‘బియ్యం’ లోడు ముసుగులో ‘ఎర్ర’ స్మగ్లింగ్‌

ABN , First Publish Date - 2021-09-06T07:18:19+05:30 IST

కంటైనరులో కింద భాగమంతా..

‘బియ్యం’ లోడు ముసుగులో ‘ఎర్ర’ స్మగ్లింగ్‌
ఎర్రచందనం స్పగ్లర్లను చూపిస్తున్న ఎస్పీ సెంథిల్‌కుమార్‌

రూ.2కోట్ల విలువైన దుంగలు, వాహనాల సీజ్‌

13 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్టు


చిత్తూరు: కంటైనరులో కింద భాగమంతా ఎర్రచందనం దుంగలు పరిచేశారు. వీటిపై బియ్యం బస్తాలు వేశారు. దుంగలు కనిపించకుండా కవర్‌ చేశారు. బియ్యం తీసుకెళ్తున్నట్లు వే బిల్లునూ సిద్ధం చేశారు. ఇలా స్మగ్లర్లు వేసిన ‘ఎర్ర’ ఎత్తు విఫలమైంది. పీలేరు మండల పరిధిలో పోలీసుల తనిఖీల్లో దుంగలు పట్టుబడ్డాయి. ఈ ఘటనలో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోగా.. వీరిలో పలువురు వైసీపీకి చెందిన వారు కావడం గమనార్హం. పట్టుబడిన దుంగలు, నిందితులను ఆదివారం మీడియాకు చూపి.. వివరాలను చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం..


పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు పీలేరు అర్బన్‌ సీఐ సాధిక్‌ ఆలీ, పోలీసులు, స్పెషల్‌పార్టీ సిబ్బందితో కలిసి పొంతలచెరువు క్రాస్‌ వద్ద ఆదివారం వేకువజామున 3 గంటలకు వాహనాల తనిఖీలు చేపట్టారు. అటుగా కంటైనర్‌.. దాని ముందు వెనుకా కార్లు వచ్చాయి. పోలీసులకు అనుమానం వచ్చి రెండు కార్లతో పాటు కంటైనర్‌ను తనిఖీ చేశారు. అందులో 3.5 టన్నుల బరువు కలిగిన 115 ఎర్రచందనం దుంగలతో పాటు కడప జిల్లా సంబేపల్లెకు చెందిన స్మగ్లర్లు సురేంద్రరెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, తిరుపతి మంగళంకు చెందిన మురళి, రామాంజులు, వికేష్‌, తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు చెందిన స్వామినాథన్‌, వేలూరుకు చెందిన విజయ్‌కాంత్‌, శక్తివేల్‌, విజయ్‌కుమార్‌, వేలుస్వామి, తిరువణ్ణామలైకు చెందిన ఏలుమలైను అరెస్టు చేశారు. కంటైనరు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా రాయచోటి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను కింద పేర్చుకుని వాటిపై బియ్యం బస్తాలతో వే బిల్లును సృష్టించుకుని వీరు బయలుదేరినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.


విచారణలో స్మగ్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు వేలూరు దగ్గర కంటైనర్‌ కోసం వేచి ఉన్న యాదమరికి చెందిన వెంకటే్‌షనాయుడు, హరిమూర్తిని అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కార్లు సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న దుంగలు, రూ.1.5 కోట్లు, వాహనాల విలువ రూ.50 లక్షలు కలిపి రూ.2 కోట్లల ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ సాధిక్‌ ఆలీ, ఎస్‌ఐ తిప్పేస్వామి, సిబ్బందిని అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఈబీ జేడీ విద్యాసాగర్‌ నాయుడు, డీఎస్పీలు సుధాకర్‌రెడ్డి, రవి మనోహరాచారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-06T07:18:19+05:30 IST