రైల్వే లైన్‌ కదిలేనా..

ABN , First Publish Date - 2021-10-01T07:08:04+05:30 IST

కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణ పనుల పురోగతిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు.

రైల్వే లైన్‌ కదిలేనా..
కోటిపల్లి - శానపల్లిలంక మధ్య వారధి నిర్మాణ దృశ్యం

  • కోటిపల్లి-నర్సాపురం రైల్వే ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్ష
  • సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌తో సమీక్షించిన పీఎం 8 భూసేకరణపై ఆరా
  • ప్రాజెక్టు పనులపై జీఎంతో జిల్లా ఎంపీల భేటీ
  • పనులు వెంటనే కొనసాగించాలని ఎంపీల సూచన

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణ పనుల పురోగతిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పురోగతిపై బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌తో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. రాష్ట్రంలో కీలకమైన రైల్వే  ప్రాజెక్టుల్లో ఒకటైన కోటిపల్లి- నర్సాపురం రైల్వే ప్రాజెక్టు పనులపై సీఎస్‌తో ప్రత్యేకంగా సమీక్షించారు. పనులు ఎంతవరకు వచ్చాయి, ఎందుకోసం ఆగా యనే దానిపై కూడా పీఎం అడిగి తెలుసుకున్నారు. కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు రైల్వే ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణలో కొంత జాప్యం జరుగుతుం దన్న విషయాన్ని అధికారులు గ్రహించారు. త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసి ప్రాజెక్టు పురోగభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదే శించారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం అనంతరం తొలగించబడిన కాకినాడ -కోటిపల్లి ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయింది. కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు గౌతమీ, వైనతేయ, వశిష్ఠ నదుల మధ్య వారధుల నిర్మాణానికి కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పిలిచిన టెండర్లతో పనులు శరవేగంగా సాగాయి. ఇక కోటిపల్లి- శానపల్లిలంక మధ్య వారధి పనులు ఇప్పటికే దాదాపు పూర్తికావొచ్చాయి. బోడస కుర్రు-పాశర్లపూడి, దిండి-చించినాడ మధ్య వంతెనల నిర్మాణ పనులు జరుగు తున్నాయి. రైల్వే ట్రాక్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విషయంలో రెవె న్యూ అధికారులు కసరత్తు కొనసాగిస్తున్నారు. వారధుల నిర్మాణం పూర్తయినప్ప టికీ మిగిలిన పనులకు రైల్వేశాఖ టెండర్లు పిలవాల్సి ఉందని భావిస్తున్నారు. 

రైల్వే జీఎంతో ఎంపీల సమావేశం..

కాగా కోటిపల్లి-నర్సాపురం రైల్వే ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులను తన వాటాగా ఇవ్వాల్సి ఉంది. గత కొన్నేళ్ల నుంచి ఈ నిధుల విడుదలలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే రైల్వేశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల విడుదల కోరుతూ లేఖలు రాసింది. లేనిపక్షంలో పనులు నిలిపి వేస్తు న్నట్టు కూడా గత కొన్ని నెలల కిందటే అల్టిమేటం జారీచేసింది. కాగా గురు వారం దక్షిణమధ్య రైల్వే జీఎంతో రాష్ట్ర ఎంపీలు సమావేశమయ్యారు. దీనిలో భాగంగా అమలాపురం ఎంపీ చింతా అనురాధతోపాటు ఎంపీలు మార్గాని భరత్‌, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, వంగా గీత పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల కొరత కారణంగా చూపి ప్రాజెక్టులు నిలిపి వేయడం తగదని, పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని జీఎంను కోరారు. అయితే మార్గదర్శకాలను అనుస రించి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్టు సమాచారం. ము ఖ్యంగా  కోటిపల్లి-నర్సాపురం ప్రాజెక్టుకు రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులు కేటాయించక పోవడంతో ప్రాజెక్టు పనులకు బ్రేక్‌ పడింది. ఈ విషయంపై ఎంపీలు కూడా జీఎంతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ప్రధాని మోదీ సమీక్షతో కోనసీమ రైల్వే లైన్‌ ప్రాజెక్టు పనులకు త్వరలోనే మోక్షం కలిగే అవకాశం ఉందని కోనసీమవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-10-01T07:08:04+05:30 IST