యూరియా.. వారి దయ

ABN , First Publish Date - 2022-01-18T06:20:19+05:30 IST

వ్యాపారుల, రాజకీయ నాయకుల దయ ఉంటేనే యూరియా దొరికే పరిస్థితి జిల్లాలో నెలకొందని రైతులు వాపోతున్నారు.

యూరియా.. వారి దయ
కొల్లిపర ఆర్బీకే వద్ద లారీ నుంచి యూరియా బస్తాలను దించుతున్న కూలీలు

నల్ల బజార్‌లో యూరియా-  అల్లాడుతున్న రబీ రైతులు

రూ. 266.50 బస్తా రూ. 400కు అమ్మేస్తున్న వ్యాపారులు

కొన్నిచోట్ల కాంప్లెక్స్‌ ఎరువులు కొంటేనే యూరియా బస్తా

ఆర్బీకేల్లో సిఫార్సులుంటేనే దక్కేది - దాడులు మరిచిన అధికారులు

వర్షాలు పడటంతో యూరియాకు డిమాండ్‌ పెరిగింది. మొక్కజొన్న, జొన్న వంటి రబీ పంటలకు అదను లోపే ఎరువు వేసేందుకు రైతులు తాపత్రయ పడుతుంటే, వారి అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అఽధిక ధరలకు అమ్మేస్తున్నారు. దీనికితోడు అవసరంలేని కాంప్లెక్స్‌ ఎరువులనూ అంటకట్టేస్తున్నారు. ఆర్బీకేల వంటివాటిలో అయితే అధికారపార్టీ నేతల సిఫార్సులు ఉన్నవారికే యూరియా దక్కుతుంది.  కొన్ని డీసీఎంఎస్‌ కేంద్రాల్లో బస్తాకు అదనపు వసూళ్లతో పాటు  సిఫార్సులు ఉండాల్సి వస్తోంది. మొత్తంమీద జిల్లాలో యూరియాకు కొరత లేకున్నా, అధికారుల అలసత్వం, రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని నల్లబజార్‌ అమ్మకాలకు బరితెగిస్తున్నారు.

తెనాలి, గుంటూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):  వ్యాపారుల, రాజకీయ నాయకుల దయ ఉంటేనే యూరియా దొరికే పరిస్థితి జిల్లాలో నెలకొందని రైతులు వాపోతున్నారు.  యూరియా దొరకక చిన్న రైతులకు కష్టాలు తప్పడంలేదు. గంటల తరబడి దుకాణాలు, అమ్మక కేంద్రాల వద్ద నిలువుకాళ్లపై నిలబడాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లాలోని కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో రబీ కింద 4.8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, మినుము రబీ పంటగా సాగు చేస్తున్నారు. అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న, జొన్న పంటలు సాగవుతుంటే, వీటికి కొన్ని ప్రాంతాల్లో తొలివిడత, మరికొన్నిచోట్ల రెండో విడత ఎరువును వెయ్యాల్సిన పరిస్థితి ఉంది. సాధారణంగా యూరియాతోపాటు డీఏపీ వంటి కాంప్లెక్స్‌ ఎరువులనుకూడా వేస్తుంటారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రైతులు కాంప్లెక్స్‌ ఎరువులతో పనిలేకుండా యూరియా ఒక్కటే వేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికితోడు చేలల్లో నీటి తడులు పెట్టాల్సిన పనిలేకుండా వర్షాలు పడటంతో ఆ అదను పోయేలోపే ఎరువు వేయాలనే ఆత్రుతతో రైతులు ఉండటంతో వారి అవసరాన్ని అందరూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. 

బస్తా యూరియా రూ. 400

ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం యూరియాను మన దగ్గర బస్తా రూ. 266.50 రేటుకే అమ్మాల్సి ఉంది. అయితే ప్రస్తుతం యూరియాకు డిమాండ్‌ పెరగటంతో ఒక్కసారిగా రేటును పెంచేశారు. కొన్నిచోట్ల బస్తా రేటు రూ. 375కు అమ్ముతుంటే, మరికొన్నిచోట్ల ఆశ చాలదన్నట్టు రూ. 400 కు బహిరంగంగానే అమ్మేస్తున్నారు. ఇదంతా వ్యాపారుల దగ్గర ఉన్న రేటు. అదికూడా తెలిసినవారికి మినహా, కొత్తవారు ఎవరైనా రైతులు వెళితే, లోపల యూరియా బస్తాలు ఉన్నా, లేవని తిప్పి పంపుతున్నారని రైతులు చెబుతున్నారు. తెనాలి, వేమూరు, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు, పొన్నూరు, పిట్టలవానిపాలెం, మరికొన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. యూరియా ఉన్నా, నల్లబజార్‌ వ్యాపారానికి తెరతీస్తుంటే, పండుగ సెలవులు యూరియా సరఫరాకు ఆటంకంగా మారటం మరో సమస్యగా మారింది. అయితే వ్యవసాయ శాఖ ముందస్తుగానే ఇటువంటి ఆటంకాలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యూరియా వంటి ఎరువులను ఓ ప్రణాళిక ప్రకారం అందుబాటులో ఉంచుతుంది. కానీ వీరి అలసత్వం కూడా తోడవటంతో రైతులకు ఇబ్బందులు తప్పటంలేదు. దాచేసి, రేట్లు పెంచి ఎరువు అమ్ముతున్నా వాటిపై దాడులు జరిపి, బయటకు తీసుకొచ్చి రైతులకు అందేలా చూడాల్సిన అధికారులు, వ్యవసాయ శాఖ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిద్రావస్తలోనే ఉండటం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. 

ఆర్బీకేల్లో సిఫార్సులుంటేనే...

రైతులకు అవసరమైన అన్నిటినీ ఆర్బీకేలు తీర్చుతాయని ప్రభుత్వం ఆర్బాటంగా ప్రకటిస్తే, అవి మాత్రం రైతులందరికీ ఉపయోగపడటంలేదు. కేవలం సిఫార్సులున్న వారికి మాత్రమే ఎరువు అందుతుండటం దీనికి నిదర్శనం. బయట వ్యాపారులు ఎరువులను బయటకు కనిపించనివ్వకుండా దాచేసి అమ్మేస్తుంటే, ఆర్బీకేల్లో మాత్రం ఎదురుగా ఎరువులు బస్తాలున్నా రైతులకు అందని ద్రాక్ష సామెతలానే ఉన్నాయి. ఎవరికైనా ఎరువు కావాలంటే అధికార పార్టీ నేతల సిఫార్సు లేఖలు కానీ, మాట కానీ ఉంటేనే ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో యూరియా లోడు ఆర్బీకేలకు వచ్చినా, వాటిని ఆర్బీకేల దగ్గర దింపేలోపే సగం లోడు బయటి వారికి లోడుచేసి పంపేస్తున్నారని, కొల్లూరు, వేమూరు, చుండూరు, కొల్లిపర మండలాల్లో శనివారం సాయంత్రం ఇదే తీరులో యూరియాను పందారం చేసేశారని, మిగిలిన బస్తాలనయినా ఇస్తారనుకుంటే, వాటికి టోకెన్‌లు రెండు రోజుల క్రితమే రాసేశామని రైతులను తిప్పిపంపారని చెబుతున్నారు. కొన్ని ఆర్బీకేల్లో అయితే బస్తాకు రూ. 50 అదనంగా ఇస్తే వారికి కావలసినన్ని యూరియా బస్తాలు ఇచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. సిఫార్సులు ఉన్నవారికి మాత్రం ప్రభుత్వ రేటుకే ఇచ్చేశారని చెబుతున్నారు. అవసరానికి సరిపడా ఎరువులనుకూడా పంపాల్సి ఉంటే, అదీ అంతంతమాత్రంగానే ఉంది. ఉదాహరణకు వేమూరు మండలంలో 18,500 ఎకరాల్లో రబీ పంటకోసం 1600 టన్నుల యూరియా అవసరం ఉంటే, కేవలం 410 టన్నులు మాత్రమే సరఫరా చేశారు. మరో 800 టన్నులకు అధికారులు ఇండెంట్‌ పంపినా అతీగతీలేదు. ఉన్న కొద్దిపాటి యూరియా కూడా జంపని, బలిజేపల్లి ఆర్బీకేల్లోనే ఉన్నాయి. అవికూడా మిగిలిన ప్రాంతాల రైతులకు అందని పరిస్థితి. ఇదే వాతావరణం మిగిలిన మండలాల్లోనూ ఉంది.

