రుషికొండను పిండి చేసేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-10-24T06:00:40+05:30 IST

రుషికొండపై నిర్మాణాల కోసం అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.

రుషికొండను పిండి చేసేస్తున్నారు!

ఇష్టానుసారంగా తవ్వకం

కోస్తా నియంత్రణ మండలి-1 పరిధిలో ఆ ప్రాంతం

శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు అవసరం

వాటి గురించి నోరుమెదపని అధికార గణం

రీ డెవలప్‌మెంట్‌ పేరిట పనులు

గనుల శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకముందే కొండ తవ్వకం

ఆ మట్టిని తీసుకువెళ్లి బీచ్‌లలో పోస్తున్న వైనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రుషికొండపై నిర్మాణాల కోసం అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. మొదట్లో హరిత  రిస్టార్ట్స్‌ను పునర్మిర్మాణం చేసి, అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పనుల తీరు వేరుగా ఉంది. కొండ మొత్తం తవ్వేస్తున్నారు. దిగువన బీచ్‌ రోడ్డులో గీతం విశ్వవిద్యాలయం ఎదురుగా రూ.80 లక్షలతో నిర్మించిన బస్టాప్‌ను నేలమట్టం చేసేశారు. అసలు ఈ ప్రాంతమంతా కోస్తా నియంత్రణ మండలి-1 పరిధిలో ఉంది. శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ప్రత్యేకంగా అనుమతులు ఉండాలి. ఇదే కోవలో గల సాగర్‌నగర్‌లో వీఎంఆర్‌డీఏకు చెందిన కార్తీకవనంలో స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి పదిహేనేళ్లు ఢిల్లీ చుట్టూ తిరిగితే గానీ అనుమతులు రాలేదు. దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో (65 ఎకరాలు) భారీఎత్తున నిర్మాణాలు చేపడతామని, దీనికి రూ.164 కోట్లు బడ్జెట్‌ కేటాయించామని ఏపీటీడీసీ పేర్కొంది. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, ఎంటర్‌టెయిన్‌మెంట్‌ అని పైకి చెబుతున్నా...ముందు సీఎం క్యాంపు కార్యాలయమే నిర్మిస్తారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పనులు ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంటే...ఇప్పటివరకు డీపీఆర్‌ బయట పెట్టలేదు. రహస్యంగా ఉంచారు. స్థానిక పర్యాటక శాఖ అధికారులకు కూడా పూర్తి వివరాలు చెప్పకుండా అమరావతి నుంచే అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నారు. 


బీచ్‌ మొత్తం మట్టితో నింపుతున్నారు

రుషికొండలో కొండను తవ్వి ఆ మట్టిని తీసుకువెళ్లి భీమిలి వైపు బీచ్‌లో పోసి, అక్కడి ప్రాంతాలను చదును చేస్తున్నారు. అందులో కొంత పర్యాటక శాఖ భూమి అయితే, మరికొంత ప్రభుత్వ భూమి. మట్టి తరలింపునకు రాష్ట్ర గనుల శాఖ ఇంకా అనుమతి రాలేదు. పర్యాటక శాఖ అధికారులు కేవలం ఐదు హెక్టార్లకే దరఖాస్తు చేసి పది హెక్టార్లలో మట్టి తవ్వుతున్నారు. దానిని ఎక్కడికి తరలిస్తామనే విషయం కూడా గనుల శాఖకు స్పష్టం చేయలేదు. సొంతానికి కాకుండా వేరే అవసరాలకు ఆ మట్టిని ఉపయోగిస్తే క్యూబిక్‌ మీటరుకు రూ.45 చొప్పున సీనరేజీ ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే స్థానికంగా నాయకులు, పర్యాటక శాఖ సిబ్బంది కలిసి ఇదే అదనుగా మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. రుషికొండలో ఇంత విధ్వంసం జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు ఎవరూ స్పందించడం లేదు. అక్రమాలను నిలువరించడం లేదు.


పర్యావరణానికి విఘాతం

సోహన హట్టంగడి, సామాజికవేత్త

రుషికొండలో తవ్విన మట్టిని తీసుకువెళ్లి తొట్లకొండ నుంచి భీమిలి వరకు బీచ్‌ ప్రాంతంలో పోస్తున్నారు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదు గానీ ఇది పర్యావరణానికి విఘాతం కలిగిస్తోంది. బీచ్‌లో సహజంగా వుండే వాతావరణాన్ని మార్చేస్తున్నారు. అక్కడ ఇసుక స్థానంలో మట్టి నింపుతున్నారు. దీనివల్ల సహజంగా అక్కడ పెరిగే మొక్కలు, జీవాలు నశించిపోయే ప్రమాదం ఉంది. నగర అభివృద్ధి పర్యవేక్షకులు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియాలి.

Updated Date - 2021-10-24T06:00:40+05:30 IST