కరోనా ధ్రువీకరణ పత్రాలపై ఉన్న మోదీ ఫొటోను తొలగించండి : ఈసీ ఆదేశం

ABN , First Publish Date - 2021-03-06T15:48:23+05:30 IST

కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను వెంటనే తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కేంద్ర ఎన్నికల

కరోనా ధ్రువీకరణ పత్రాలపై ఉన్న మోదీ ఫొటోను తొలగించండి : ఈసీ ఆదేశం

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను వెంటనే తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్  అమలులో ఉన్న కారణంగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా టీకా ధ్రువీకరణ పత్రం వారికి ఇస్తున్నారు. ఈ పత్రాలపై ప్రధాని మోదీ ఫొటో ఉంటుంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, మోదీ ఫొటోను తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఈసీ లేఖ రాసింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇచ్చే ధ్రువీకరణ పత్రంపై మోదీ ఫొటో ఉండటం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని తృణమూల్ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును అందుకున్న ఈసీ... పై నిర్ణయాన్ని తీసుకుంది. 


కొన్ని రోజులు కిందట కూడా ఈసీ ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. పెట్రోల్ బంకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో ఉన్న కేంద్ర పథకాల హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఈ హోర్డింగులను తొలగించేందుకు పెట్రో బంకుల యాజమాన్యాలకు ఈసీ 72 గంటల సమయం ఇచ్చింది. అప్పుడు కూడా తృణమూల్, కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పెట్రో బంకుల్లో ప్రధాని మోదీ ఫొటోలుండటం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని వారు పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-06T15:48:23+05:30 IST