కీవ్ సమీపంలో రష్యా దాడులు తీవ్రతరం

ABN , First Publish Date - 2022-02-25T18:17:58+05:30 IST

ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌ పరిసరాల్లో రష్యా సేనల

కీవ్ సమీపంలో రష్యా దాడులు తీవ్రతరం

కీవ్ : ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌ పరిసరాల్లో రష్యా సేనల దాడులు మరింత పెరిగాయి. శుక్రవారం సాయంత్రానికి రష్యా దళాలు కీవ్ శివారు ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని ఉక్రెయిన్ రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు నగర ప్రజలను హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై శుక్రవారం ఉదయం రష్యన్ క్షిపణులు పెద్ద ఎత్తున కురిసినట్లు తెలిపారు. రష్యా సేనలను దీటుగా ఎదిరిస్తున్నట్లు ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మల్యార్ చెప్పారు. 


సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలపై సైతం రష్యన్ సేనలు దాడి చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇదిలావుండగా, ప్రజలు నగరంలోని సురక్షిత బంకర్లలోకి వెళ్ళాలని నగర పాలక సంస్థ అధికారులు కోరారు. 


రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకులు ప్రయాణించడానికి వీల్లేకుండా నిరోధించేందుకు ఉక్రెయిన్ సైన్యం కీవ్‌లోని ఓ వంతెనను శుక్రవారం కూల్చేసింది. రష్యా యుద్ధ ట్యాంకులు వస్తుండగా, వంతెనను కూల్చేసి, వాటిని నిలువరించినట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ఆఫ్ ది ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్థానిక మీడియాకు తెలిపారు. ‘‘ట్యాంకులు వస్తున్నాయి. మేం పోరాడుతున్నాం’’ అని ఉక్రెయిన్ దేశాధ్యక్ష కార్యాలయం తెలిపింది. 


ఇదిలావుండగా, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినపుడు కీవ్‌ను ఈ వారంతంలో రష్యా సేనలు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అమెరికా సెక్యూరిటీ అధికారులు అంచనా వేస్తున్నారు. 

 


Updated Date - 2022-02-25T18:17:58+05:30 IST