Abn logo
Oct 16 2020 @ 20:39PM

కేబీసీలో రికార్డు సృష్టించిన రునా షా

ముంబై: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా నిర్వహించే ‘కౌన్ బనేగా క్రోర్‌పతి-12’లో రునా షా (43) అనే మహిళ రికార్డు సృష్టించారు. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ ఆడకుండానే హాట్‌సీట్‌ను చేరుకున్నారు. ఫలితంగా కేబీసీ చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. కేబీసీ మొట్టమొదట ప్రారంభమైనప్పటి నుంచి హాట్‌సీట్‌కు చేరుకోవాలని ప్రయత్నిస్తున్న రునా షా ఎట్టకేలకు గురువారం తన కలను నెరవేర్చుకున్నారు. ఇంటర్వ్యూ జరిగేంత వరకు కేబీసీకి వెళ్లేందుకు తాను చేస్తున్న ప్రయత్నాల గురించి ఆమె తన కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడడం విశేషం. 


గురువారం గేమ్ మొదలైనప్పుడు ముగ్గురు పార్టిసిపెంట్స్ మాత్రమే ఉండగా, రునా షా చివరి కంటెస్టెంట్‌గా మిగిలిపోయారు. దీంతో ఇక్కడి వరకు వచ్చి హాట్‌సీట్‌కు చేరుకోలేకపోతున్నందుకు రునా కన్నీళ్లు పెట్టుకున్నారు. గమనించిన అమితాబ్ ఆమెను హాట్‌సీట్‌కు ఆహ్వానించడంతో తనను తాను నమ్మలేకపోయారు. హాట్‌సీట్‌లో కూర్చున్నాక ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేక ఏడ్చేశారు. దీంతో ఆమెను అమితాబ్‌తోపాటు ఆమె భర్త, కుమార్తె ఊరడించాల్సి వచ్చింది. 


కళ్లు తుడుచుకునేందుకు రునా షాకు టిష్యూ ఇచ్చిన అమితాబ్ కన్నీళ్లు పెట్టే సమయం అయిపోయిందన్నాడు. ఆమె మాట్లాడుతూ.. తాను కనుక హాట్‌సీటుకు చేరుకోకపోతే ఇక జీవితంలో ఎప్పటికీ టీవీ చూడకూడదని నిర్ణయించుకున్నానని, హాట్‌సీటుకు చేరుకోవాలని దేవుడిని ప్రార్థించానని చెప్పారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న రునా షా జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో ఉండేవారు. భర్త ప్రోత్సాహంతో చివరికి చీరల వ్యాపారం ప్రారంభించారు.

ప్రత్యేకంమరిన్ని...