ఆమెకు 17 లక్షలు చెల్లించాల్సిందే.. రైల్వేకు ఆదేశాలు జారీ

ABN , First Publish Date - 2021-08-09T02:29:52+05:30 IST

రైలు ప్రయాణంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు పోగొట్టుకున్న ఓ మహిళకు రూ. 17 లక్షలు చెల్లించాలంటూ రైల్వేశాఖకు వినియోగదారుల ఫోరం తేల్చిచెప్పింది.

ఆమెకు 17 లక్షలు చెల్లించాల్సిందే.. రైల్వేకు ఆదేశాలు జారీ

హైదరాబాద్: రైలు ప్రయాణంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు పోగొట్టుకున్న ఓ మహిళకు రూ. 17 లక్షలు చెల్లించాలంటూ రైల్వేశాఖకు వినియోగదారుల ఫోరం తేల్చిచెప్పింది. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వేకు ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి పరిహారం రూ.14,01,078తోపాటు ఆమెకు మానసిక వేదన కలిగించినందుకు మరో రూ. 50 వేలు, న్యాయపరమైన ఖర్చుల కింద రూ. 5వేలు, పొగొట్టుకున్న నగదు స్థానంలో రూ. 3 లక్షలు  చెల్లించాలని ఆదేశించింది. శీతల్ కులకర్ణి అనే బాధితురాలు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఫోరం ఈ మేరకు రైల్వే శాఖను ఆదేశించింది. 


2017లో కాచిగూడ-యశ్వంత పూర్ ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు వెళుతున్నప్పుడు ఈ చోరి జరిగింది. దీనిపై ఆమె రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే.. వారు ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టలేదంటూ ఆమె వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. బెంగళూరుకు చేరే క్రమంలో రైలు ఓ ప్రాంతంలో కొద్ది సేపు ఆగిందని, ఆ సమయంలో కొందరు అనుమతి లేకుండా తమ బోగీలోకి వచ్చారని, వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని ఆమె పేర్కొంది. తమ పెట్టెలో ఉండాల్సిన రూ. 15 లక్షల విలువైన బంగారు నగలు, రూ.3 లక్షల నగదు చోరికి గురైనట్టు ఇంటికి వెళ్లాక గుర్తించామని తెలిపింది. ఈ కేసు విషయంలో రైల్వే నుంచి ఆశించిన స్పందన కరువవడంతో వినియోగదారుల ఫోరం‌ను ఆశ్రయించగా.. ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువడింది.

Updated Date - 2021-08-09T02:29:52+05:30 IST