ఆర్టీసీలో చావుకేకలు!

ABN , First Publish Date - 2021-04-29T06:32:43+05:30 IST

తమ సొమ్ముతో నిర్మించుకున్న హాస్పిటల్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు కొవిడ్‌ చికిత్సలు అందకపోవటంతో.. అసువులు బాస్తున్న బాధాకరమైన పరిస్థితి ఇది.

ఆర్టీసీలో చావుకేకలు!

ఆర్టీసీ హాస్పిటల్స్‌లో అడ్మిషన్ల  నిలుపుదల 

అత్యవసర సేవలకొస్తున్న వారిని పంపేస్తున్న వైనం 

ఆకి ్సజన్‌ అందక మరో ఇద్దరి మృతి 

చోద్యం చూస్తున్న ఆర్టీసీ యాజమాన్యం 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

 తమ సొమ్ముతో నిర్మించుకున్న హాస్పిటల్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు కొవిడ్‌ చికిత్సలు అందకపోవటంతో.. అసువులు బాస్తున్న బాధాకరమైన పరిస్థితి ఇది. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కృష్ణా రీజియన్‌లో దిక్కులేని చావులు నెలకొంటున్నాయి. బుధవారం విద్యాధరపురం బస్‌ డిపోకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి కుటుంబ సభ్యుడు ఆక్సిజన్‌ అందక మృతి చెందాడు. విద్యాధరపురంలోని ఆర్టీసీ హాస్పిటల్‌కు తీసుకువెళితే.. అక్కడ కనీసం వెంటిలేటర్‌ కూడా పెట్టలేదు. అక్కడి నుంచి తరలించేలోపే మార్గమధ్యలోనే కరోనా బాధితుడు చనిపోయాడు. ఇబ్రహీంపట్నం బస్‌ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ రాగా.. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నాడు. బుధవారం ఆ ఉద్యోగికి ఊపిరి ఆడకపోవటంతో.. ఆగమేఘాల మీద కుటుంబ సభ్యులు ఆర్టీసీ ఆసుపత్రికి తీసుకువస్తే.. వెంటిలేషన్‌ పెట్టలేమని ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకు వెళ్ళాలని చెప్పి పంపారు. సకాలంలో ఆక్సిజన్‌ అందించకపోవటంతో.. మార్గమధ్యలోనే ఆర్టీసీ ఉద్యోగి చనిపోయాడు. ఉద్యోగుల ప్రాణాలను రక్షించాల్సిన ఆర్టీసీ హాస్పిటల్‌ కనీసం సిబ్బందిని లోపలికి అనుమతించటం లేదు. సాధారణ రోగులను కూడా కొవిడ్‌ పరీక్షలు చేయించుకుని రమ్మంటున్నారు. కార్పొరేట్‌ స్థాయిలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఉన్నా.. ఆర్టీసీ ఉద్యోగులకు కొవిడ్‌ వైద్యసేవలు అందకపోవటంతో.. అనాథలలా చివరికి చనిపోవాల్సి వస్తోంది. ప్రాణాంతక పరిస్థితుల్లో రోగి వచ్చాడు కాబట్టి ప్రాణం నిలిపే పనులు చేపట్టకుండా హాస్పిటల్‌కు తీసుకు రావద్దని వైద్య సిబ్బంది చెబుతున్నారు. పాజిటివ్‌ వస్తే ఆర్టీసీ హాస్పిటల్‌కు తీసుకు రావద్దని, ఏదైనా మంచి హాస్పిటల్‌కు తీసుకు వెళ్ళమని ఉచిత సలహా ఇస్తున్నారు. పేషంట్లను అనుమతించకపోయినా.. ప్రాణం నిలపటానికి మందులు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ ఉద్యోగుల వేతనం నుంచి ఈఎ్‌సఐ పేరుతో జీతం కట్‌ చేసుకుంటున్నా.. సిబ్బంది వైద్య సేవలపై దృష్టి సారించని పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు హాస్పిటల్స్‌లో చికిత్సలు తీసుకోమని రిఫర్‌ కూడా చేయటం లేదు. పోనీ ఆరోగ్యశ్రీ మీద సేవలు పొందాలంటే.. ఈహెచ్‌ఎస్‌ కార్డులు లేవన్న పేరుతో ప్రైవేటు హాస్పిటల్స్‌ యాజమాన్యాలు జాయిన్‌ చేసుకోవటం లేదు. ఆర్టీసీ ఉద్యోగులు మానసికంగా క్షోభకు గురవుతున్నారు. 


Updated Date - 2021-04-29T06:32:43+05:30 IST