Abn logo
Apr 8 2020 @ 04:58AM

డేంజర్‌ జోన్‌.. ఒకే రోజు 9 మందికి పాజిటివ్‌

గుంటూరులో ఎనిమిది ప్రాంతాల్లో రెడ్‌జోన్లు

జిల్లావ్యాప్తంగా 41 కేసుల్లో గుంటూరులోనే 26 

టూటౌన్‌లో కరోనా వ్యాప్తితో నగరవాసుల్లో కలవరం

పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున ఆంక్షలు కఠినం

లాక్‌డౌన్‌ సమయం ఉదయం 6 నుంచి 9 గంటలకి కుదింపు


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌): రెడ్‌ జోన్లు ఇవే.. 

కొరిటెపాడులోని చైతన్యపురి, రెడ్లబజారు, శ్రీనివాసరావుపేట 6, 9, 12 లేన్లు, దర్గామాన్యం, సంగడిగుంట, ఆనందపేట 6, 8 లేన్లు, ఆటోనగర్‌, బుచ్చయ్యతోట 3వ లైను, మంగళదాసునగర్‌ ప్రాంతాలు 


ఆక్టోపస్‌ బలగాలు రాక

గుంటూరులో కరోనా పాజిటివ్‌ కేసులు ఆందోళన కలిగించే రీతిలో విస్తరిస్తున్న క్రమంలో ఆక్టోపస్‌ బలగాలను రంగంలోకి దింపారు. ఏపీఎస్పీ బలగాలు రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు సిబ్బంది కొరతతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గుంటూరుకు కేటాయించిన ఆక్టోపస్‌ బలగాలు పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌లో సిద్ధంగా ఉన్నాయి.  


గుంటూరును కరోనా కలవరపెడుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. వైరస్‌ వ్యాప్తి విస్తరిస్తోంది. గుంటూరు నగరం డేంజర్‌ జోన్‌లోకి చేరుకుంటోన్నది. గుంటూరు మంగళదాసునగర్‌లో ప్రారంభమైన కరోనా వైరస్‌ క్రమక్రమంగా అన్ని ప్రాంతాల్లోనూ వెలుగు చూస్తోన్నది. మంగళవారం వచ్చిన 9 పాజిటివ్‌ కేసులు గుంటూరు నగర పరిధిలోనివే కావడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు వన్‌టౌన్‌ ప్రాంతానికే పరిమితమైన వైరస్‌ టూటౌన్‌లోకి ఎలా ప్రవేశించిందనే దానిపై పోలీసు వర్గాలు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు.


సోమవారం ఆనందపేట, ఆర్టీసీ కాలనీలో పాజిటివ్‌ కేసులు రాగా మంగళవారం ఉదయం బుచ్చయ్యతోటలో ఓ కేసు నమోదైంది. సాయంత్రానికి వెలువడిన 8 పాజిటివ్‌ కేసుల్లో బుచ్చయ్యతోటలో మరో రెండు,  శ్రీనివాసరావుతోటలో 3, వేజండ్లలో మరో కేసు నమోదైంది. టూటౌన్‌లోని సాయిబాబారోడ్డులో ఒక కేసు, కొరిటెపాడు రెడ్ల బజార్‌లో మరో కేసు నమోదయ్యాయి. సాయిబాబా రోడ్డులో నివాసం ఉంటున్న దంపతులు ఈ నెల 17న అమెరికా నుంచి వచ్చారు. కరోనాపై అవగాహనతో వారు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చారనే కోణంలో వారి నమూనాలను పరీక్షకు పంపగా దంపతుల్లో 53 ఏళ్ళ ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు ఆమె భర్తను కూడా క్వారంటైన్‌ చేస్తున్నారు. కొరిటెపాడు రెడ్లబజారులో ఓ డాక్యుమెంట్‌ రైటర్‌కి పాజిటివ్‌గా గుర్తించారు. వన్‌టౌన్‌లో వైరస్‌ సోకిన వారి ద్వారానే ఇతడికి కరోనా సోకి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆయనతో ఉన్న కొడుకు, కోడలు, భార్య, మనవళ్లను క్వారంటైన్‌ చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా ఇతడితో   సన్నిహితంగా మెలిగిన వారిలోను ఆందోళన మొదలైంది. డాక్యుమెంట్‌ రైటర్‌కు పాజిటివ్‌ రావడంతో రిజిస్ట్రేషన్‌ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. బుచ్చయ్యతోటలో ఇప్పటి వరకు 4 కేసులు నమోదు కాగా అందులో ఏ ఒక్కరూ ఢిల్లీ నిజాముద్దీన్‌కు వెళ్ళిన వారు లేరు. 


