రైస్‌మిల్లు యజమానుల పరేషాన్‌

ABN , First Publish Date - 2021-12-01T06:10:26+05:30 IST

యాసంగిలో రైతులు వరి పంటను సాగు చేయవద్దని ప్రత్యామ్నాయ పంటల సాగుకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

రైస్‌మిల్లు యజమానుల పరేషాన్‌

వరి సాగు వద్దంటున్న ప్రభుత్వం 

సంక్షోభంలో పడనున్న జిల్లా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టిన మిల్లు యజమానులు 

ఆందోళనలో రైస్‌మిల్లు కార్మికులు 

నిజామాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యాసంగిలో రైతులు వరి పంటను సాగు చేయవద్దని ప్రత్యామ్నాయ పంటల సాగుకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎఫ్‌సీఐ బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయబోమంటున్న కారణంగా రైతులు ధాన్యం సాగును విరమించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో మిల్లు యజమానులు పరేషాన్‌లో పడ్డారు.

    ఫ పది వేల మంది కార్మికుల ఉపాధి..

జిల్లాలో ప్రధాన పంట వరే కావడంతో వీటిపై ఆధారపడి వందలాది రైస్‌ మిల్లులు కొనసాగుతున్నాయి. బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మూతపడే పరిస్థితులు నెలకొంటే కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉంటుంది. అలాగే రైస్‌మిల్లుల్లో సుమారు 10వేల మంది వరకు కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ప్రతి సీజన్‌లో లక్షలాది మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి లెవిగా ఈ రైస్‌ మిల్లులు అందిస్తున్నారు. వరిసాగు తగ్గితే పలు మిల్లులు మూతపడే అవకాశం ఉండగా గతంలోలాగానే నేరుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు సిద్ధమవు తు న్నారు. ఇతర రాష్ట్రాల్లానే డిమాండ్‌ ఉన్న రకాలను కొనుగోలు చేసి మిల్లులను యథావిధిగా కొనసాగించేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు.

     ఫ 50 ఏళ్లుగా మిల్లుల నిర్వహణ..

జిల్లాలో సుమారు 320 వరకు రైస్‌ మిల్లులు ఉన్నాయి. వీటిలో 250 వరకు రా రైస్‌ మిల్లులు ఉండగా 70 వరకు బాయిల్డ్‌ మిల్లులు ఉన్నాయి. వీటిలో రెండు టన్నుల నుంచి 8 టన్నుల వరకు ఉన్న రైస్‌ మిల్లులు ఉన్నాయి. ఒక్కో మిల్లుపైన 5 నుంచి 10 కోట్ల వరకు ఖర్చు చేసి ఏర్పాట్లు చేశారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదలచేసినప్పటి నుంచే జిల్లాలో రైస్‌ మిల్లులను మొదలుపెట్టారు. సుమారు 50 ఏళ్లుగా మిల్లులను నడిపిస్తున్నారు. మొదట 10లోపు ఉన్న ఈ రైస్‌ మిల్లులు 320 వరకు చేరుకున్నాయి. ఈ మిల్లుల పరిధిలో ప్రతిసీజన్‌లో వెయ్యి కోట్లకు పైగా ధాన్యాన్ని తీసుకుంటున్నారు. బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి లేవిగా అందిస్తున్నారు. రెండుసీజన్‌లలో సుమారు 2వేల కోట్ల వరకు ఈ మిల్లులల్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు కేటాయిస్తుండగా గతంలో మాత్రం నేరుగా మిల్లర్‌లే బహిరంగ మార్కెట్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేసి నడిపించేవారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 2010 నుంచి ఈ ధాన్యం కొనుగోళ్లను చేస్తున్నారు. 

    ఫ మూడున్నర లక్షల ఎకరాలకుపైగా వరిసాగు..

ప్రస్తుతం రెండు సీజన్‌లలో జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకుపైగా వరిసాగవుతోంది. రెండు సీజన్‌లలో కలిపి సుమారు 16లక్షల మెట్రిక్‌టన్నుల వరకు ధాన్యం వస్తుంది. ధాన్యం దిగుబడి ఎక్కువకావడం వల్ల రెండు సీజన్‌లు కలిపి సుమారు 11 నెలలపాటు మిల్లులు నడుస్తున్నాయి. ధాన్యం లేని సమయంలో నెల వరకు రైస్‌ మిల్లులో కార్యకలాపాలను నిలిపివేస్తున్నారు. మిల్లులు మూతపడితే రైతులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతున్నాయి. జిల్లాలో మిల్లులు ఉండడం వల్ల ధాన్యానికి డిమాండ్‌ ఉంటుంది. ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వరిసాగు ఆగితే మిల్లులు ఒక సీజన్‌లో మూతపడనున్నాయి. ఈ మూతపడితే వీటిపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి కోల్పోయే పరిస్థితి  నెలకొంది. 

   ఫ ప్రత్యామ్నాయాలపై మిల్లు యజమానుల చూపు..

జిల్లాలోని రైస్‌ మిల్లర్లు మాత్రం వరిసాగు ఆగితే ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి గతంలోలాగా డిమాండ్‌ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకముందు మార్కెట్‌లోని మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ఇప్పటికి సన్న రకాలను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉన్న బియ్యం రకం ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు సన్న బియ్యాన్ని పంపిస్తున్నారు. జిల్లాలోని కొంతమంది మిల్లర్‌లు ఈ బియ్యాన్ని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. వరిసాగు జిల్లాలో కొంతమేర తగ్గినా ఇతర ప్రాంతాల నుంచి సన్న రకాలను కొనుగోలు చేసి నడిపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత మిల్లర్లు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని కోరేందుకు మిల్లర్లు యూనియన్‌ తరఫున సిద్ధమవుతున్నారు. ఎన్నో సమస్యలను ఎదు ర్కొంటూ నడిపిస్తున్నామని రైస్‌ మిల్లర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి తెలిపారు. గతంలో నేరుగా కొనుగోలు చేసి మిల్లులను నడిపించామన్నారు. వరిసాగు తగ్గితే ఇతర ప్రాంతాల నుంచైనా కొనుగోలు చేసి డిమాండ్‌ ఉన్న రకాలతో నడిపిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరేందుకు సిద్ధవుతున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-12-01T06:10:26+05:30 IST