రష్యా యుద్ధోన్మాదం!

ABN , First Publish Date - 2022-02-25T08:06:30+05:30 IST

ప్రపంచ దేశాలు హెచ్చరికలు చేసినా.. ఆంక్షల శిక్ష తప్పదని చెప్పినా. అగ్రదేశాలు ప్రతిఘటిస్తున్నా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు. ‘‘మా ఉద్దేశం ఉక్రెయిన్‌ ఆక్రమణ కాదు..! సైనిక చర్య మాత్రమే..! నేరస్థులను శిక్షించడమే మా లక్ష్యం..!’

రష్యా యుద్ధోన్మాదం!

  • రష్యా టీవీలో పుతిన్‌ ప్రసంగం..
  • ఆ వెంటనే ముప్పేట దాడులు
  • ఉక్రెయిన్‌పై దురాక్రమణ.. పుతిన్‌ దుస్సాహసం
  • పదాతి, నౌకా, వాయు సేనలతో ముప్పేట దాడి
  • రాజధాని కీవ్‌, చెర్నోబిల్‌ అణు కేంద్రం స్వాధీనం
  • ఉక్రెయిన్‌లోని 11 నగరాలపై క్షిపణి దాడులు
  • 11 ఎయిర్‌ బేస్‌లు సహా 83 రక్షణ సంస్థలు ధ్వంసం
  • బాంబుల వర్షంతో 300 మంది చనిపోయారని అంచనా
  • 300 మంది ఉక్రెయిన్‌ సైనికులు చనిపోయారు: రష్యా
  • 50 మంది రష్యా సైనికులను హతమార్చాం: ఉక్రెయిన్‌
  • తమ బలగాలను యుద్ధానికి పంపేది లేదన్న నాటో
  • అత్యవసరంగా సమావేశమైన జీ-7 దేశాలు
  • యుద్ధం వద్దంటూ రష్యాలో నిరసన.. పలువురి అరెస్టు


మూడు దిక్కుల నుంచి పదాతి దళాలు! నాలుగో వైపు నుంచి నౌకా దళం! గగన తలంపై నుంచి యుద్ధ విమానాలు.. హెలికాప్టర్లు! ఊపిరి సలపకుండా క్షిపణి దాడులు.. బాంబుల వర్షం! రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దుస్సాహసం! గురువారం తెలతెలవారుతుండగానే ఉక్రెయిన్‌పై యుద్ధానికి భేరి మోగించారు. తొలుత 11 ఎయిర్‌ బేస్‌లను ఆ తర్వాత ఉక్రెయిన్‌ రక్షణ వ్యవస్థలను రష్యా ధ్వంసం చేసింది! కీవ్‌, ఖర్కివ్‌ సహా 11 నగరాలపై క్షిపణి దాడులు చేసింది. రాజధాని కీవ్‌ను ఆక్రమించింది. చెర్నోబిల్‌ అణు కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంది. యుద్ధంలో ఉక్రెయిన్‌లో దాదాపు 300 మంది పౌరులు చనిపోయారని అంచనా. రష్యాకు చెందిన నాలుగు విమానాలు, హెలికాప్టర్లను కుప్పకూల్చామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. 300 మంది ఉక్రెయిన్‌ సైనికులు చనిపోయారని రష్యా ప్రకటిస్తే.. రష్యాకు చెందిన 50 మంది సైనికులను హతమార్చామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. అయినా, ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ బలగాలను పంపేది లేదని నాటో తేల్చి చెప్పింది. అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగబోదని, తమ సైన్యాలు రష్యాతో నేరుగా తలపడబోవని బైడెన్‌ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. హింస పరిష్కారం కాదని, నాటోతో చర్చలు జరపాలని హితవు పలికారు. కాగా.. ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు సహా భారతీయులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తమను స్వదేశానికి చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. విమానాలు వెళ్లే దారి లేకపోవడంతో సరిహద్దు దేశాల సహకారంతో వారిని రక్షించేందుకు భారత్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది! యుద్ధ భయంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. గురువారం ఉదయం నుంచే సెన్సెక్స్‌, నిఫ్టీ బేర్‌మన్నాయి. సెన్సెక్స్‌ 2000 పాయింట్లకుపైగా పతనమైంది.


కీవ్‌, ఫిబ్రవరి 24: ప్రపంచ దేశాలు హెచ్చరికలు చేసినా.. ఆంక్షల శిక్ష తప్పదని చెప్పినా. అగ్రదేశాలు ప్రతిఘటిస్తున్నా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు. ‘‘మా ఉద్దేశం ఉక్రెయిన్‌ ఆక్రమణ కాదు..! సైనిక చర్య మాత్రమే..! నేరస్థులను శిక్షించడమే మా లక్ష్యం..!’’ అని చెబుతూనే.. ఉక్రెయిన్‌లో శాంతియుత ప్రావిన్సులు, నగరాలపైనా బాంబుల వర్షం కురిపించారు. వ్యూహాత్మకంగా.. వెనకడుగు వేస్తున్నట్లు చెప్పి.. అదను చూసి, ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డారు. తొలుత వైమానిక దాడులతో 11 నగరాల్లోని 83 కీలక సైనిక, రక్షణ కార్యాలయ భవనాలను టార్గెట్‌గా చేసుకున్నారు. ఉక్రెయిన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌ మూడు వైపులా పదాతి దళాలను రంగంలోకి దింపారు. నాలుగో వైపు(నల్ల సముద్రం) నుంచి నౌకాదళాన్ని మోహరించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రష్యా 203 దాడులు చేసింది. ఈ దాడుల్లో 300 మంది దాకా సాధారణ పౌరులు మరణించారని అంచనా. మరో 300 మంది ఉక్రెయిన్‌ సైనికులను హతమార్చినట్లు రష్యా ప్రకటించింది. 50 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్స్కీ స్వయంగా సైనిక దుస్తుల్లో సైనిక శిబిరాలను సందర్శించి.. తమ దళాల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు.


