వరదనీటిలో ఫైర్‌ స్టేషన్‌

ABN , First Publish Date - 2021-07-23T07:30:08+05:30 IST

హయత్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌ వరద నీటిలో చిక్కుకుంది.

వరదనీటిలో ఫైర్‌ స్టేషన్‌
వరద నీటిలో మునిగిన హయత్‌నగర్‌ ఫైర్‌స్టేషన్‌

ముంచుతున్న వానలు.. వరదలు

వర్షం వస్తే సిబ్బందికి శివరాత్రి జాగారమే 

రెండు దశాబ్ధాలుగా తడుస్తూనే 

ఏ సమయంలోనైనా ప్రమాదం 


హయత్‌నగర్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): హయత్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌ వరద నీటిలో చిక్కుకుంది. అక్కడ వర్షం కురుస్తుందంటేనే ఫైర్‌ ఆఫీసర్‌తో పాటు సిబ్బంది శివరాత్రి జాగారం తప్పదనే నిర్ణయానికి వస్తారు. రెండు దశాబ్దాలుగా హయత్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌ వర్షం వచ్చిన ప్రతీసారి తడిసి ముద్దవుతోంది. వర్షా కాలంలో తడవడం... ఎండా కాలంలో ఎండడంతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఏ సమయంలో ప్రమాదం ముంచుకు వస్తుందోనన్న భయం సిబ్బందిని వెంటాడుతోంది. వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మరో సారి ఫైర్‌ స్టేషన్‌ నీట మునిగిపోయింది. దీంతో సిబ్బంది ఫైర్‌ స్టేషన్‌లోని ఫైళ్లు, టీవీని తీసి భవనంలోని సజ్జాల మీద పెట్టుకున్నారు. అగ్నిమాపక వాహనాలను ఎత్తయిన ప్రదేశానికి తరలించుకున్నారు. ఫైర్‌ అధికారితో పాటు 8 మంది సిబ్బంది రాత్రంతా అక్కడే జాగారం చేశారు. అప్పటికే ఫైర్‌స్టేషన్‌ చుట్టూ ఐదు అడుగుల మేర వరకు నీరు చేరడంతో ఫర్నీచర్‌ మొత్తం తడిసి ముద్దయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్మగల్‌ హయత్‌నగర్‌లోని ప్రభుత్వ భూమి సర్వేనంబర్‌ 315లో రాఘవేంద్రనగర్‌ కాలనీని ఆనుకుని సుమారు ఎకరంన్నర భూమిని ఫైర్‌స్టేషన్‌ కోసం కేటాయించారు. అప్పట్లో కాలనీలు లేక పోవడంతో వర్షం నీరు నేరుగా కిందకు వెళ్లేది. ప్రస్తుతం ఫైర్‌స్టేషన్‌ చుట్టూ కాలనీలు ఏర్పడడంతో ఫైర్‌స్టేషన్‌ చుట్టూ ప్రహరీని నిర్మించారు.. దీంతో ఫైర్‌స్టేషన్‌కు వరుణుడి గండం ఏర్పడింది. ఫైర్‌స్టేషన్‌ లోతట్టు ప్రాంతంలో ఉండి చుట్టూ మూడు దిక్కుల గోడ ఉండడంతో కొద్ది పాటి వర్షానికే ఆ ప్రాంతం చెరువును తలపిస్తోంది. వరద వెళ్లే ప్రాంతానికి అడ్డంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఉండడంతో ఫైర్‌ స్టేషన్‌ నీట మునుగుతోంది. కిలోమీటర్‌ దూరంలో ఉన్న హైకోర్టు కాలనీ నుంచి భారీగా వరద నీళ్లు బీడీఎల్‌ కాలనీ, భాగ్యలత, అరుణోదయనగర్‌ మీదుగా ఫైర్‌స్టేషన్‌ చేరుకుంటాయి. 

ఇరుకు గల్లీల్లో ఫైర్‌స్టేషన్‌

ఫైర్‌స్టేషన్‌ను రహదారిపైన కాకుండా కాలనీల మధ్య గల్లీల్లో ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగినప్పుడు వెళ్లాల్సిన అగ్నిమాపక వాహనం ప్రధాన రోడ్డు ఎక్కడానికి వాహనాలు అడ్డురాకుంటే సుమారు ఐదు నిముషాలు పడుతోంది. ఇటీవల ఫైర్‌స్టేషన్‌ రోడ్డులో కూరగాయల సంతను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అగ్నిమాపక వాహనం రాకపోకలకు మరింత ఇబ్బంది కలుగుతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, ఫైర్‌ ఉన్నతాధికారులు తమకు ఏమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. 

ట్రంకు లైను ఏర్పాటుతో పరిష్కారం

ఫైర్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ కార్యాలయం పక్క నుంచి బస్‌డిపో రోడ్డు గుండా కుమ్మరికుంట చెరువు వరకు 12 ఎంఎం డయాతో ట్రంకు లైను ఏర్పాటు చేసినట్లయితే సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. భూమికి సమాంతరంగా నిర్మించిన ఫైర్‌స్టేషన్‌ ఎత్తును కనీసం ఐదు ఫీట్లు పెంచి నిర్మించినట్లయితే వరద ముంపు తప్పే అవకాశం ఉంది. కురుస్తున్న వర్షాలకు భారీ వరదలు ఫైర్‌స్టేషన్‌తో పాటు హయత్‌నగర్‌ కోర్టు, బస్‌ డిపోలు, సరితా మెమోరియల్‌ పాఠశాల, ఎస్సీ బాలుర వసతి గృహం, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ వాటర్‌ సంపులు, కార్యాలయం నీట మునుగుతున్నాయి. 

Updated Date - 2021-07-23T07:30:08+05:30 IST