రసాభాసగా జగనన్న స్వచ్ఛ సంకల్పం

ABN , First Publish Date - 2021-10-21T03:12:31+05:30 IST

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణంలో బుధవారం జరిగిన జగనన్న స్వచ్ఛ సంకల్పం రసాభాసగా సాగింది.

రసాభాసగా జగనన్న స్వచ్ఛ సంకల్పం
వేదిక మీదనే వాదులాడుకుంటున్న ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీలు

  వేదికపైనే ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీ వాగ్వాదం

ఓజిలి, అక్టోబరు 20 :  స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణంలో బుధవారం జరిగిన జగనన్న స్వచ్ఛ సంకల్పం రసాభాసగా సాగింది. ఎంపీపీ గడ్డం అరుణమ్మ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీవో రమణయ్య కార్యక్రమాలను వివరిస్తున్న సమయంలోనే పారిశుధ్య పనివాళ్లకు ఏడాదిగా వేతనాలు చెల్లించని పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేమని కొత్తచెరువు సర్పంచి మహేంద్రరెడ్డి పేర్కొన్నారు. దీంతో ఖంగుతిన్న ఎంపీడీవో, అధికారులు కార్యక్రమాలను ముందుకు కొనసాగించేందుకు తంటాలు పడ్డారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ అందరూ ఇలాంటి బాధితులే... ఇంకా చెప్పాలంటే చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాక అప్పులపాలై ఉన్నాం.. ఎంపీపీ కూడా ఇదే తరహాలో బాధితురాలే అంటూ సభావేదిక పైనుంచే మాట్లాడారు. దీంతో వేదికపై ఉన్న  వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అదే సమయంలో ఈవోపీఆర్‌డీ మాణిక్యం  మాట్లాడుతూ మండలానికి మంజూరైన చెత్తవాహనం కురుగొండకు కేటాయించడంలో ఎంపీడీవో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఓజిలిని విస్మరించారంటూ ఆరోపించారు. దీంతో ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీల మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో కార్యక్రమానికి హాజరైన కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, అంగన్‌వాడీలు, అధికారులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. కార్యక్రమాన్ని తూతూమంత్రంగా పూర్తిచేసి, ఎంపీపీ అరుణమ్మ, నాయకుల చేతుల మీదుగా పొదుపు మహిళలకు కోళ్ల పెంపకం యూనిట్లను పంపిణీ చేపట్టారు.  కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ తుపాకుల మీనాక్షి, జడ్పీటీసీ సభ్యులు గుంటమడుగు రవీంద్రరాజు, నాయకులు దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, పాదర్తి హరినాధ్‌రెడ్డి, ఉప సర్పంచులు ముమ్మడి సుబ్బారావు, ఉచ్చూరు హరినాధ్‌రెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T03:12:31+05:30 IST