యథేచ్ఛగా రోడ్లపైకి..

ABN , First Publish Date - 2020-05-07T10:03:14+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌లో పలు దుకాణాలు తెరిచేందుకు

యథేచ్ఛగా రోడ్లపైకి..

లాక్‌డౌన్‌లో పలు ఆంక్షలు ఎత్తివేయడంతో తెరుచుకున్న షాపులు

మద్యం దుకాణాల వద్ద ఉదయం పూట క్యూలైన్లు, తర్వాత వెలవెల

కానరాని మాస్కులు, భౌతిక దూరం జాగ్రత్తలు

నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో ప్రయాణాలు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి): కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌లో పలు దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో జనాలు విచ్ఛలవిడిగా రోడ్లపైకి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా వర్గాల ప్రజలు రోడ్లపై బిజీబిజీగా తిరగడం కనిపించింది. పలు షాపుల వద్ద పెద్దగా భౌతిక దూరం పాటించకపోగా, చాలామంది మాస్కులు లేకుండానే బయట తిరిగారు. ద్విచక్ర వాహనాలపై ఒకరికి మించి ఇద్దరు, నాలుగు చక్రాల వాహనాల్లో నలుగురు వరకు, ఆటోల్లో నలుగురైదుగురు ప్రయాణించడం గమనార్హం.


దీంతో వైరస్‌ ఎక్కడ వ్యాప్తి చెందుతుందోననే ఆందోళన వ్యక్తం అవుతున్నది. 45 రోజుల తర్వాత మద్యం షాపులను తెరవడంతో అక్కడక్కడ మాత్రమే క్యూ లైన్లలో ఉన్నారు. ఉదయం వేళలో ఎక్కువగా షాపుల వద్దకు వచ్చారు. మధ్యాహ్నాం నుంచి సాయంత్రం వరకు షాపుల వద్ద పెద్దగా జనం లేకుండాపోయారు. కొన్ని షాపుల్లో అంతంత మాత్రంగానే మద్యం నిల్వలు ఉండగా, కావాల్సిన బ్రాండ్లు లభ్యంకాక వెనుతిరిగి వెళ్లిపోయారు. లిక్కర్‌ కంటే బీర్లు అధికంగా ఉన్నాయి. మద్యం కొనుగోలు చేసిన వారిలో చాలా మంది ముందుచూపుతో వారం రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేశారు. ఫుల్‌ బాటిళ్లు అత్యధికంగా అమ్ముడు పోయాయి.


ఉదయం వేళల్లో కొన్ని షాపుల్లో ఎక్కువ ధరలకు అమ్మగా, ఎక్సైజ్‌ శాఖ నుంచి పెంచిన మద్యం ధరల జాబితాలు అందడంతో వాటి ప్రకారం విక్రయించారు. నాలుగు మాసాల క్రితమే అన్ని బ్రాండ్లపై క్వార్టర్‌పై 20, హాఫ్‌కు 40, ఫుల్‌బాటిల్‌పై 80 రూపాయలు పెంచిన ప్రభుత్వం చీఫ్‌ లిక్కర్‌పై 11 శాతం, ఇతర బ్రాండ్లపై 16 శాతం ధరలు పెంచింది. ఒక్కో బాటిల్‌పై 20 నుంచి 120 రూపాయల వరకు అదనంగా ధర పెరిగింది. ధరలు పెంచినా కూడా మద్యంప్రియులు లోలోన ప్రభుత్వ తీరుపై రుస రుసలాడుకుంటూనే ‘కిక్కు’రుమనకుండానే వెళ్లారు.


ఎక్కడ కూడా నిరసనలు వ్యక్తం కాలేదు. ఎలిగేడు మండల కేంద్రంలో ఒక షాపును తీయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో దొంగ చాటున మద్యం విక్రయించారని, ప్రజల సమక్షంలో ఆ షాపులో ఉన్న మద్యం నిల్వల లెక్కలు తీసిన తర్వాతనే షాపు నడిపించాలని డిమాండ్‌ చేశారు. ఆయా షాపుల వద్ద భౌతిక దూరం పాటించ లేదు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో క్యూలైన్లలో చెప్పులు పెట్టిన దృశ్యాలు కనిపించాయి. మంథని, పెద్దపల్లిలోని పలు షాపుల వద్ద మహిళలు మద్యం కోసం క్యూలైన్‌లో నిల్చున్నారు. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల దుకాణాలను తెరిచారు. మున్సిపాలిటీల్లో 50 శాతానికి మించకుండా షాపులను తెరవ వద్దని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఆయా దుకాణాల యజమానులతో కమిషనర్‌, మేయర్‌ సమావేశం నిర్వహించి షాపుల వారీగా నంబర్లు కేటాయించారు. ఆయా తేదీల్లో మాత్రమే వాళ్లు షాపులను తీయాలని క్యాలెండర్‌ను రూపొందించారు.


సుల్తానాబాద్‌, పెద్దపల్లి, మంథనిలో తెరవకూడని షాపులు మినహా మిగతా అన్నింటిని తీసి మధ్యాహ్నం వరకు మూసివేశారు. ఇక్కడ కూడా నంబర్లు కేటాయించి ఆ మేరకు షాపులను నడుపుకునే విధంగా మున్సిపల్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆటోలు నడుపుకునేందుకు అవకాశం ఇవ్వగా, డ్రైవర్‌తో సహా ముగ్గురికి మించకూడదనే నిబంధన ఉండగా, దానిని కొందరు ఉల్లంఘించారు. పొద్దంతా రోడ్ల మీద విచ్ఛలవిడిగా వాహనాలు తిరిగాయి. లాక్‌డౌన్‌ ఎత్తేశారనే భావనతోనే జనాలు బయట తిరిగారు. 

Updated Date - 2020-05-07T10:03:14+05:30 IST