Abn logo
Aug 5 2020 @ 04:55AM

బరితెగింపు

పేదలకు ఇళ్ల స్థలాల పేరిట రామకొండ చదును

అక్రమంగా గ్రావెల్‌ తరలింపు

కొండ చుట్టూ తవ్వేస్తున్న వైనం

అక్రమార్కులకు రెవెన్యూ అండ!

సర్వే నంబర్‌ 137లో ప్లాట్లు వేసి విక్రయం


(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి): పేదలకు ఇళ్ల స్థలాల పేరిట పెద్ద దందా నడుస్తున్నది. కొండచదును పేరుతో గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు. అక్రమార్కుల దాహానికి కొండ కరిగిపోతున్నది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మౌనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆనందపురం మండలం రామవరంలో యథేచ్ఛగా సాగుతున్న వ్యవహారమిది..


ఆనందపురం మండలం రామవరం గ్రామా నికి సమీపంలో సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో కొండ ఉంది. దీని సర్వే నంబర్‌ 121. గ్రామస్థులు దీనిని రామకొండగా పిలుస్తారు. కొండవాలులో పలువురికి గతంలో పట్టాలు ఇచ్చారు. కొండవాలులో గ్రావెల్‌ పుష్కలంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ కొండకు ఒకవైపున సమీప గ్రామం గంగసాని అగ్రహారానికి చెందిన 40 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. దీనికి కొండవాలు చదును చేయాలని రెవెన్యూ అఽధికారులు నిర్ణయించారు. ఈ బాఽధ్యతను కొందరికి అప్పగించారు. పేదలకు సంబంధించి ఒక్కొక్కరికి సెంటున్నర వంతున 40 మంది లబ్ధిదారులకు 60 సెంట్లు, ఇతర అవసరాలకు మరో 40 సెంట్లు వెరసి ఎకరా సరిపోతుంది. దీనికి రెవెన్యూ అధికారులు కొండకు ఒక వైపున మాత్రమే చదును చేయాలని నిర్ణయించారు. దీనిని సాకుగా తీసుకుని కొండకు రెండువైపుల సుమారు ఏడెకరాల వరకు చదును పేరిట గ్రావెల్‌ తవ్వుకుంటున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం కొండవాలును చదును చేయాలి.


కానీ టిప్పర్లతో గ్రావెల్‌ను బయటకు రవాణా చేయడం అనుమానాలకు తావిస్తున్నది. గ్రామ రెవెన్యూ అధికారి మౌనంగా ఉండడంపై ఆరోపణలు వినవస్తున్నాయి. అక్రమార్కులకు రెవెన్యూ అధికారుల దన్ను ఉందనే విమర్శలున్నాయి. కాగా గ్రామంలో సర్వే నంబర్‌ 136, 60లో మాత్రమే గ్రావెల్‌ తవ్వకాలకు గనులశాఖ అనుమతి ఉంది.  సర్వే నంబర్‌ 121లోని రామకొండలో తవ్వకాలకు ఎటువంటి దరఖాస్తు చేయలేదు. రామకొండలో గత మూడు వారాల నుంచి తవ్వకాలు చేస్తుంటే అధికారుల నుంచి కనీసం స్పందన లేదు. 


కాగా రామవరం గ్రామానికి సమీపంలో జిరాయితీ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు లేవుట్‌ వేశారు. లేవుట్‌, గ్రామానికి ఆనుకుని రోడ్డుకు మధ్యనున్న ప్రభుత్వ భూమిని(సర్వే నంబరు 131) కూడా కొందరు అక్రమార్కులు అమ్మేశారు. గ్రామంలో కొందరు ముఠాగా ఏర్పడి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్లాట్లుగా విక్రయించినా... కొండవాలు


ప్రాంతాలు చదునుపేరిట గ్రావెల్‌ తరలించినా రెవెన్యూ అధికారులు మౌనంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. దీనిపైఆనందపురం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌ వద్ద ప్రస్తావించగా... గంగసాని అగ్రహారానికి చెందిన 40 మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ఒక వైపు ఎకరాకుపైగా స్థలం చదును చేస్తున్నామన్నారు. అయితే కొండకు మరోవైపు చదును చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుమేరకు పనులు నిలిపి వేశామన్నారు. సర్వే నంబర్‌ 131లో ప్రభుత్వ భూమి అమ్మకాలపై అందిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నా మన్నారు. సర్వే నంబర్‌ 137లో ప్లాట్లుగా వేసి అమ్మకాలు సాగిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన

తెలిపారు.


మరో చోట ప్లాట్లు వేసి విక్రయం 

గ్రామానికి సమీపంలో సర్వే నంబర్‌ 137లో ఉన్న మరో కొండవాలులో గతంలో పలువురికి డి.పట్టాలు ఇచ్చారు. నిబంధనల మేరకు డి.పట్టా భూముల్లో వ్యవసాయ పంటు లేదా తోటలు సాగు చేయాలి. అయితే కొండవాలు ప్రాంతం కావడంతో ఇక్కడ కూడా గ్రావెల్‌ తవ్వకాలకు గనుల శాఖ అనుమతి తీసుకున్నారు. గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టిన తరువాత కొందరు అక్రమార్కులు సుమారు ఐదెకరాల్లో కొండవాలు ప్రాంతం చదునుచేసి ప్లాట్లుగా అమ్మేశారు. ఒక్కొక్క ప్లాటు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు విక్రయించారు. తాజాగా ఇదే కొండలో మరో రెండున్నర ఎకరాల్లో డి. ఫారం భూమి చదునుచేసి ప్లాట్లుగా అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement