వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2022-07-14T06:16:31+05:30 IST

జిల్లాలో భారీ వర్షాలు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, వరదలకు తోడుగా బలమైన ఈదురు గాలులు వీస్తుండడంతో భారీ వృక్షాలు కూలడం, ఇళ్లు కూలిపోతున్నాయి.

వర్ష బీభత్సం
జల దిగ్బంధంలో చిక్కుకున్న బిచ్కుంద మండలంలోని మెక గ్రామం

- జల దిగ్బంధం, అంధకారంలో పలు గ్రామాలు

- వరదల తాకిడికి మరికొన్ని గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

- కూలుతున్న ఇళ్లు, చెరువులకు గండ్లు పడుతున్నాయి

- భారీ వర్షాలు, ఈదురు గాలులకు స్తంభించిపోతున్న జన జీవనం

- ప్రధాన రహదారులకు అడ్డంగా కూలుతున్న భారీ వృక్షాలు

- వరద తాకిడికి ప్రాణ నష్టంతో పాటు మూగజీవాల మృతి

- 180 వరకు కూలిపోయిన ఇళ్లు

- 6 వేల ఎకరాలకు పైగా నీట మునిగిన పంటలు

- రహదారులపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలు

- 70 కిలో మీటర్ల మేర పాక్షికంగా దెబ్బతిన్న రహదారులు

- 19 రోడ్లను మూసివేసిన యంత్రాంగం

- 25 విద్యుత్‌ స్తంభాలు నేలమట్టం, రెండు ట్రాన్స్‌ఫార్మర్‌లు ధ్వంసం

- జిల్లా వ్యాప్తంగా 105 మి.మీ వర్షపాతం నమోదు

- నిజాంసాగర్‌లోకి 20వేలకు పైగా ఇన్‌ఫ్లో


కామారెడ్డి, జూలై 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భారీ వర్షాలు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, వరదలకు తోడుగా బలమైన ఈదురు గాలులు వీస్తుండడంతో భారీ వృక్షాలు కూలడం, ఇళ్లు  కూలిపోతున్నాయి. దీంతో ఆస్తి నష్టమే కాకుండా ప్రాణ నష్టం, మూగ జీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. భారీ వరదలకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడమే కాకుండా విద్యుత్‌ సరఫరా లేక అంధకారంలోనే ఉన్నాయి.  బిచ్కుంద మండలంలోని రాజుల్లావాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరివాహక గ్రామమైన మెక గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రామంలోని వరద వస్తుండడంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామానికి వెళ్లే  ఏకైక రహదారి గుండా భారీగా వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి ప్రధాన రహదారులు, బ్రిడ్జిలు, కల్వర్టులపై వరదలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు ప్రాంతాలకు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. రహదారులు సైతం పాక్షికంగా దెబ్బ తింటున్నాయి. ఆరు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం ఏర్పడుతుంది. 4 వేల ఎకరాలకు పైగా పంటలు ఆరు రోజులుగా వరద నీటిలోనే ఉండిపోవడమే కాకుండా పలు చోట్ల కొట్టుకుపోయిన పరిస్థితి ఎదురవుతుంది. ఈదురు గాలులకు విద్యుత్‌ స్తంభాలు నేలమట్టం కావడం, తీగలు తెగిపడి ట్రాన్స్‌ఫార్మర్‌లు ధ్వంసం అవుతున్నాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. జిల్లాలో గడిచిన 24 గంటల్లో 105 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా నస్రుల్లాబాద్‌లో 145 మి.మీ లు, గాంధారి మండలంలో 118 మి.మీ వర్షపాతం నమోదైంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు నీటి మట్టం 8 టీఎంసీలకు చేరింది. అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువుకు పాక్షికంగా గండి పడడంతో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఏస్‌ఈ శ్రీనివాస్‌ పరిశీలించి ఇసుక బస్తాలతో గండిని పూడ్చివేశారు. రాజంపేట మండలం గుండారం చెరువుకు గండిపడి శివారు గ్రామాల్లోకి వరద పోటెత్తింది.

