అద్దిళ్లు వెలవెల

ABN , First Publish Date - 2020-08-11T10:30:24+05:30 IST

ఉద్యోగాలు చేస్తున్నవారు సమీప గ్రామాల నుంచి ఒంగోలుకు రావాలంటే చాలా సమయం వృథా అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడే ఇల్లు ..

అద్దిళ్లు వెలవెల

ఉపాధికోసం వచ్చినవారు సొంతూళ్లకు

కనిపించని విద్యార్థుల సందడి

అదనపు భారానికి తోడు కరోనా భయం

వీధివీధినా దర్శనమిస్తున్న టూలెట్‌ బోర్డులు

బోసిపోతున్న హాస్టల్స్‌


కరోనా ప్రభావం అన్నిరంగాలతో పాటు అద్దె ఇళ్లపై కూడా పడింది. సహజంగా మూడు నాలుగు నెలల కిందటి వరకు ఒంగోలు నగరంలో ఇల్లు అద్దెకు కావాలంటే చెప్పులరిగేదాకా తిరగాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. టూలెట్‌ బోర్డుల కోసం వెతకాల్సిన అవసరం లేకుండా వీధికి రెండు, మూడు దర్శనమిస్తున్నాయి. అపార్ట్‌మెంట్లది కూడా ఇదే పరిస్థితి. ఉపాఽధి కోసమో, పిల్లల చదువుల నిమిత్తమో పల్లెల నుంచి పట్టణానికి వచ్చిన వారంతా స్వగ్రామాల బాట పట్టారు. ప్రస్తుతానికి స్కూళ్లు, కాలేజీలు తెరిచే అవకాశం కూడా లేనందువల్ల పట్టణంలోని ఇళ్లను అద్దెకు అడిగేవారే లేక వెలవెలబోతున్నాయి. ఇదే సమయంలో కొందరు యజమానులు ఇళ్లు ఖాళీ అయినా టూలెట్‌ బోర్డు పెట్టడం లేదు. కారణం కరోనా భయం. ఎవరైనా అడిగినా ఇప్పుడు ఇవ్వమండి అంటూ దాటవేయడం గమనార్హం.


ఒంగోలు(జడ్పీ), ఆగస్టు 10: ఉద్యోగాలు చేస్తున్నవారు సమీప గ్రామాల నుంచి ఒంగోలుకు రావాలంటే చాలా సమయం వృథా అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. అలాంటి వారిలో ఎక్కువశాతం మంది ఇప్పటికే అద్దె ఇళ్లు ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లిపోయారు. వీరిలో ప్రైవేటు ఉద్యోగస్తులే అధికం. యాజమాన్యాలు కూడా కరోనా వల్ల జీతాలలో కోతపెట్టడంతో అద్దెలు భరించలేక  చాలామంది కష్టమో, నష్టమో సొంతూళ్ల నుంచే విధులకు హాజరవుదామని నిర్ణయించుకున్నారు. సాధారణంగా మే, జూన్‌లో అడ్మిషన్లు మొదలై విద్యార్థుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. కరోనాతో అడ్మిషన్లు కూడా అటకెక్కాయి. ఈ ప్రభావం కూడా అద్దె ఇళ్లపై పడింది. కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకునే విద్యార్థులు సైతం లేకపోవడంతో నగరంలో ఉన్న హాస్టల్స్‌ కూడా బోసిపోతున్నాయి. 


అదనపు భారం భరించలేకనే.. 

కరోనాతో అసలే చాలీచాలని జీతాలు దీనికి తోడు నెలతిరిగే సరికి అద్దెభారం. పట్టణంలో వెంటాడుతున్న కరోనాముప్పునకు తోడు పెరిగిన అద్దెలు కూడా భరించడం సామాన్యుడికి తలకు మించిన భారంగా మారాయి. అందువల్లే చాలామంది అదనపు భారాన్ని వదిలించుకోవడానికి స్వగ్రామాల బాట పట్టారు. రోజువారీ కూలిపై ఆధారపడిన చాలామంది ఉపాధి కరవై పట్టణాన్ని వీడుతున్నారు. వీరిలో ఆటోవాలాలు మొదలుకుని బేల్దారి మేస్త్రీలు వరకూ ఉన్నారు. వీరంతా కూడా తమ స్తోమతకు తగిన ఇంట్లో అద్దెకు ఉండేవారు. కనీసం మూడు నుంచి నాలుగు వేలు వరకు అద్దె కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పని లేకపోగా నెల వచ్చేసరికి అద్దె కట్టలేక ఖాళీ చేసి సొంతూళ్లబాట పట్టారు. మరికొందరు ప్రస్తుతం ఉన్నదాని కన్నా తక్కువ అద్దెకు చూసుకుని మారిపోతున్నారు. ఇంకొంతమంది  అద్దెలు తక్కువని సమీప గ్రామాల్లో అద్దెకు తీసుకుని పనులకోసం పట్టణాలకు వస్తున్నారు.


షాపులది అదేబాట

ఇళ్లకు తోడు షాపులు కూడా అధికసంఖ్యలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వ్యాపారాలు లేక అద్దెలు కట్టలేక ఇప్పటికే చాలామంది చిరు వ్యాపారులు వారి దుకాణాలను ఖాళీచేశారు. కరోనా ప్రభావం తగ్గేదాకా కొత్తవారు ఎవరూ వ్యాపారం కోసం దుకాణాలు అద్దెకు అడిగే పరిస్థితి కనపడటం లేదు. టిఫెన్‌ సెంటర్‌ కోసమో, టీబడ్డీ కోసమో అద్దెకు తీసుకున్న వారు సైతం భారం భరించలేక ఖాళీచేస్తున్నారు.


కరోనా భయంతో కొత్తవారికి నిరాకరిస్తున్న యజమానులు

ఎవరైనా కొత్తగా పట్టణానికి ఉద్యోగ నిమిత్తమో, మరేదైనా కారణం చేతనో వచ్చినవారికి ఇళ్లు అద్దెకు ఇవ్వడానికి యజమానులు భయపడడం కూడా ఇళ్లు ఖాళీగా ఉండడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో బయటివారికి అద్దెకు ఇవ్వాలంటేనే యజమానులు భయపడే పరిస్థితికి వచ్చారు. కరోనాపై అవగాహన కల్పించి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పినా కొందరు అభద్రతాభావాన్ని వీడకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణం.


మార్చి నుంచి ఖాళీగానే ఉంది.. కె. అనురాధ , గృహిణి

మా ఇల్లు ఎప్పుడూ ఖాళీగా లేదు. కరోనాతో మూడు నెలల నుంచి అద్దెకు ఎవరూ అడగడం లేదు. అడపాదడపా వచ్చిన వారు సైతం అద్దె భరించలేమని వెళ్లిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆర్థిక స్థితిగతులు తారుమారయ్యాయి. ఆ ప్రభావం వల్ల పట్టణానికి కొత్తగా వచ్చేవారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. అందువల్లే అద్దెకు అడిగేవారు తగ్గిపోయారు .

Updated Date - 2020-08-11T10:30:24+05:30 IST