రాహుల్ నువ్వు నా బిడ్డవే... నర్సు భావోద్వేగం

ABN , First Publish Date - 2021-08-19T19:20:53+05:30 IST

'నాయనా రాహుల్... నువ్వు నా కళ్లముందే పుట్టావు. నవ్వు నా బిడ్డవే. అందరికంటే ముందు నిన్ను నేనే చూశాను' అంటూ...

రాహుల్ నువ్వు నా బిడ్డవే... నర్సు భావోద్వేగం

న్యూఢిల్లీ: 'నాయనా రాహుల్... నువ్వు నా కళ్లముందే పుట్టావు. నవ్వు నా బిడ్డవే. అందరికంటే ముందు నిన్ను నేనే చూశాను'...అంటూ పొంగిపోయింది కేరళ నర్సు రాజమ్మ వవతిల్. 1970 జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టీ పుట్టగానే ఆ పసిగుడ్డును చేతుల్లో ఎత్తుకుని ముసిరిపోయిన నర్సు రాజమ్మనే. ఇన్నాళ్లకు మళ్లీ రాహుల్‌ను చూడటంతో ఆమె భావోద్వేగానికి గురైంది. రాహుల్ సైతం ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. తన ఆనందం పంచుకున్నారు. వయనాడ్ నియోజకవర్గంలో రాహుల్ ఈ వారం ప్రారంభంలో పర్యటించినప్పుడు ఆయనను రాజమ్మ కలుసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియాను కేరళ కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. రాహుల్ తన కారులో ఉండగా ఆయనకు అభినందలు తెలుపుతూ ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.




రాహుల్‌కు మిఠాయిల ప్యాకెట్‌ను రాజమ్మ అందజేసింది. తన కుమారుడిని రాహుల్‌కి పరిచయం చేస్తూ, ఆయనతో మాట్లాడమని చెప్పింది. ''నా కళ్లముందే రాహుల్ పుట్టాడు. నువ్వు పుట్టక ముందే నేను అతన్ని చూశాను. ఆ సమయంలో ఎవరు అడిగినా రాహుల్‌ను ఇవ్వడానికి ఇష్టపడలేదు నేను'' అంటూ చెప్పుకొచ్చింది. అమ్మ (సోనియాగాంధీ) ఎలా ఉన్నారంటూ రాహుల్‌ను కుశల ప్రశ్నలు అడిగింది. మా ఇంటి నుంచి చాలా తెచ్చి ఇద్దామనుకున్నాను కానీ, నీకు సమయం లేదు. ఆ విషయం నేను అర్ధం చేసుకోగలను అంటూ రాహుల్‌తో చెబుతూ మురిసిపోయింది. ఇందుకు ప్రతిగా రాహుల్ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. భగవంతుడు నీకు మేలు చేయాలంటూ రాహుల్‌ను రాజమ్మ ఆశీర్విదించింది. ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రుల్లో రాహుల్ గాంధీ పుట్టగా, రాజమ్మ 1987లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కేరళ తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె కల్లారులో నివసిస్తోంది.

Updated Date - 2021-08-19T19:20:53+05:30 IST