వాటిల్లుతున్న ప్రాణ నష్టం

జిల్లాలో భారీ వర్షాలు వరదల తాకిడికి పలు చోట్ల ప్రాణ నష్టం వాటిల్లుతుంది. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని భారీ వర్షాలతో ఇంట్లోనే ఇనుపతీగపై బట్టలు ఆర వేయడంతో ఆ తీగ తెగి విద్యుత్‌ సరఫరా కావడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే బుధవారం ఎల్లారెడ్డి మండలం పోచారం కాలువలో పశువులను మేపడానికి వెళ్లిన శేఖర్‌(29) అనే యువకుడు  ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. సదాశివనగర్‌, దోమకొండ, భిక్కనూరు, తాడ్వాయి లాంటి మండలాల పరిధిలో భారీ వర్షాలకు పశువుల కొట్టాలు కూలడంతో ఐదు వరకు గేదెలు మృతి చెందాయి. ఇలా జిల్లాలో వరదలు, వర్షాలకు ప్రాణ నష్టం సైతం వాటిల్లుతుంది. వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కూలుతున్న ఇళ్లు.. తెగిపడుతున్న విద్యుత్‌ తీగలు

జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణ కేంద్రాల్లోనే కాకుండా పలు మండలాల్లో గ్రామాల్లో ఇళ్లు కూలుతుండడంతో బాధితులు నిరాశ్రుయులవుతున్నారు. వీరందరికీ అధికారులు పునరావాసం కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 180 ఇళ్లు భారీ వర్షాల కారణంగా కూలిపోవడంతో చాలా కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. పలు కుటుంబాలు ఇళ్లను కోల్పోవాల్సి వచ్చింది. వర్షాలు కురుస్తుండడంతో పాతబడిన ఇళ్లలో నివాసం ఉండే, భవనాలను గుర్తించి వాటిని ఆ ఇళ్లలో నుంచి అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గత రెండు రోజులుగా భారీ వర్షాలతో పాటు బలంగా ఈదురు గాలులు వీస్తుండడంతో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ ప్రధాన రహదారి, ఇళ్ల మధ్య ఉండే భారీ వృక్షాలు కూలిపోతున్నాయి. అంతేకాకుండా 25 విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో రెండు ట్రాన్స్‌ఫార్మర్‌లు ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా కాక రోజుల తరబడి అంధకారంలోనే ఉంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని కాలనీలో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

19 రహదారులను మూసివేసిన అధికారులు

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. జిల్లాలోని పలుచోట్ల ప్రధాన రహదారులు చెరువులను తలపించేలా దర్శనం ఇస్తున్నాయి. బ్రిడ్జిలు, కల్వర్టులపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇలా భారీ వర్షాలు, వరదల వల్ల కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 70 కి.మీ పరిధిలో రహదారులు ధ్వంసమయ్యాయి. రహదారులు, బ్రిడ్జిలు, కల్వర్ట్‌లపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 19 రూట్లను జిల్లా అధికారులు మూసివేశారు. కామారెడ్డి మండలం లింగాయిపల్లి, రాజంపేటకు వెళ్లే మార్గమధ్యలో కల్వర్టుపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కల్వర్టుకు ఇరువైపుల బారీకేడ్లను, ట్రాక్టర్‌లను అడ్డం పెట్టి రాకపోకలను నిలిపివేశారు. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బ్రాహ్మణపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అంబులెన్స్‌ మధ్యలో చిక్కుకుపోయింది. దీంతో ఏమీ చేయలేక అంబులెన్స్‌ సిబ్బంది తిరిగి వెనక్కి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్సను అందించారు. మద్నూర్‌ మండలంలో లెండివాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. జుక్కల్‌ మండలంలోని సోపూర్‌ వెళ్లే మార్గమధ్యలో కల్వర్టు వరద తాకిడికి కొట్టుకుపోవడంతో కర్ణాటకకు రాకపోకలు నిలిచిపోయాయి. మాదాపూర్‌ కల్వర్టుపై నుంచి నీటిప్రవాహం తీవ్రంగా ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. డొంగావ్‌ కల్వర్టు వద్ద వేసిన తాత్కాలిక రోడ్డు తెగిపోయింది. బిచ్కుంద మండలం, ఖడ్గవ్‌, షెట్లుర్‌ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గుండెకల్లోల్‌, మిషన్‌కల్లాలి గ్రామాల మధ్య ఉన్న ప్రధాన బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. గాంధారి మండలంలోని తిప్పరం, ఉట్నూర్‌ వెళ్లే రోడ్డు బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పిట్లం మండలం కాకివాగు బ్రిడ్జి పక్కన వరద తాకిడికి మొరం కొట్టుకు పోవడంతో ఇరువైపు గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు.

