పెనుబర్తిలో పింఛన్ల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2021-04-11T05:47:40+05:30 IST

పొందూరు మండలం పెనుబర్తి పంచాయతీలో కొన్ని నెలల కిందట తొలగించిన నలుగురి పింఛన్లను హైకోర్టు ఆదేశాలతో అధికారులు పునరుద్ధరించారు. పెనుబర్తికి చెందిన సీపాన గోవిందమ్మ, కూన వరలక్ష్మి, పైడి తవిటినాయుడు, చౌదరి రామారావులకు చెందిన పింఛన్లను 13 నెలల కిందట తొలగించిన విషయం తెలిసిందే. రాజకీయ కారణాలతో వైసీపీ నాయకులు తమ పింఛన్లు తొలగించారని... వాటిని పునరుద్ధరించాలని అధికారుల చుట్టూ బాధితులు తిరిగారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో చివరికి హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల అర్హతలు పరిశీలించిన హైకోర్టు 45 రోజుల్లో 13 నెలల పింఛన్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పెనుబర్తిలో పింఛన్ల పునరుద్ధరణ
బాధితులకు పింఛన్‌ అందజేస్తున్న అధికారులు

హైకోర్టు ఆదేశాలతో 13 నెలల మొత్తాన్ని అందజేసిన అధికారులు

పొందూరు, ఏప్రిల్‌ 10: పొందూరు మండలం పెనుబర్తి పంచాయతీలో కొన్ని నెలల కిందట తొలగించిన నలుగురి పింఛన్లను హైకోర్టు ఆదేశాలతో అధికారులు పునరుద్ధరించారు. పెనుబర్తికి చెందిన సీపాన గోవిందమ్మ, కూన వరలక్ష్మి, పైడి తవిటినాయుడు, చౌదరి రామారావులకు చెందిన పింఛన్లను 13 నెలల కిందట తొలగించిన విషయం తెలిసిందే. రాజకీయ కారణాలతో వైసీపీ నాయకులు తమ పింఛన్లు తొలగించారని... వాటిని పునరుద్ధరించాలని అధికారుల చుట్టూ బాధితులు తిరిగారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో చివరికి హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల అర్హతలు పరిశీలించిన హైకోర్టు 45 రోజుల్లో 13 నెలల పింఛన్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో శనివారం డీఆర్డీఏ ఏవో డీవీవీఎస్‌ దొర, పంచాయతీ కార్యదర్శి కేశవరావులు.. 13 నెలలకు సంబంధించి పింఛన్‌ మొత్తం రూ.1,14,750 లను బాధితులకు అందించారు. 


రాజకీయ కక్షలతో పింఛనుదారుల బలి


రాజకీయ కక్షల కారణంగా అర్హులైన సామాజిక పింఛన్‌దారులు  బాధితులుగా మారుతున్నారు. తమ పార్టీ వారు కాదని.. తమకు ఓటు వేయలేదని మొదట పింఛన్‌దారులపై కొంతమంది నేతలు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. అనర్హులు ఎంతోమంది జాబితాలో ఉన్నా, తమ పార్టీకి వ్యతిరేకమైన అర్హుల పింఛన్లను తొలగిస్తున్నారు. ఇందుకోసం అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో చాలామంది పింఛన్‌దారులు నష్టపోతున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నా.. పట్టించుకోకపోవడంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పెనుబర్తిలో కూడా ఇదే తరహాలో నలుగురి పింఛన్లు తొలగించగా బాధితులు కోర్టును ఆశ్రయించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా 498 మంది పింఛన్లు తొలగించారు. వాటిలో సాంకేతిక కారణాలతో కొన్ని తొలగిస్తే.. ఎక్కువ మంది రాజకీయ కక్షలకు బలైపోయారు. అప్పట్లో వైసీపీకి చెందిన సువ్వారి గాంధీ బాధితుల తరపున హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పోరాటం వల్ల హైకోర్టు ఆదేశాలతో బాధితులకు 49 నెలల పింఛన్‌ మంజూరైంది. తాజాగా పెనుబర్తిలో కూడా నలుగురికి 13 నెలల పింఛన్‌ పునరుద్ధరణ జరిగింది. హైకోర్టు చీవాట్లతో అబాసుపాలవుతున్నా అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా నేతల ఒత్తిడికి తలొగ్గకుండా.. సక్రమంగా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-04-11T05:47:40+05:30 IST