వ్యాపారులు షరతులతో రైతులకు తిప్పలు 

వర్షాల కారణంగా ఒక్కజొన్న, జొన్న పంటలకు యూరియా మాత్రమే వేసేందుకు రైతులు ఇష్టపడుతున్నారు. సాధారణంగా రెండో విడత ఎరువు వేసేటప్పుడు యూరియాతోపాటు కాంప్లెక్స్‌ ఎరువులను కూడా కలిపి చల్లటం పరిపాటి. కానీ ఈ సారి పంట వివిధ దశల్లో ఉండటంతో యూరియా మాత్రమే చల్లుతున్నారు. కాంప్లెక్స్‌ ఎరువు అవసరం లేకున్నా, వ్యాపారులు మాత్రం వాటిని కూడా రైతులకు అంటకడుతున్నారు. కాంప్లెక్స్‌ ఎరువులు కూడా కొంటేనే యూరియా ఇస్తామంటూ మడతపేచీ పెడుతుండటంతో కొందరు రైతులు చేసేదిలేక వాటినికూడా కొనకతప్పటంలేదు. డి.ఎ.పి, 20-20-0-13, 10-26-26, 17-17-17, వంటి కాంప్లెక్స్‌ ఎరువుల్లో ఏదో ఒకటి కొనాల్సిందేనని వ్యాపారులు షరతులు పెడుతుండటంతో రైతులు అప్పులు చేసిమరీ ఎరువు కొనాల్సి వస్తోంది. యూరియాకే నల్లబజార్‌లో రూ. 200 అదనంగా వెచ్చించాల్సి వస్తుంటే, డీఏపీ వంటి వాటికి అదనంగా బస్తాకు రూ. 1200 భారం భరించాల్సివస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఒక్క విడత ఎరువు చల్లాలంటే ఎకరాకు రెండు బస్తాలను రైతులు చల్లేస్తుంటే, 4.8 లక్షల ఎకరాలకు సుమారు 9.6 లక్షల బస్తాల యూరియా అవసరం ఉంటుంది. అయితే అంతగా కొరత లేకున్నా, కొద్దిపాటి కొరతను మాత్రం వీరు భారీగా చూపించి కాంప్లెక్స్‌ ఎరువులను అమ్మేస్తున్నారు. ఒకవేళ ఏ రైతన్నా వాటిని వద్దంటే యూరియాకూడా లేదంటూ తిప్పి పంపేస్తున్నారని వాపోతున్నారు. డీసీఎంఎస్‌ ఏర్పాటుచేసిన కేంద్రాల్లో అయితే మరో సమస్య. ఇక్కడ కూడా ఎరువులు ఉన్నా, చాలావరకు సిఫార్సులే నడుస్తున్నాయి. అవి ఉంటేనే ఎరువు రైతుకు అందుతుంటే, బస్తాకు అదనంగా రూ. 10 నుంచి రూ. 25కు అమ్మేస్తున్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల రేట్లుకూడా ఇదేతీరులో ఉన్నాయి. రూ. 266.50 బస్తా రూ. 280 వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే వ్యాపారుల దగ్గర భారీ దోపిడీకి గురయ్యేకంటే ఇది కొంతవరకు మేలని చేసేదిలేక అదనంగానే ఇచ్చి బస్తాలు తెచ్చుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. రైతుల అవసరాన్ని సొమ్ముచేసుకునేందుకు బహిరంగంగానే రైతులను నిలువు దోపిడీకి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటేనే ఈ రబీకి ఎరువుల కష్టాలు తప్పే పరిస్థితి.


Updated Date - 2022-01-18T06:20:19+05:30 IST