6 వేల పైగా ఎకరాల్లో నీట మునిగిన పంటలు

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో ఆరు రోజులుగా వర్షపు నీరు నిలిచిపోవడం దీనికి తోడు వరద తాకిడి పెరగడంతో జిల్లాలో సుమారు 6,212 ఎకరాల్లో పంటలకు గాను 3,352 మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. 19 మండలాల పరిధిలోని 96 గ్రామాల పరిధిలోని 6,212 ఎకరాలలో పంటలు నీటమునిగాయి. 1,883 ఎకరాలలో సోయాబిన్‌, 2,659 ఎకరాలలో వరి, 1,414 ఎకరాలలో మొక్కజొన్న, 69 ఎకరాలలో పత్తి, 87 ఎకరాలలో కందులు, 60 ఎకరాలలో పెసర్లు, 40 ఎకరాలలో మినుము పంటలు వరద తాకిడికి మునిగిపోవడమే కాకుండా కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీర్కూర్‌, బాన్సువాడ, నస్రూల్లాబాద్‌, బిచ్కుంద తదితర మండలాల్లో వరి పంటలలో భారీగా వరద వచ్చి చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు పంట చేన్లలోనే వరద నిలిచిపోవడంతో మొక్క దశలో ఉన్న సోయా, పత్తి, మొక్కజొన్న, మినుములు, కందులు, పెసర్లు లాంటి పంటలు మురిగిపోతాయని రైతులు చెబుతున్నారు. రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు వర్షపు నీటిలో ఈ పంటలు మునిగిపోతే చేతికి రాదని ఆరు రోజులవుతున్నా ఈ ఆరుతడి పంటల చేన్ల నుంచి వర్షపు నీరు వెళ్లకపోవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అధికారులు అప్రమత్తంగా ఉండాలి

 మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

కామారెడ్డి: అధిక వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల ని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. బుధవారం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌తో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికా రులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ప్రయాణాలు రద్దు చేసుకోవాలని తెలిపారు. అలుగు పారుతున్న చెరువుల వద్దకు, పొంగిపొర్లుతున్న కల్వర్టుల వద్దకు కొంతమంది ఆసక్తితో చూడడానికి వెళ్తారని ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వారిని నియంత్రించాలని తెలిపారు. అన్నిశాఖలను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ గ్రామస్థాయిలో తహసీల్దార్‌లను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. చెరువుల వద్ద, కల్వర్టుల వద్ద, ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నచోట్ల ఆయా గ్రామ వీఆర్‌ఏలను ఉంచి ప్రమాదాలు నిలువరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇరిగేషన్‌ సిబ్బందిని సైతం ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా  ఉంచాలని తెలిపారు. విద్యుత్‌శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలని కరెంట్‌ స్తంభాలు, తెగిపోయిన, వేలాడే కరెంట్‌ తీగల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు కూడా విద్యుత్‌ స్తంభాల వద్దకు వెళ్లకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Updated Date - 2022-07-14T06:16:31+05:30 IST