Abn logo
Jan 21 2021 @ 00:44AM

రిసార్ట్స్‌, విల్లాలే టార్గెట్‌

‘సాయిప్రియా’లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

విజయవాడకు చెందిన పాత నేరస్థుడు గంగాధర్‌ అరెస్టు

సుమారు 54 తులాల బంగారం స్వాధీనం


విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):


రుషికొండ సాయిప్రియా రిసార్ట్స్‌లో చోరీ కేసును నగర పోలీసులు ఛేదించారు. విజయవాడకు చెందిన పాత నేరస్థుడు పోకతోట గంగాధర్‌రావు అలియాస్‌ సిద్ధార్థ అలియాస్‌ కార్తీక్‌ ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించి అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు 54 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ కమిషనరేట్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మనీష్‌కుమార్‌సిన్హా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 


గంగాధర్‌ చిన్నతనం నుంచి విజయవాడ బెంజ్‌సర్కిల్‌లో గల అమ్మ అనాథ ఆశ్రమంలో పెరిగాడు. ఇంటర్‌ వరకూ చదువుకున్నాడు. నేరాలకు అలవాటుపడి 2013లో ఆశ్రమం నుంచి బయటకు వెళ్లిపోయాడు. విజయవాడలో చిన్న చిన్న చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. జైలులో తోటి ఖైదీల వద్ద భారీ చోరీలు చేయడం ఎలాగో తెలుసుకున్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత విజయవాడలో కొన్ని హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లలో చోరీలు చేశాడు.


అనంతరం విశాఖ వచ్చి బీచ్‌రోడ్డులోని హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, విల్లాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేశాడు. 2017లో పాండురంగాపురంలోని ఒక విల్లాలోకి చొరబడి పెద్దఎత్తున బంగారం, వజ్రాలను చోరీ చేశాడు. ఆకేసులో గంగాధర్‌ను త్రీటౌన్‌ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తిరుపతి వెళ్లి అక్కడ టీటీడీలో పనిచేస్తున్న ఉన్నతాధికారికి చెందిన విల్లాలో చొరబడి భారీగా బంగారు ఆభరణాలను అపహరించాడు. దీనిపై అక్కడి పోలీసులు అరెస్టు చేయడంతో కడప కారాగారంలో శిక్ష అనుభవించాడు. గత నెల ఎనిమిదిన జైలు నుంచి విడుదలై 11న విశాఖ వచ్చి గాజువాకలోని ఒక డార్మెటరీలో దిగాడు. అక్కడ వుంటూ బీచ్‌రోడ్డులోని హోటళ్లతోపాటు రుషికొండ, భీమిలి ప్రాంతాల్లో గల రిసార్ట్స్‌లో చోరీకి రెక్కీ నిర్వహించాడు. గత నెల 23న రుషికొండ వెళ్లాడు. అక్కడ సాయిప్రియా రిసార్ట్స్‌లో మరుసటిరోజు పెళ్లి జరగబోతున్నట్టు వున్న ఫెక్ల్సీని చూసి రాత్రి పది గంటల సమయంలో గోడ దూకి లోనికి వెళ్లాడు. ఒంటి గంట వరకూ రిసార్ట్‌ అంతా తిరిగాడు. మరుసటిరోజు (24న) ఉదయం ఏడు గంటలకు పెళ్లి జరగాల్సి వుండడంతో ఒక గదిలో పెళ్లి కుమార్తె అలేఖ్యతోపాటు ఆమె స్నేహితులు, తల్లి వెంకటలక్ష్మి ఒక గదిలో నిద్రపోతున్నారు. పెళ్లి కుమార్తెను అలంకరించేందుకు బంగారం వడ్డాణం, చోకర్‌, హారం, కాసులపేరు, నక్లెస్‌, చెవిదిద్దులు, పాపిటబిళ్ల వంటి 53.3/4 తులాల బంగారు ఆభరణాలను ఒక క్లాత్‌బ్యాగ్‌లో పెట్టి మంచం పక్కన ఉంచారు. ఆ గదికి వున్న యూపీవీసీ కిటికీ తలుపులకు గడియ పెట్టకపోవడంతో గంగాధర్‌ వాటిని తోసి లోపలకు ప్రవేశించాడు. బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగ్‌ను తీసుకుని తిరిగి కిటికీ ద్వారా బయటకు వచ్చాడు. రిసార్ట్స్‌ గోడ దూకి రోడ్డుపైకి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గీతం కాలేజీ వద్ద ఆగి వున్న ఆటో వద్దకు వెళ్లి సిటీలోకి రావాలని అడగ్గా, రానని చెప్పడంతో ‘ఓలా’లో కారు బుక్‌ చేసుకుని నేరుగా శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లిపోయాడు. మరుసటిరోజు అక్కడ ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కొంత బంగారాన్ని రూ.1.5 లక్షలకు తాకట్టుపెట్టి, మిగిలిన బంగారాన్ని తాను దిగిన హోటల్‌ గదిలోనే దాచుకున్నాడు. భారీ చోరీ కావడంతో సీపీ మనీష్‌కుమార్‌సిన్హా, క్రైమ్‌ డీసీపీ సురేష్‌బాబు కలిసి కేసు దర్యాప్తు కోసం సీసీఎస్‌ ఏసీపీ శ్రావణ్‌కుమార్‌, సీఐ రామచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఆయా బృందాలు ఘటనా స్థలంతోపాటు రుషికొండ నుంచి మధురవాడ వరకూ వున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి అనుమానితుల సెల్‌ఫోన్‌ కాల్‌ డేటాను విశ్లేషించి గంగాధర్‌...ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. అతడు శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఒక హోటల్‌లో వుండగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు. ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన ఆభరణాలను విడిపించాల్సి వుందని సీపీ తెలిపారు. గంగాధర్‌పై విశాఖలో పది కేసులు ఉన్నాయన్నారు. హోటళ్లు, విల్లాలు, ఫంక్షన్లు జరిగే రిసార్ట్స్‌ను లక్ష్యంగా చోరీలు చేయడం గంగాధర్‌ ప్రత్యేకత అని తెలిపారు. చిన్నపాటి క్లూ కూడా దొరకని కేసు మిస్టరీని ఛేదించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సీసీఎస్‌ ఏసీపీ డి.శ్రావణ్‌కుమార్‌, సీఐలు రామచంద్రరావు, అవతారం, సూరినాయుడు, ఇతర సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

నిందితుడు గంగాధర్‌ (ఫైల్‌ ఫొటో)


Advertisement
Advertisement
Advertisement