రూ.28 లక్షలు మోసం

ABN , First Publish Date - 2021-06-19T05:24:16+05:30 IST

కాలిఫోర్నియాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.28 లక్షలు స్వాహా చేసిన ఓ నిందితుడ్ని ఆరేళ్ల తర్వాత పోలీసులు ఎట్టకేలకు పట్టుకొచ్చారు.

రూ.28 లక్షలు మోసం
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

కర్నూలు, జూన్‌ 18: కాలిఫోర్నియాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.28 లక్షలు స్వాహా చేసిన ఓ నిందితుడ్ని పోలీసులు ఎట్టకేలకు పట్టుకొచ్చారు. కర్నూలు ఇన్‌చార్జి డీఎస్పీ వెంకట్రామయ్య, మూడో పట్టణ సీఐ తబ్రేజ్‌, ఎస్‌ఐ రామకృష్ణయ్య శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కర్నూలు బి.క్యాంపునకు చెందిన డానిష్‌ హుశేన్‌ అనే వ్యక్తి బి.కామ్‌ కంప్యూటర్స్‌ చదువుకున్నాడు. 2016లో ఉద్యోగాల కోసం షేన్‌ డాట్‌ కామ్‌లో జావా దేవోలోఫెర్‌ జాబ్‌కు అప్లయి చేశాడు. రిజిస్ట్రేషన్‌ను గుర్తించిన ఓ ఆగంతకుడు డానిష్‌ హుశేన్‌కు ఫోన్‌ చేశాడు. ఐబీఎం కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని, కాలిఫోర్నియాలో ట్రైనింగ్‌ ఉంటుందని నమ్మించాడు. రిజిస్ట్రేషన్‌ కోసం రూ.2,500 ఫీజు చెల్లించాలని చెప్పడంతో డానిష్‌ హుశేన్‌ ఆ మొత్తాన్ని చెల్లించాడు. తర్వాత ట్యాక్సుల పేరుతో విడతల వారిగా అదే సంవత్సరం రూ.28,08,450 లక్షలు అకౌంటులో వేయించుకున్నారు. ఆ తర్వాత మాయ మాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చుతూ వచ్చారు. రెండేళ్ల వరకు  కాంటాక్టులోనే ఉన్నాడు. అయితే మోసపోయానని గుర్తించిన డానిష్‌ హుసేన్‌ మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  ప్రారంభించారు. నిందితులు ఐదుగురు ఉన్నారని నిర్ధారించుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పట్లో పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లి వివేక్‌ శుక్లా, అనుపమ్‌ కుమార్‌, మౌనిక సాగర్‌, మెర్సి సాగర్‌ను అరెస్టు చేసి కర్నూలు తీసుకువచ్చారు. తామంతా ప్రధాన నిందితుడు వీరేంద్ర కుమార్‌ శర్మ కింద ఏజెంట్లుగా పని చేస్తున్నట్లు పోలీసులకు వివరించారు. అప్పటి నుంచి ప్రధాన నిందితుడు వీరేంద్ర శర్మ తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితుడు మాత్రం పోలీసులను ఆశ్రయిస్తూనే  ఉన్నాడు. దీంతో సీఐ తబ్రేజ్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రధాన నిందితుని కోసం పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం చందోలి జిల్లా, మొగల్‌ సారాయ్‌ అనే ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. కరోనా నేపథ్యంలో సొంత ఊర్లోనే ఉంటున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఓ బృందాన్ని పంపి ప్రధాన నిందితుడ్ని అరెస్టు చేశారు. నిందితుడ్ని శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. పోలీసు కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబడుతామని డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను ఆయన అభినందించారు. 

Updated Date - 2021-06-19T05:24:16+05:30 IST