కంటైన్‌మెంట్‌జోన్‌లో కొరిటెపాడు, చైతన్యపురి 

కరోనా వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 8 ప్రాంతాలతో పాటు కొరిటెపాడు, చైతన్యపురి ప్రాంతాలను కూడా కంటైన్‌మెంట్‌జోన్లుగా మారుస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాధ తెలిపారు. ఈ ప్రాంతాల్లో  ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాలు, మందులను డోర్‌ టు డోర్‌ వాహనాల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందని ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలన్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థ 2,020 మంది పారిశుధ్య సిబ్బందిని 200 బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా పరిశుధ్య పనులు నిర్వహిస్తున్నామన్నారు.   విస్తృతంగా సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో డిస్‌ఇన్‌ఫెక్షన్‌ పనులు నిర్వహిస్తున్నామన్నారు.    


సమయం కుదింపు

గుంటూరులో రోజురోజుకు పెరుగుతోన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య దృష్ట్యా సరుకుల కోసం ప్రజలు బయటకు వచ్చే  సమయాన్ని ఉదయం 6  నుంచి 9 గంటలకు పరిమితం చేశారు. రెడ్‌జోన్లలో ప్రజలు ఇళ్ల నుంచి అసలు బయటకు రావడానికి వీల్లేకుండా ఆంక్షలు కఠినతరం చేశారు. బయట వ్యక్తులు కూడా ఆయా ప్రాంతాల వైపు తిరగరాదని  అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆదేశించారు. లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో నగరంలో బుధవారం నుంచి ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని మంగళవారం రాత్రి అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో జరిగిన సమావేశంలో అధికారులను ఆదేశించారు.   ఉదయం 9 తరువాత ఏ ఒక్కరూ రోడ్లపై కనిపించేందుకు వీల్లేదని, అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.  


హాట్‌స్పాట్లలో రాకపోకలు నిషేధం

రేంజ్‌ పరిధిలో పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి రాకపోకలను నిషేధించినట్లు  ఐజీ జె.ప్రభాకరరావు తెలిపారు. రోడ్లను ఎక్కడికక్కడ మూసివేసి రాకపోకలు నిషేధించి ఇతరులకు వైరస్‌ సోకకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆయా విదేశాలు, ఢిల్లీ వెళ్ళి వచ్చిన వారు పోలీసులను సంప్రదించని వారు ఎవరైనా ఉంటే తక్షణం వారు పోలీసులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  


అచ్చంపేట, క్రోసూరులో రెడ్‌జోన్లు 

సత్తెనపల్లి సర్కిల్‌ పరిధిలోని అచ్చంపేటలో 4, క్రోసూరులో 1 కరోనా వైరస్‌ పాజిటీవ్‌ కేసులు నమోదైనందున ఆయా ప్రాంతాలను రెడ్‌జోన్లుగా చేశారు. రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయరావు మంగళవారం అచ్చంపేటలోని రాజీవ్‌ కాలనీ, మసీదు ప్రాంతాలతో పాటు క్రోసూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్‌ జిల్లా పరిధిలో మొత్తం 11 కేసులు కరోనా పాజిటీవ్‌ వచ్చిన నేపథ్యంలో అన్ని చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ సరిహద్దును పూర్తిగా మూసి భద్రతను కట్టుదిట్టం చేసినట్టు చెప్పారు. మంగళవారం సత్తెనపల్లి రూరల్‌ సీఐ ఆదినారాయణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ చక్రవర్తి  మాట్లాడుతూ రెండు మండలాల నుంచి 26 మంది క్వారంటైన్‌లో ఉన్నారన్నారు.   


Advertisement
Advertisement
Advertisement