అయోధ్య రాముడికి విరాళాల కోసం ర్యాలీలు

ABN , First Publish Date - 2021-01-21T06:09:35+05:30 IST

చేయి చేయి కలుపుదాం.. అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో పాలుపంచుకుందామని శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ పిలుపునిచ్చింది. బుధవారం జిల్లాలోని పలు చోట్ల విరాళాల సేకరణ కోసం ర్యాలీలను నిర్వహించారు.

అయోధ్య రాముడికి విరాళాల కోసం ర్యాలీలు
అల్లాదుర్గంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీ

నర్సాపూర్‌/అల్లాదుర్గం/రామాయంపేట/పెద్దశంకరంపేట/తూప్రాన్‌/మనోహరాబాద్‌/చేగుంట/చిల్‌పచెడ్‌ /చిన్నశంకరంపేట, జనవరి 20 : చేయి చేయి కలుపుదాం.. అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో పాలుపంచుకుందామని శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ పిలుపునిచ్చింది. బుధవారం జిల్లాలోని పలు చోట్ల విరాళాల సేకరణ కోసం ర్యాలీలను నిర్వహించారు. నర్సాపూర్‌లో రాయరావు చెరువు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టణంలోని ప్రధాన రోడ్ల గుండా బైక్‌ ర్యాలీ కొనసాగింది. మండలంలోని చిల్వర్‌, బహిరన్‌దిబ్బ, చేవెళ్ల, అల్లాదుర్గంలో యువకులు భారీగా ర్యాలీ నిర్వహించారు. చిల్వర్‌ గ్రామంలోని శ్రీరామమందిరం వద్ద ఎంపీపీ ఈర్ల అనిల్‌కుమార్‌రెడ్డి జెండాను ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. అల్లాదుర్గంలోని వెంకటేశ్వరాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కంచరి మమతాబ్రహ్మం రూ.10,111 విరాళం అందజేశారు. సర్పంచ్‌ అంజీయాదవ్‌ రూ.5,116 విరాళాన్ని ప్రకటించారు. చేగుంటలోని హనుమాన్‌ క్లాత్‌ స్టోర్‌ యజమాని మండ్రు సుధాకర్‌ అండ్‌ బ్రదర్స్‌ తరఫున రూ.1,01,116 చెక్కును ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు అందజేశారు. రామాయంపేట పట్టణంలో శ్రీరాముడి విగ్రహంతో భారీ ఊరేగింపును నిర్వహించారు. స్థానిక రామాలయం నుంచి సిద్దిపేట చౌరస్తా మీదుగా కాషాయజెండాలతో ర్యాలీ కొనసాగింది. మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ పుట్టి విజయలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెల్దుర్తి హనుమాన్‌ ఆలయంలో ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రతినిధులు, హిందూ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొని శ్రీరామ నామస్మమరణ చేశారు. పెద్దశంకరంపేటలోని రామాలయంలో కరపత్రం, స్టిక్కర్లను ఆవిష్కరించారు. మనోహరాబాద్‌లోని మాతంగి ఆలయంలో స్టిక్కర్లు, కరపత్రాలకు పూజలు నిర్వహించారు. చిల్‌పచెడ్‌ మండల పరిధిలోని గౌతాపూర్‌, గోప్యాతాండాలలో ర్యాలీ నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామంలో బుధవారం సీతారాముల శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. తొలుత గ్రామంలోని యువకులు హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రలో చిన్నారుల సీతా రామలక్ష్మణ, ఆంజనేయుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.


Updated Date - 2021-01-21T06:09:35+05:30 IST