నిరసన హక్కు ఉన్నా నిరవధికంగా రోడ్లను దిగ్బంధం చేయొద్దు

ABN , First Publish Date - 2021-10-22T09:15:35+05:30 IST

కేంద్రం చేసిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సాగించే హక్కు రైతులకు ఉంటుందని, అయితే ఢిల్లీకి దారితీసే సరిహద్దులను ....

నిరసన హక్కు ఉన్నా నిరవధికంగా రోడ్లను దిగ్బంధం చేయొద్దు

రైతు సంఘాల నేతలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, అక్టోబరు 21: కేంద్రం చేసిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సాగించే హక్కు రైతులకు ఉంటుందని, అయితే ఢిల్లీకి దారితీసే సరిహద్దులను వారు నిరవధికంగా దిగ్బంధం చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. ‘రైతులకు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేసే హక్కు ఉంది. కానీ, ఇలా నిరవధికంగా రోడ్లపై బైఠాయించి దిగ్బంధం చేయరాదు. ప్రజలకూ రహదారులపై ప్రయాణించే హక్కు ఉంటుంది. రోడ్లను ఎవరూ దిగ్బంధం చేయరాదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై మూడు వారాల్లోగా సమాధానమివ్వాల్సిందిగా ధర్మాసనం రైతు సంఘాలను ఆదేశించింది. 


బ్యారికేడ్లు పెట్టింది పోలీసులే: దవే

నిరసన తెలిపే హక్కు పౌరుల ప్రాథమిక హక్కు అని రైతు సంఘాల తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదించారు. రోడ్లను దిగ్బంధం చేసింది పోలీసులేనని, రైతులు కాదన్నారు. రామలీలా మైదాన్‌ లేదా జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేసుకునేందుకు రైతులను అనుమతిస్తే ఈ సమస్యకు సులభంగా పరిష్కారం లభిస్తుందని దవే  అన్నారు. రైతుల ఆందోళనల వెనుక కనిపించని కుటిల ప్రయోజనాలు ఉన్నాయని ఎస్జీ తుషార్‌ మెహతా అన్నారు. 


మోహన్‌నాయక్‌పై మరో ‘కోకా’

ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక ఉద్యమకారిణి గౌరీ లంకేష్‌ హత్య కేసులో నిందితుడు మోహన్‌నాయక్‌పై మరోసారి ‘కోకా’ కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. మోహన్‌నాయక్‌పై గతంలో నమోదైన ‘కోకా’ కేసును 2018 ఆగస్టు 14న కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. దీనిపై గౌరీ లంకేష్‌ సోదరి కవితా లంకే్‌షతోపాటు రాష్ట్ర పోలీసులు సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని గురువారం విచారించిన జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది.  

Updated Date - 2021-10-22T09:15:35+05:30 IST