చర్చల దిశగా..!

ABN , First Publish Date - 2022-02-26T07:08:48+05:30 IST

ఉక్రెయిన్‌ మీద రష్యా సైనిక చర్య శుక్రవారం రెండోరోజూ కొనసాగింది. గురువారం పలు నగరాలపై బాంబు దాడులకు పాల్పడ్డ రష్యా సేనలు శుక్రవారం ఏకంగా ఆయా నగరాల్లో ప్రవేశించాయి. కీలకమైన రాజధాని కీవ్‌లోనూ అడుగు పెట్టాయి.

చర్చల దిశగా..!

  • మెట్టుదిగిన ఉక్రెయిన్‌, రష్యా ప్రభుత్వాలు
  • నాటోను వదిలి తటస్థంగా ఉండేందుకు సిద్ధం
  • ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదన
  • ఆయుధాలు వదిలితే ఉక్రెయిన్‌తో చర్చలకు సై 
  • బెలారస్‌కు చర్చల బృందాన్ని పంపిన రష్యా
  • అధ్యక్షుడిని దింపేస్తే సైన్యంతోనైనా చర్చలు
  • శుక్రవారం రెండో రోజూ రాజధానిపై దాడులు
  • ఉక్రెయిన్‌పై నేడు భారత క్యాబినెట్‌ భేటీ
  • పుతిన్‌కు జిన్‌పింగ్‌ ఫోన్‌.. చర్చలకు పిలుపు
  • రష్యాపై మండలి ఆంక్షల భేటీ
  • అందరి చూపు భారత్‌వైపే
  • భారత్‌ మద్దతు కోరిన అమెరికా, రష్యా
  • రష్యాను వెలివేసేలా చేయాలి: ఉక్రెయిన్‌


కీవ్‌, ఫిబ్రవరి 25: ఉక్రెయిన్‌ మీద రష్యా సైనిక చర్య శుక్రవారం రెండోరోజూ కొనసాగింది. గురువారం పలు నగరాలపై బాంబు దాడులకు పాల్పడ్డ రష్యా సేనలు శుక్రవారం ఏకంగా ఆయా నగరాల్లో ప్రవేశించాయి. కీలకమైన రాజధాని కీవ్‌లోనూ అడుగు పెట్టాయి. శుక్రవారం రాత్రి కూడా గగనతలం నుంచి దాడులు కొనసాగాయి. సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేశామని రష్యా చెబుతున్నప్పటికీ 137 మంది పౌరులు మరణించారని, వందల మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ పేర్కొంది. రష్యాను నిలువరించేందుకు అమెరికా కానీ, ఇతర నాటో సభ్య దేశాలు కానీ గట్టి ప్రయత్నమేదీ చేయకపోవడంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌ స్కీ నిర్వేదంలో మునిగిపోయారు. తమను నాటోలో చేర్చుకుంటారో లేదో చెప్పకుండా 27 యూరోపియన్‌ దేశాలు నాన్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి రష్యాకు భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. నాటోలో చేర్చుకుంటే ఉక్రెయిన్‌ను కాపాడే బాధ్యత నాటో సభ్య దేశాలది అవుతుంది. అమెరికా కూడా ఉక్రెయిన్‌కు అండగా నిలిచే విషయం పక్కనబెట్టి ఉక్రెయిన్‌ను దాటి నాటో దేశాల మీద రష్యా దాడికి దిగితే తాను రంగంలోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించింది.


రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా అంతర్జాతీయ లావాదేవీలకు కీలకమైన స్విఫ్ట్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి రష్యాను తప్పించాలని అమెరికాను కోరినా.. నాటో సభ్యదేశాల్లో ఈ అంశంపై ఏకాభిప్రాయం రాలేదన్న సమాధానం వచ్చింది. దాంతో తాను ఒంటరి వాడినయ్యానని జెలెన్‌స్కీ అర్థం చేసుకున్నారు. నాటోకు, రష్యాకు దూరంగా తటస్థ దేశంగా ఉంటామని, అందుకు అంగీకరిస్తే రష్యాతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. నిజానికి రష్యా అడుగుతున్నది కూడా అదే. తనతో ఉండనక్కరలేదు. నాటోలో చేరొద్దని. ఈ నేపథ్యంలో రష్యా కూడా కాస్త మెత్తబడింది. ఆయుధాలు వదిలేస్తే ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. మాటలకే పరిమితం కాకుండా తన మిత్రదేశం బెలార్‌సకు తన ప్రతినిధి బృందాన్ని చర్చలకు పంపించింది. ఉక్రెయిన్‌ నుంచి అధికారుల బృందాన్ని చర్చలకు రావాలని కోరింది. మరోపక్క ఎలాంటి అండ లేకుండా తమతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌ సైన్యానికి ఎర వేసింది. అధ్యక్షుడిని తప్పించి అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలని సూచన ఇచ్చింది. ప్రస్తుత ఉద్రిక్తత ప్రపంచ యుద్ధంగా మారకుండా చూసేందుకే ఉక్రెయిన్‌ మీద సైనిక చర్య చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. మరోపక్క ఉక్రెయిన్‌కు ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను అందజేయాలని నాటో నిర్ణయించింది. ఇప్పటికే ఉక్రెయిన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను రష్యా నాశనం చేసింది.


