Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాసుల రేషన్‌

  జోరుగా రేషన్‌బియ్యం దందా
  కోట్లల్లో సాగుతున్న వ్యాపారం
  బహిరంగంగానే క్రయ విక్రయాలు

పిఠాపురం, నవంబరు 28: రేషన్‌బియ్యం సంచి మారితే చాలు కాసుల వర్షమే.. భారీగా లాభాలు ఉండటంతో దందా జోరుగా సాగుతోంది. నిన్న, మొన్నటి వరకూ చాటుమాటుగా సాగిన వ్యవహారం ఇప్పుడంతా బహిరంగంగానే జరుగుతోంది. రెవెన్యూ, పోలీసు అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినా ఆగకపోగా మరింతగా పెరగడం గమనార్హం.
జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో రేషన్‌బియ్యం క్రయ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ దందా ఇప్పుడు పలు ప్రాంతాలకు విస్తరించింది. పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడుతోపాటు మాధవపు రం, చిత్రాడ, విరవ, భోగాపురం, విరవ, విరవాడ,మల్లాం గ్రామాలు, పిఠాపురం, గొల్ల ప్రోలు పట్టణాలు, మండలంలోని చేబ్రోలు, దుర్గాడ, కొత్తపల్లి మండలం నాగులాపల్లి, గోర్స, కొండెవరం, అమీనాబాద్‌, కొమరిగిరి గ్రామాలతోపాటు సామర్లకోట, కాకినాడ నగరం,రూరల్‌, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, తుని, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, జగ్గంపేట ప్రాంతాల్లో రేషన్‌బియ్యం కొనుగోళ్లు, అక్రమ తరలింపు ఎక్కువగా సాగు తోంది. ఒకప్పుడు బి.ప్రత్తిపాడు పరిసర గ్రామాలకు చెందిన వారే అధికంగా వీటిని కొనుగోలు చేసేవారు. ఇక్కడ గోడౌన్లలో నిల్వ చేస్తుంటే అధికారుల తనిఖీలు ఎక్కువవడతో ఇతర ప్రాంతాల్లో గోడౌన్లు, గృహాలు అద్దెకు తీసుకుని నిల్వ చేస్తున్నారు.

కొనుగోళ్లు.. తరలింపు ఇలా

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయికి, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని రేషన్‌షాపుల ద్వారా నెలకు రెండుసార్లు సరఫరా చేస్తుండడంతో ప్రజలు వీటిని వినియోగించడం మాని విక్రయించేందుకే మొగ్గుచూపుతున్నారు. వీరినుంచి కిలో రూ.12నుంచి రూ.14 వరకూ మోటార్‌సైకిళ్లపై వచ్చే వ్యక్తులు కొనుగోలు చేసి రేషన్‌బియ్యం వ్యాపారం నిర్వహించే వారికి రూ.16-18కు విక్రయిస్తున్నారు. వీరు వాటిని ఇతర సంచుల్లోకి మార్చి స్వల్పంగా పాలిష్‌ పట్టించి మార్కెట్‌లోకి కిలో రూ.24నుంచి రూ.28 వరకూ, మిల్లర్లకు రూ.20కు విక్రయిస్తున్నారు. గొల్లప్రోలు, పిఠాపురం, శంఖవరం తదితర మండలాల్లోని కొందరు మిల్లర్లు నేరుగా వీటిని కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కొన్నిప్రాంతాల్లో రేషన్‌డీలర్లతోపాటు ఎండీయూ ఆపరేటర్లు కార్డుదారులనుంచి బియ్యం తీసుకుని వారే విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో కార్డుదారులు, ఇతరత్రా మార్గాల్లో కొనుగోలు చేసిన రేషన్‌బియ్యాన్ని గోడౌన్లలో నిల్వ చేసిన సంచుల్లో మార్చిన తర్వాత లారీలతో ఇతర ప్రాంతాలకు తరలించేవారు. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడిక్కడ షాపులు, ఇళ్లు అద్దెకు తీసుకుని అక్కడ నిల్వ ఉంచుతున్నారు. రాత్రి కాగానే వ్యాన్‌ లేదా లారీల్లో వీటిని తరలిస్తున్నారు. జిల్లాలో తనిఖీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లా సరిహద్దు, విశాఖ జిల్లా పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో గోడౌన్లు తీసుకుని నిల్వలు ఉంచుతున్నారు.

ముందుగా హడావుడి చేసి..

ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేషన్‌బియ్యం దందాపై ప్రత్యేక దృష్టిసారించడంతో పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్టులు చేశారు. ఇప్పుడు దాడులు తగ్గాయి. ఇదే అదనుగా వ్యాపారులు గతంలో కంటే అధికంగా బియ్యం కొనుగోళ్లు సాగిస్తున్నారు. ఒకప్పుడు పోటీపడి కొనుగోళ్లు జరిపిన బి.ప్రత్తిపాడుకు చెందిన వ్యాపారులతో పాటు పిఠాపురం, గొల్లప్రోలు పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఒక సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఇందులో అధికార పార్టీకి చెందిన కొందరు గ్రామస్థాయి నేతలు కీలకంగా వ్యవహరించారు. వ్యాపారానికి అనుగణంగా సిండికేట్‌ తరపున పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారు. ఇది జరిగిన తర్వాత సివిల్‌ సప్లైస్‌, పోలీసు అధికారుల దాడులు జరగపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో చాటుమాటుగా రాత్రివేళల్లో కొనుగోళ్లు బియ్యం తరలింపు నిర్వహించిన వారు ఇప్పుడు పగటి సమయాల్లో కూడా కార్యాకలాపాలు జరపడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్‌బియ్యం దందాకు చెక్‌ పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement