ముడుపులతో భర్తీ..?

ABN , First Publish Date - 2022-09-25T05:50:47+05:30 IST

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

ముడుపులతో భర్తీ..?
ఏడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయం

ఏడీసీసీబీ ఉద్యోగాల భర్తీపై ఆరోపణలు

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 24: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో 86 పోస్టుల భర్తీకి నోటిఫికేషన ఇచ్చారు. ఇందులో 15 పోస్టులను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌) ఉద్యోగులకు కేటాయించారు. ఈ 15 పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షకు 28 మంది హాజరయ్యారు. వీరిలో 25 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. కానీ, అర్హత లేని సొసైటీ ఉద్యోగులు పరీక్షలకు హాజరయ్యారని, దీని వెనుక ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్నాయి. ఏడీసీసీ బ్యాంకులో ఓ కీలక అధికారి మధ్యవర్తిగా వ్యవహరించారని తెలిసింది. నిబంధనల ప్రకారం పదేళ్ల సర్వీసు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. కానీ ఎంపిక జాబితాలో పదేళ్ల సర్వీస్‌ పూర్తికానివారికి చోటు ఎలా కల్పించారని కొందరు ప్రశ్నిస్తున్నారు. వారికి క్లర్క్‌ పోస్టులు ఎలా కేటాయిస్తారని నిలదీస్తున్నారు. డబ్బులు తీసుకుని పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈనెల 26వతేదీ తరువాత ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఎంపిక జాబితాలో ఐదారుగురికి కనీసం ఐదేళ్ల సర్వీస్‌ కూడా లేదని సమాచారం. చాలా జిల్లాల్లో మౌఖిక పరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మౌఖిక పరీక్షకు పిలవడానికి ముడుపుల బాగోతమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2022-09-25T05:50:47+05:30 IST