రోడ్డు తవ్వేసి మళ్లీ వేయండి!

ABN , First Publish Date - 2021-10-24T06:51:16+05:30 IST

నాణ్యతాలోపం వల్లే గోతులు పడుతున్నాయి. లోపల లేయర్ల నిర్మాణం అసలు బాగాలేదు.

రోడ్డు తవ్వేసి మళ్లీ వేయండి!
జాతీయ రహదారిలో రాజమహేంద్రవరం పరిధిలో పడిన గోతులు

 ఎన్‌హెచ్‌ 216ఏ రోడ్డు తవ్వేసి మళ్లీ వేయండి

 నాణ్యతాలోపం వల్లే తరచూ గోతులు పడుతున్నాయి

 గుండుగొలను నుంచి దివాన్‌చెరువు వరకూ నిర్మించండి

 కాంట్రాక్టు సంస్థకు సీఆర్‌ఆర్‌ఐ ఆదేశం

 గుంతలు తవ్వి పరిశీలించి నివేదికిచ్చిన నిపుణుల కమిటీ

 రావులపాలెం బ్రిడ్జిని కూడా పటిష్టపరచమని స్పష్టీకరణ

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

నాణ్యతాలోపం వల్లే గోతులు పడుతున్నాయి. లోపల లేయర్ల నిర్మాణం అసలు బాగాలేదు. వెంటనే మొత్తం రోడ్డును తవ్వేసి మళ్లీ నిర్మించండని  గుండుగొలను నుంచి దివాన్‌చెరువు వరకూ 216ఏ జాతీయ రహదారి నిర్వాహక సంస్థను సెంట్రల్‌ రోడ్డు రీసెర్చి యూనిట్‌ నిపుణుల బృందం ఆదేశించింది. జనవరి-ఫిబ్రవరి నెలల్లో గుండుగొలను నుంచి దివాన్‌       చెరువు వరకూ ఈ సంస్థకు చెందిన సుమారు పది మంది నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడక్కడ గుంతలు తవ్వి, వాటిని పరిశీలించి గత నెలలో నివేదిక ఇచ్చారు. దీనిపై నేషనల్‌ హైవే అథారిటీ వెంటనే పనులు మొదలు పెట్టవలసిందిగా సదరు సంస్థను ఆదేశించింది. ఇప్పటికే రావులపాలెం పాత బ్రిడ్జి మరమ్మతు పనులు ప్రారంభించారు. వానలు తగ్గిన వెంటనే జాతీయ రహదారి పనులు చేపట్టనున్నట్టు అధికా రులు తెలిపారు. నిజానికి దేశంలో ముఖ్యంగా ఆంధ్ర, ఒడిషా ప్రాంతాల్లో 12 ప్యాకేజీల నిర్వహణకు విదేశీ కంపెనీకి కేంద్రం పనులు అప్పగించింది. 36 ఏళ్లపాటు ఈ జాతీయ రహదారులను నిర్వహించి టోల్‌ వసూలు చేసుకునే విధంగా ఒప్పందం జరిగింది. ముందుగా ప్రభుత్వానికి రూ.950 కోట్లు ఈ సంస్థ ఇచ్చినట్టు కూడా సమాచారం. సుమారు 5 వేల కోట్ల అంచనాతో ఈ రోడ్లను అభివృద్ధి చేసి 36 సంవత్సరాలపాటు టోల్‌ వసూలు చేసుకుని, ఈ రోడ్డు నిర్వహణ బాధ్యతలు చూడవలసి ఉంది. 2019లో ఈమేరకు ఒప్పందం కుదిరింది. మొదట గుండుగొలను నుంచి సిద్ధాంతం ఒక ప్యాకేజీ కింద, సిద్ధాంతం నుంచి దివాన్‌చెరువు వరకూ  మరో ప్యాకేజీ కింద ఇచ్చారు. అప్పుడు రోడ్డు విస్తరణ, లైటింగ్‌, స్పీడ్‌ కంట్రోలర్స్‌, సీసీ కెమేరాలు వంటి పనులు చేశారు. ప్రస్తుతం సర్వీసు రోడ్లు కూడా నిర్మిస్తున్నారు. ఇటీవల దివాన్‌చెరువు నుంచి కత్తిపూడి, అక్కడ నుంచి అనకాపల్లి వరకూ ప్యాకేజీలను కూడా అప్పగించారు. కానీ గుండుగొలను నుంచి దివాన్‌చెరువు వరకూ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఇంకా అనేక సర్వీసు రోడ్లు నిర్మించవలసి ఉంది. జంక్షన్లను అభి వృద్ది చేయవలసి ఉంది. సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయవలసి ఉంది. కానీ సర్వీసు రోడ్ల పేరిట గోతులు తవ్వి నెలల తరబడి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు. 

నిర్వహణ లోపంతోనే గుంతలు

గుండుగొలను నుంచి దివాన్‌చెరువు వరకూ 120 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరగడంతో తరచూ పెద్దగోతులు పడిపోతున్నాయి. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతకుముందు ఈ జాతీయ రహదారిని ఆరు వరసలుగా మార్చాలనే ప్రయత్నం జరిగింది. తర్వాత రాష్ట్ర, జాతీయ రహదారిగా మార్చాలనే ప్రయత్నాలూ జరిగాయి. గుండుగొలను నుంచి కొవ్వూరు మీదుగా గోదావరి గామన్‌ బ్రిడ్జి మీద నుంచి మరో హైవే వస్తుండడంతో రావులపాలెం మీదుగా వచ్చే హైవే అవసరం లేదనే వాదనలు మరికొంతకాలం జరిగాయి. కానీ ఇక్కడ ట్రాఫిక్‌, ఇతర అంశాల దృష్టితో జాతీయ రహదారిగానే ఉంచారు. ఈనేపఽథ్యంలో ఈ రోడ్డు పరిస్థితిపై ఫిర్యాదులు రావడంతో  సెంట్రల్‌ రోడ్డు రీసెర్చి యూనిట్‌ నిపుణుల బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. గుండుగొలను నుంచి తాడేపల్లిగూడెం, తణుకు, సిద్ధాంతం, రావులపాలెం, కడియపులంక, రాజమహేంద్రవరం మీదుగా పరిశీలించారు. అనేకచోట్ల చిన్నచిన్న గోతులు తవ్వి, లోపల లేయర్ల పరిస్థితిని అధ్యయనం చేశారు. రోడ్డు మధ్యలో లోతైన గోతులు పడిపోవడానికి అంతకుముందు నిర్మించిన లేయర్ల నాణ్యతలోపమేననే నిర్థారణకు వచ్చి, ప్రస్తుత రోడ్డును మొత్తం తవ్వేసి మళ్లీ నిర్మించాలని నివేదిక ఇవ్వడంతో జాతీయ రహదారుల ప్రాథికారిత సంస్థ కదిలింది. సదరు కాంట్రాక్టు సంస్థతో పనులు చేయించడానికి నిర్ణయించింది. వానకాలం వెళ్లిన వెంటనే పనులు మొద లు పెడతారని ఎన్‌హెచ్‌ అధికారులు చెబుతున్నారు. కొత్తగా దివాన్‌చెరువు నుంచి అనకాపల్లి వరకూ 16వ నంబర్‌ జాతీయ రహదారిని కూడా విస్తరించేలా ఈ కాంట్రాక్టు సంస్థ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.




Updated Date - 2021-10-24T06:51:16+05:30 IST