బియ్యమా.. నగదా

ABN , First Publish Date - 2021-09-13T05:08:41+05:30 IST

రేషన్‌ బియ్యం..

బియ్యమా.. నగదా

బహిరంగంగానే రేషన్‌ అక్రమాలు.. 

డోర్‌ డెలివరీ వద్దనే ఎండీయూల ప్రలోభాలు

నాడు రేషన్‌ డీలర్లు.. నేడు ఎండీయూల అక్రమాలు

ప్రాంతాన్ని బట్టి కేజీకి రూ.8 నుంచి 10 వరకు చెల్లింపు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం అక్రమాలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. అయితే గతంలో చాలామంది రేషన్‌ డీలర్లు ఆ పాత్ర పోషించగా.. ఇప్పుడు ఆ పాత్రలోకి ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) వాహనాల ఆపరేటర్లు చేరారు. బియ్యం కావాలా... నగదు కావాలా అని తమ వద్దకు రైస్‌కార్డులతో వచ్చే వారితో బేరాలు చేస్తున్నారు. బియ్యం కావాలంటే కాటా వేసి ఇస్తుండగా, వద్దనుకున్న వారికి కేజీకి రూ.8 నుంచి రూ.10 లెక్క కట్టి చేతిలో పెడుతున్నారు. కందిపప్పు వద్దనుకున్న వారివి కూడా మిగుల్చుకుని మెస్‌లు, హోటళ్లు, హాస్టళ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకొంటున్నారు. ఒకవిధంగా రేషన్‌ సరుకుల అక్రమ రవాణ ఎండీయూల రూపంలో మరింత బహిరంగంగా మారిపోయింది.


గతంలో ప్రతీ నెలా రేషన్‌ డిపోలకు కార్డుదారులు వెళ్లేవారు. అప్పట్లో 25 నుంచి 27 శాతం మంది వరకు ప్రతీ నెలా సరుకులు తీసుకునే వారు కాదు. డిపోలకు వెళ్లి అక్కడ క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ వైసీపీ ప్రభుత్వం మధ్యస్త సన్న రకం బియ్యం ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తామని చెప్పి ఎండీయూ విధానాన్ని ఈ ఏడాది జనవరి నుంచి తీసుకొచ్చింది. దాంతో రేషన్‌ సరుకుల పంపిణీ శాతం కొంత పెరిగింది. ఇప్పుడు ప్రతీ నెలలో 86 నుంచి 88 శాతం మంది తీసుకుంటున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకొంటే కేవలం 12 నుంచి 14 శాతం మంది మాత్రమే వివిధ కారణాలతో తీసుకోవడం లేదు.


అపార్టుమెంట్‌లు, పెద్దపెద్ద భవనాల్లో నివాసం ఉండే తెల్లకార్డుదారులు గతంలో సరుకులు తీసుకునే వారు కాదు. ఇప్పుడు వారి నివాసం వద్దకు ఎండీయూ వాహనం వస్తుండటంతో ఇంటి మెట్లు దిగి వచ్చి వేలిముద్ర వేసి నగదు తీసేసుకుంటున్నారు. ఈ క్రమంలో క్యూలైన్‌తో సంబంధం లేకుండా తాము వచ్చిన వెంటనే వేలిముద్ర వేయించేలా వలంటీర్ల ద్వారా ఎండీయూలకు ముందుగానే ఫోన్లు కూడా చేయిస్తున్నారు.


తనిఖీలు.. కేసులు నిల్‌

గతంలో రేషన్‌షాపులకు వెళ్లి అక్కడ ఉన్న సరుకుల నిల్వలను డిప్యూటీ తహసీల్దార్లు తనిఖీ చేసేవారు. ఈక్రమంలో ఎవరైనా నల్లబజారుకు తరలిస్తే స్టాకులో వ్యత్యాసం కనిపించేది. దాంతో వారిపై 6ఏ కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు ఎండీయూలను తనిఖీ చేసే అధికారి కరువయ్యారు. ఇందుకు కారణం ఎండీయూలు నిత్యం ఉదయం తమకు లింకు చేసిన రేషన్‌ డిపోకు వెళ్లి సరుకులు లోడింగ్‌ చేసుకుని వారికి కేటాయించిన క్లస్టర్లకు వెళతారు.


తిరిగి సాయంత్రం మిగిలిన స్టాకుని రేషన్‌ డిపోలు దింపాలి. ఎండీయూ విధానం ఎక్కడ ఫెయిలైపోతుందోనని తనిఖీలు కూడా వారిపై తగ్గించేశారు. ఇటీవలకాలంలో ఎండీయూలు/రేషన్‌డీలర్లపై నమోదు చేసిన కేసులు చాలా తక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం. ఇదే అదనుగా మాఫియా చెలరేగిపోతున్నది. పొన్నూరులోని రైస్‌మిల్లులో భారీ మోతాదులో రేషన్‌ బియ్యాన్ని మూడు రోజుల క్రితం విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి పట్టుకోవడం పరిస్థితిని కళ్లకు కడుతున్నది. 

Updated Date - 2021-09-13T05:08:41+05:30 IST