కీవ్‌ను చుట్టుముడుతున్న రష్యన్ దళాలు... మా నియంత్రణలోనే ఉందంటున్న ఉక్రెయిన్...

ABN , First Publish Date - 2022-02-27T17:24:30+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నాలుగో రోజు కూడా భీకరంగా జరుగుతోంది

కీవ్‌ను చుట్టుముడుతున్న రష్యన్ దళాలు... మా నియంత్రణలోనే ఉందంటున్న ఉక్రెయిన్...

కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నాలుగో రోజు కూడా భీకరంగా జరుగుతోంది. రాజధాని నగరం కీవ్‌ను అన్ని వైపుల నుంచి రష్యా దళాలు చుట్టుముడుతున్నాయి. ఆదివారం ఉదయం రెండు భారీ పేలుళ్ళు వినిపించాయని ఓ వార్తా సంస్థ తెలిపింది. రష్యా సేనలు అనేక ఉక్రెనియన్ నగరాల్లోని వీథుల్లోకి చొచ్చుకెళ్ళి, కాల్పులు జరుపుతున్నాయి. అన్ని వైపుల నుంచి దాడులను పునరుద్ధరించాలని తమ దళాలకు ఆదేశించామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 


ఈ యుద్ధంలో మూడో రోజైన శనివారం కీవ్‌ నగరానికి రష్యా సేనలు సమీపించకుండా ఉక్రెయిన్ సేనలు నిలువరించగలిగాయి. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ దేశం విడిచి వెళ్ళడానికి నిరాకరించడంతోపాటు దేశ రక్షణలో పాలుపంచుకోవాలని ప్రజలను కోరారు. 


ఉక్రెయిన్ సాయుధ దళాలు ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘మాపై దాడి జరిగినా, మా చుట్టూ ఉన్నదంతా కాలిపోతున్నా, మేం మా కృషిని కొనసాగిస్తాం’’ అని పేర్కొంది. ఆదివారం ఉదయం రష్యా సేనలు కీవ్ నగరంలోకి ప్రవేశించలేకపోయినట్లు డిఫెన్స్ రిపోర్టర్ ఇలియా పోనోమరెంకో తెలిపారు. రష్యా దురాక్రమణదారుల వశం కాకుండా కీవ్ దృఢంగా నిలిచిందని మరొక రిపోర్టర్ ట్వీట్ చేశారు. రష్యా యుద్ధ నేరస్థులు క్షిపణులతో కీవ్‌లోని ఆయిల్ డిపోపైనా, ఖార్కివ్‌లోని గ్యాస్ పైప్‌లైన్‌పైనా దాడి చేశారని తెలిపారు. ఈ దాడుల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందన్నారు. మరొక క్షిపణి రేడియోయాక్టివ్ వేస్ట్ స్టోరేజ్‌ సమీపంలో పడిందని చెప్పారు. 


రష్యా మద్దతుగల వేర్పాటువాదులు వెల్లడించిన వివరాల ప్రకారం, లుహాన్‌స్క్ ప్రావిన్స్‌లోని ఓ ఆయిల్ టెర్మినల్‌ను ఉక్రెయిన్ పేల్చేసింది. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఆదివారం తెల్లవారుజామున రివ్నే, వోలిన్ ప్రాంతాల్లో సైరన్లు వినిపించాయి. రష్యా సేనలు కీవ్‌లో పెద్ద ఎత్తున బాంబులు కురిపించాయి. 


రష్యా విద్రోహులతో రాత్రంతా యుద్ధం చేసిన తర్వాత కీవ్ ప్రశాంతంగా ఉందని ఉక్రెయిన్ ప్రకటించింది. కీవ్ సిటీ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ మైకోలా తెలిపిన వివరాల ప్రకారం, రాజధాని నగరం పూర్తిగా ఉక్రెయిన్ నియంత్రణలోనే ఉంది. రాత్రి విద్రోహ శక్తులతో అనేకసార్లు ఘర్షణ జరిగినట్లు మైకోలా తెలిపారు. 


ఉక్రెయిన్ రీజనల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్‌ పరిధిలోని పబ్లిక్ కౌన్సిల్ చీఫ్ బ్రాట్‌చుక్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఓడెసాలోని ఉక్రెయిన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కార్యకలాపాలను పునరుద్ధరించారు. ఓడెసాలోని లిపెట్‌స్కే గ్రామం వద్ద ఉక్రెయిన్ మిలిటరీ యూనిట్‌పై రష్యా సేనలు ఈ నెల 24న వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2022-02-27T17:24:30+05:30 IST