‘కొమరోలు’ను ముంచిన వర్షం

ABN , First Publish Date - 2021-12-01T05:28:13+05:30 IST

కొమరోలు మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు కొట్టుమిట్టాడుతున్న పంటలు తాజా వాన నీటిలో పూర్తిగా మునిగి దెబ్బతిన్నాయి.

‘కొమరోలు’ను ముంచిన వర్షం
బాదినేనిపల్లి నుంచి కొమరోలు ప్రధానరోడ్డుపై ప్రవహిస్తున్న పులివాగు


మండలంలో కురిసిన వానకు భారీగా వరద

వేలాది ఎకరాల్లో వరికి నష్టం నీటిలో నానుతున్న ఇంకొన్ని పంటలు

ఆందోళనలో రైతులు తెగిన వాగువంకలు

9 గ్రామాల రాకపోకలు బంద్‌

కొమరోలు, నవంబరు 30 : మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు కొట్టుమిట్టాడుతున్న పంటలు తాజా వాన నీటిలో పూర్తిగా మునిగి దెబ్బతిన్నాయి. పంటలు కోల్పోయిన రైతులు లబోదిబోమంటున్నారు. వాగులువంకలు తెగిపోవడంతో 9 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. నెల్లూరు, కడప జిల్లాలకు సమీపంలో ఉన్నందున వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ మండలంలోనూ భారీ వర్షాలు కురిశాయి. నెల రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వానలకు మండలంలో సుమారు 4 వేల ఎకరాల శనగ, వెయ్యి ఎకరాలలో పొద్దుతిరుగుడు, మరో వెయ్యి ఎకరాలలో పత్తి కుళ్లిపోయింది. సూరవారిపల్లి, బాదినేనిపల్లి మీదుగా ప్రవహిస్తున్న పులివాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ల వల్ల కొన్ని రోజులుగా ఆ గ్రామాల గుండా వెళ్తున్న రహదారిపై సుమారు 10 అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. ఈ రహదారి గుండా వెళ్లే మరో ఏడు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెక్‌ డ్యాం కొట్టుకుపోయింది. పలు లోతట్టు గ్రామాల్లో వర్షపు నీరు గృహాల్లోకి చేరింది. కొమరోలు ప్రధాన రహదారుల్లోనూ సరైన కాల్వలు లేకపోవటంతో గృహాల్లోకి నీరు చేరింది. వెంటనే పంచాయతీ అధికారులు స్పందించి నీటిని కాల్వలకు మళ్లించారు.  



Updated Date - 2021-12-01T05:28:13+05:30 IST