చెర్నోబిల్‌ క్షేమం

బెలారస్‌ సరిహద్దుల్లో ఉన్న చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్రాన్ని రష్యా సేనలు ఎలాంటి ప్రతిఘటన లేకుండా స్వాధీనం చేసుకున్నాయి. 1986లో ప్రమాదం తర్వాత రేడియో ధార్మికత అలముకున్న ఈ కర్మాగారాన్ని మూసేసి, ఎవరూ చొరబడకుండా సాయుధ కాపలా కాస్తున్నారు. యుద్ధ సమయంలో ఎవరూ కుట్రతో దాన్ని పేల్చేయకుండా ముందుజాగ్రత్తగా రష్యా దాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే, రష్యా దళాలు ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదని ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపిస్తున్నారు.


తీవ్రమైన పోరాటం

ఉక్రెయిన్‌లో శుక్రవారం పోరాటం తీవ్రమైంది. నగరాల్లో పలు భవనాలు బాంబు దాడులతో శిధిలమయ్యాయి. పౌరులు ప్రాణభయంతో బంకర్లు, మెట్రో సొరంగాల్లో తల దాచుకున్నారు. ఇప్పటికే 50 వేల మంది సరిహద్దులు దాటారు. వారికి రుమేనియా, హంగరీ దేశాలు సాయం అందిస్తున్నాయి. కీవ్‌ సమీపంలోని హోస్టొమోల్‌ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని రష్యా సైన్యం ప్రకటించింది. ఇక.. సామాన్య పౌరులు కూడా ఆయుధాలు చేతబట్టి పోరాటంలోకి దిగాలని ఉక్రెయిన్‌ సైన్యం విజ్ఞప్తి చేసింది. రష్యా దళాలను అడ్డుకునేందుకు భారీగా వంతెనలు కూల్చేసింది.


మరిన్ని ఆంక్షలు

రష్యాపై యూరప్‌ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాయి. రష్యా వ్యాపారులకు ఇచ్చే క్రెడిట్‌ సౌకర్యాన్ని జర్మనీ నిలిపేసింది. యూరప్‌ మానవ హక్కుల వేదిక కౌన్సిల్‌ ఆఫ్‌ యూరప్‌ నుంచి రష్యాను బహిష్కరించారు. మరోపక్క రష్యా సైతం తన గగన తలం నుంచి బ్రిటన్‌ విమానాలు ఎగురకుండా నిషేధం విధించింది. 


అధ్యక్షుడికి ప్రాణభయం

ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి ప్రాణభయం పట్టుకుంది. తాను ఉక్రెయిన్‌ నుంచి పారిపోయానంటూ వస్తున్న వదంతులను ఖండించేందుకు సోషల్‌ మీడియాలో లైవ్‌లో ఆయన మాట్లాడారు. రాజధాని కీవ్‌లోనే ఓ రహస్య బంకర్‌ ఉన్న ఆయన, తనను ప్రాణాలతో చూడటం ఇదే చివరిసారి కావచ్చని వ్యాఖ్యానించారు. తాము ఒంటరి అయిపోయామని, రష్యా తనతో పాటు కుటుంబాన్ని చంపేందుకు కుక్కలతో కూడిన ప్రత్యేక బలగాలను రంగంలోకి దించిందన్నారు. ప్రాణాలు పోయేదాకా తాను, తన కుటుంబం దేశంలోనే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. అధ్యక్షుడి భార్య, కుమార్తె(17), కుమారుడు(9) మరో బంకర్‌లో తలదాచుకున్నారు.


రష్యన్లలో వ్యతిరేకత

ఉక్రెయిన్‌పై దాడి చేయాలన్న పుతిన్‌ నిర్ణయంపై సామాన్య రష్యన్లలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఉక్రెయిన్‌తో తమకు ముప్పు ఉందని, ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూలురను ఊచకోత కోసే ప్రమాదం ఉందని అధ్యక్షుడు వినిపించిన వాదనతో వారు ఏకీభవించడం లేదు. 22 ఏళ్ల పాలనలో భావోద్వేగాలకు లోను కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించే నేతగా ప్రఖ్యాతిగాంచిన పుతిన్‌ తొలిసారి భావోద్వేగ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు. సోవియట్‌ యూనియన్‌ ఉచ్ఛదశలో ఉండగా దేశం తరఫున గూఢచారిగా పనిచేసిన ఆయనకు నాటి ప్రాభవం సంతరించుకోవాలన్న కల ఉందేమోనని అనుమానిస్తున్నారు. అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా భారీగా ప్రదర్శనలు జరగక పోయినా, అనుకూల ప్రదర్శన ఒక్కటి కూడా జరగకపోవడం గమనార్హం. రష్యా ప్రతిపక్షాలు సోషల్‌ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం చేయడానికే పరిమితం అయ్యాయి. రాజకీయాలకు సంబంధం లేని సామాన్య పౌరులు వందల సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు.  జార్జియా లాంటి మాజీ సోవియట్‌ దేశాల్లోనూ ఉక్రెయిన్‌కు సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి. 




నేడు కేబినెట్‌ కమిటీ భేటీ

ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితిని సమీక్షించేందుకు భద్రత వ్యవహారాల కేంద్ర మంత్రివర్గ కమిటీ శనివారం సమావేశం కానుంది. ప్రధాని నేతృత్వంలో గురువారం రాత్రి కూడా ఈ కమిటీ సమావేశమైంది. అనంతరమే ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. భారత్‌ ఇతర దేశాలతో కలిసి యుద్ధాన్ని ఆపే విధంగా రష్యాపై ఒత్తిడి తేవాలని ఆర్‌ఎ్‌సఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేశ్‌ కుమార్‌ కేంద్రాన్ని కోరారు.

Updated Date - 2022-02-26T07:08:48+05:30 IST