అభివృద్ధిలో పరుగులు

ABN , First Publish Date - 2022-06-16T06:31:07+05:30 IST

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ జోడెద్దుల మాదిరిగా పరుగులు తీస్తోందని, రాష్ట్రంలోని పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం ముస్తాబాద్‌ మండలం వెంకట్రావుపల్లెలో ‘పల్లె ప్రగతి’కి హాజరయ్యారు. వెంకట్రావుపల్లె గ్రామ పంచాయతీ భవనాన్ని, కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణాన్ని, చీకోడులో సీసీ కెమెరాలు, డిజిటల్‌ క్లాస్‌ రూంలు, గూడెంలో సింగిల్‌ విండో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ భవనాన్ని ప్రారంభించారు.

అభివృద్ధిలో పరుగులు
ముస్తాబాద్‌లో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

-  తెలంగాణలో జోడెడ్ల పాలన

- త్వరలో  పింఛన్లు, రేషన్‌ కార్డులు 

- రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడుదాం

- మళ్లీ ఆశీర్వదిస్తారనే విశ్వాసం 

- కరోనా కాలంలోనూ ఆగని పథకాలు 

-  మంత్రి కే తారకరామారావు 

 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

 అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ జోడెద్దుల మాదిరిగా పరుగులు తీస్తోందని,  రాష్ట్రంలోని పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని  పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం ముస్తాబాద్‌ మండలం వెంకట్రావుపల్లెలో ‘పల్లె ప్రగతి’కి హాజరయ్యారు. వెంకట్రావుపల్లె గ్రామ పంచాయతీ భవనాన్ని, కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణాన్ని, చీకోడులో సీసీ కెమెరాలు, డిజిటల్‌ క్లాస్‌ రూంలు, గూడెంలో సింగిల్‌ విండో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ భవనాన్ని ప్రారంభించారు. సేవాలాల్‌ తండాలో జగదాంబ దేవి విగ్రహ ప్రతిష్ఠాపన,  పోత్గల్‌లో రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం ముస్తాబాద్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో  తెలంగాణ పల్లెలను దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. కరోనా కాలంలోనూ సంక్షేమ పథకాలను అందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రతంలో తండ్రి పాత్రను పోషించారన్నారు. కరోనా కష్టపెట్టినా ‘రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌,  పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌ ’వంటి సంక్షేమ పథకాలు అగకుండా రాష్ట్రాన్ని నడిపించారన్నారు. దేశంలోనే అత్యుత్తమ 26 గ్రామాలను ఎంపిక చేస్తే అందులో 19 తెలంగాణవేనన్నారు.  రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలన్న సోయి 75 ఏళ్ల స్వాతంత్య్రంలో ఇంతకుముందు పనిచేసిన ప్రధాని, ముఖ్యమంత్రులకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే ఏమస్తుందని అడిగారని,  24 గంటలు ఉచిత కరెంట్‌, కాళేశ్వరం జలాలతో రైతులకు సాగు, తాగునీరు, మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రూ.200 ఉన్న పింఛన్‌ పది రెట్లు పెరిగి రూ.2 వేలు అయ్యిందన్నారు. దివ్యాంగుల పింఛన్‌ రూ.500నుంచి రూ.3 వేలకు పెరిగిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో 29 లక్షల మంది పింఛన్లకు  రూ.800 కోట్లు ఖర్చు చేస్తే కేసీఆర్‌ ప్రభుత్వం 40 లక్షల మంది పింఛన్లకు  రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.    కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సాగునీటి రంగంలో అనేక అద్భుతాలు జరిగాయన్నారు. కేసీఆర్‌ రైతు కుటుంబం నుంచి వచ్చారని, ఒక రైతుగా వారి గోసలు తెలుసు కాబట్టే ఊరును బాగుచేసుకోవడానికి వ్యవసాయంలో మార్పులు తెచ్చుకోవడానికి రాష్ట్రంలో ఆరు నెలల్లో  2600 రైతు వేదికలను నిర్మించారని అన్నారు. రైతు బంధు కింద రూ.50 వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.   త్వరలోనే అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి కొత్త పింఛన్లు, రేషన్‌ కార్డులు ఊళ్లలోకి వచ్చి అందిస్తారన్నారు.


భయం... రందీ లేదు 

ఎన్నికల కోట్లాట ఇప్పటి నుంచే ఎందుకని రాజకీయాలకు అతీతంగా ఊరికోసం వచ్చిన డబ్బులు ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించాలని  మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఊరు బాగైన తరువాత ఏ ఎమ్మెల్యేకు ఓట్లు వేయాలో ఎవరికి వేయాలో తెలుస్తుందన్నారు. అందులో తనకు భయం, రందీ లేవని, తప్పకుండా పనిచేసేవారిని ఆశీర్వదిస్తారనే విశ్వాసం  ఉందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా  ముందుకు వెళ్లాలన్నారు.  అందరి బాగు కోసమే ముఖ్యమంత్రి  ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో తాగునీటి సౌకర్యం, ట్రాక్టర్‌, ట్రాలీ, వైకుంఠాథామం, నర్సరీలు, పల్లె పకృతివనం, రోడ్లు, డ్రైనేజీలు  వంటి మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు.   ప్రత్యేక క్యాంపుల ద్వారా వెంకట్రావుపల్లెలో విరాసత్‌ సహా అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. గ్రామానికి సాగునీటి సౌకర్యం కల్పిస్తామని, సొంత జాగలో ఇళ్లు నిర్మించుకునే వారికి  ఆర్థిక సహాయం అందిస్తామని,  స్థలం లేనివారికి ఇప్పిస్తామని అన్నారు. వెంకట్రావుపల్లె ప్రాథమిక పాఠశాలను 7వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు. చీకోడులో కల్యాణ మండపం నిర్మిస్తామన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్‌రావు, రైతు బంధు సమితి కో ఆర్డ్డినేటర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ జనాబాయి, సెస్‌ డైరెక్టర్‌ కొమ్ము బాలయ్య, ముస్తాబాద్‌ సర్పంచ్‌ గాండ్ల సుమతి, చీకోడ్‌ సర్పంచ్‌ రజిత, వెంకట్రావుపల్లె సర్పంచ్‌ లక్ష్మణ్‌, పోత్గల్‌ సర్పంచ్‌ తన్నీరు గౌతంరావు, గూడెం సర్పంచ్‌ సరిత, సేవాలాల్‌ తండా సర్పంచ్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, మండల అధ్యక్షుడు సురేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

విద్యార్థులకు సైకిళ్లు 

ముస్తాబాద్‌ మండలం చీకోడ్‌లో పాఠశాలలలో డిజిటల్‌ క్లాస్‌రూంలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన సందర్భంలో మూడు కిలోమీటర్ల దూరంలోని పర్శరాములునగర్‌ నుంచి పాఠశాలకు కాలినడకన వస్తున్న 25 మంది విద్యార్థులకు తక్షణమే సైకిళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు. 




 


Updated Date - 2022-06-16T06:31:07+05:30 IST