కిలో టీపోడికి రూ. 75 వేలు.. రికార్డుస్థాయి ధర!

ABN , First Publish Date - 2020-10-31T01:36:31+05:30 IST

నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. సాధారణంగా కిలో టీపొడి ధర గరిష్టంగా రూ. 500-600 వరకు ఉంటుంది. కానీ అసోంలోని గువాహటి టీ ఆక్షన్ సెంటర్

కిలో టీపోడికి రూ. 75 వేలు.. రికార్డుస్థాయి ధర!

గువాహటి: నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. సాధారణంగా కిలో టీపొడి ధర గరిష్టంగా రూ. 500-600 వరకు ఉంటుంది. కానీ అసోంలోని గువాహటి టీ ఆక్షన్ సెంటర్ (జీటీఏసీ)లో నిన్న జరిగిన వేలంలో ఓ అరుదైన టీపొడికి ఏకంగా రూ. 75 వేల ధర పలికింది. ఈ ప్రత్యక రకం టీపొడిని ‘మనోహరి గోల్డ్ టీ’ అని పిలుస్తారు. దీనిని ఎగువ అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలో మనోహరి టీ ఎస్టేట్‌లో పండిస్తారు. కరోనా కారణంగా చితికిపోయిన అసోం టీ ఇండస్ట్రీకి తాజా ధర ఓ ఆశాకిరణం వంటిదని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. 


ఈ టీ ప్రత్యేకత గురించి మనోహరి టీ ఎస్టేట్ డైరెక్టర్ రాజన్ లోహియా మాట్లాడుతూ.. ఈ టీని అత్యుత్తమ రెండో ప్లష్ కల్నల్ టీ బడ్స్‌ నుంచి తయారు చేస్తామని, తెల్లవారుజామున సూర్యకాంతి పడడానికి ముందే వీటిని సేకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ టీపొడి మంచి సుగంధ పరిమళంతో నిండి ఉంటుంది. దీని తేనీరు ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటుంది. ఈ టీపొడిని కాంటెంపరరీ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విక్రయించగా, గువాహటికి చెందిన టీ సంస్థ విష్ణు టీ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ సంస్థ తమ డిజిటల్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ 9ఏఎంటీడాట్‌కామ్ (9amtea.com) ద్వారా ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.


గతంలోనూ ఇదే రకం టీ కిలో రూ. 50 వేలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు దాని రికార్డును అదే బద్దలుగొట్టింది. గతేడాది ఆగస్టు 13న ఎగువ అసోంలోని డికోమ్ టీఎస్టేట్ తన ‘గోల్డెన్ బటర్‌ఫ్లై’టీకి గువాహటి టీ ఆక్షన్ సెంటర్‌లో కిలోకు రూ. 75 వేలు లభించింది. 

Updated Date - 2020-10-31T01:36:31+05:30 IST