ఎండీయూలకు హెల్పర్‌ చార్జీల పెంపు

ABN , First Publish Date - 2021-05-05T06:30:10+05:30 IST

రేషన్‌ డోర్‌ డెలివరీ కోసం తాము గొప్పగా స్వంతంగా పెట్టుకున్న ఎండీయూల దెబ్బకు రాష్ట ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.

ఎండీయూలకు హెల్పర్‌ చార్జీల పెంపు

కేంద్రం ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికే 

 ఇంధన చార్జీలు లేవు 

 డీలర్‌కు ఇవ్వాల్సిన వాటిని తొక్కిపెట్టిన ప్రభుత్వం

మొగల్రాజపురం, మే 4 : రేషన్‌ డోర్‌ డెలివరీ కోసం తాము గొప్పగా  స్వంతంగా పెట్టుకున్న ఎండీయూల దెబ్బకు రాష్ట ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నాలుగో తేదీ వచ్చినా రాష్ట్రంలో పేదలకు ఉచిత రేషన్‌  అందకపోవడంతో కేంద్రం ఆగ్రహానికి గురికాకుండా తప్పించుకోవడానికి తమ డిమాండ్స్‌ను నేరవేర్చాలని లేకపోతే విధులకు రావడం కుదరదని  నాలుగు రోజల నుంచి గైర్హాజరవుతున్న ఎండీయూలను దారిలోకి తెచ్చుకోవడానికి వారి డిమాండ్స్‌లో ఒకటైన హెల్పర్‌ చార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించక తప్పలేదు. 

రేషన్‌ డోర్‌ డెలివరీ చేస్తున్న ఎండీయూలకు ప్రభుత్వం హెల్పర్‌ చార్జీలను మాత్రమే పెంచి మిగిలిన డిమాండ్స్‌ను వదిలేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా  మే, జూన్‌ నెలలకు గాను కేంద్రం కార్డుదారులకు ఉచితంగా బియ్యం ఇస్తోంది. కేంద్రం ఇస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచితంగా బియ్యం ఇవ్వాల్సి వచ్చింది. ఈ రెండు కోటాలను ఒకే సారి కార్డుదారులకు ఇవ్వడానికి ఎండీయూలు మాత్రం అంగీకరించలేదు. కారణం ఒక కోటాకు మాత్రమే తమకు హెల్పర్‌ చార్జీల కింద రూ.5వేలు, ఇంధన చార్జీల కింద రూ.3వేలు ఇస్తున్నారని ఇపుడు డబుల్‌ కోటా కాబట్టి తమకు హెల్పర్‌ చార్జీలు, ఇంధన చార్జీలు  రెట్టింపు చేయాలని పనిలో పనిగా హెల్త్‌ కార్డులు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ఇవ్వాలని డిమాండ్‌లు ప్రభుత్వం ముందు పెట్టారు. తమ డిమాండ్‌ల సాధన కోసం మూడు రోజులుగా విధులు బహిష్కరించారు. జిల్లాలో  ఎండీయూల డిమాండ్స్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని సోమవారం ఎండీయూలతో చర్చలు జరిపిన అధికారులు మంగళవారం విధులకు హజరవ్వాలని ఆదేశించారు. అయినా మంగళవారం చాలా మంది ఎండీయూలు విధులకు హజరవ్వలేదు.

 హెల్పర్‌ చార్జీలతో సరి

మొదటి నుంచి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న ఎండీ యూల తీరును నిశతంగా గమనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విపత్కర సమయంలో రేషన్‌ పంపిణీ ఆగిపోతుండటంతో కేంద్రం కన్నెర్ర నుం చి తప్పించుకోవడానికి చేసేది లేక హెల్పర్‌ చార్జీలు పెంచాల్సి వచ్చిం దని సమాచారం. ఎండీయూలు అడిగిన దాంట్లో ఇంధన చార్జీలు, ఇతర డిమాండ్స్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.

రేషన్‌ డీలర్లకు మొండిచెయ్యి

గత ఏడాది మార్చి 29 నుంచి నవంబర్‌ వరకు నెలకు రెండు విడతల చొప్పున రేషన్‌ పంపిణీ చేసిన రేషన్‌ డీలర్లకు అప్పటి శనగల కమీషన్‌ ఇంకా ఇవ్వకుండా తొక్కిపెట్టడం, ఆహార భద్రతా చట్టం ప్రకారం దిగుమతి చార్జీలు ఇస్తామని మాట ఇచ్చిన అధికారులు ఇపుడు దాట వేత ధోరణి అవలంబిస్తుండటం, ఎండీయూలు మూడు రోజులు నిరసన వ్యక్తం చేయగానే హెల్పర్‌ చార్జీలు పెంచడంపై డీలర్‌ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.  


Updated Date - 2021-05-05T06:30:10+05:30 IST