాట్సాప్ ఛాట్స్ ఒక్కటే ఆర్యన్‌కు డ్రగ్స్ సరఫరా అయ్యాయనే విషయాన్ని నిర్ధారించ లేవని హైకోర్టు పేర్కొంది. అనంతరం పలు షరతులతో ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే షారూక్‌ను ఎన్‌సీబీ టార్గెట్‌గా చేసుకుందని శివసేన, ఎన్‌సీపీ ఆరోపించాయి.

Updated Date - 2021-11-03T23:12:27+05:30 IST