తేరుకునే అవకాశమివ్వకుండా..

నాటో దిశలో ఉక్రెయిన్‌ అడుగులు వేసినప్పటి నుంచే.. ఆ దేశ సరిహద్దుల్లో 1.5 లక్షల మంది సైన్యాన్ని మోహరించిన రష్యా.. గురువారం నాటి దాడి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఉక్రెయిన్‌కు ఊపిరి సలపనివ్వలేదు. తేరుకునే అవకాశమివ్వలేదు. నిజానికి నాలుగు రోజుల క్రితమే రష్యా తమ సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తున్నట్లు ప్రకటించింది. ఈలోగా అమెరికా-రష్యా చర్చలపై ఆశలు ఆవిరవ్వడం.. ఉక్రెయిన్‌ ఓ అడుగు ముందుకు వేసి, యుద్ధానికి సిద్ధమని సంకేతాలివ్వడంతో.. రష్యా ఏకంగా నాలుగడుగులు ముందుకు వేసింది. రష్యా అధికారిక టీవీలో పుతిన్‌ ప్రసంగిస్తూ.. దాడికి ఆదేశాలివ్వడంతో.. వైమానిక దళం విరుచుకుపడింది. ఎంతలా అంటే..? రష్యా అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఉక్రెయిన్‌పై తమ వైమానిక దళాల లొకేషన్‌ మ్యాప్‌ను విడుదల చేసింది. అందులో.. రష్యా యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు మేఘాల్లా కమ్ముకుని కనిపించాయి. తొలుత ఉక్రెయిన్‌ వైమానిక స్థావరాలను టార్గెట్‌గా చేసుకుని, గగనతలం నుంచి క్షిపణి దాడులు జరిగాయి. రాడార్‌ స్టేషన్లకు సంబంధించిన సాంకేతిక వ్యవస్థలను రష్యా వైమానికదళం కూల్చేసింది. రష్యా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.40 నుంచి ఉదయం 10 గంటల కల్లా.. ఉక్రెయిన్‌ ఎయిర్‌బే్‌సలను, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఆ తర్వాత రక్షణ శాఖకు చెందిన కార్యాలయాలను టార్గెట్‌గా చేసుకుంది.


ఈ క్రమంలో పలు పౌర భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. రక్షణ కార్యాలయాలతోపాటు.. విద్యుత్తు వ్యవస్థే టార్గెట్‌గా క్షిపణి దాడులు జరిగాయి. ఉక్రెయిన్‌ నావికాదళ కేంద్రాలను కూడా రష్యా వైమానిక దళం ధ్వంసం చేసింది. నిజానికి ఉక్రెయిన్‌లోని వేర్పాటు వాదులు స్వేచ్ఛను కోరుకుంటున్నారంటూ.. రష్యా ముందు నుంచీ వారికి సాయం చేస్తూ వచ్చింది. రెండు రోజుల క్రితం రెండు ప్రావిన్సులను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఇది తమ పార్లమెంట్‌లో ఆమోదించిన నిర్ణయమని పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఆ రెండు ప్రావిన్సులకు చెందిన నేతల నుంచి సాయం కోరుతూ లేఖలు అందాయని గురువారం ఉదయం టీవీ ప్రసంగంలో పేర్కొన్నారు. వారికి సాయం చేస్తున్నట్లు చెబుతూ.. దాడులకు ఆదేశాలిచ్చారు. అయితే.. ఆ రెండు ప్రావిన్సులతోపాటు.. శాంతియుతంగా ఉండే మరో తొమ్మిది నగరాలపై రష్యా యుద్ధ విమానాలు దాడులు జరిపాయి. వైమానిక దాడులతో ఉక్రెయిన్‌ను తేరుకోలేకుండా దెబ్బకొట్టిన రష్యా.. ఆ తర్వాత పదాతి దళాలను రంగంలోకి దింపింది.


బెలారస్‌ నుంచి తొలి దాడి..

రష్యా తొలుత బెలారస్‌ నుంచి దాడి ప్రారంభించినట్లు ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. వైమానిక దాడుల తర్వాత.. పదాతి దళాలు, క్షిపణి/శతఘ్ని బలగాలు ఉత్తరంలోని క్రిమియా నుంచి ఉక్రెయిన్‌లోకి వచ్చాయి. తొలుత లుహాన్స్క్‌ ప్రాంతంలోని రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతమైన ఖర్కీవ్‌, దక్షిణ ప్రాంతమైన ఒడెసా వైపు నుంచి దురాక్రమణను ప్రారంభించాయి. రష్యా మాత్రం క్రిమియాలోని ఖెర్సోన్‌ నుంచి దాడులను ప్రారంభించినట్లు వెల్లడించింది. రష్యా దళాలు నిమిషాలు.. గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్‌లోకి 10-15 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చాయి. ఆ తర్వాత.. అంటే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌ను టార్గెట్‌గా చేసుకున్నాయి.


అక్కడ మిలటరీ, రక్షణ స్థావరాలే లక్ష్యంగా సైన్యం దూసుకుపోయింది. ఉక్రెయిన్‌ బలగాలు కూడా రబెల్స్‌, రష్యా సైన్యాన్ని నిలువరించాయి. ‘‘మా రక్షణ శాఖ మంత్రి నుంచి మాకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. మీరు తుపాకులను వీడి, వెనక్కి వెళ్లిపోతే.. మిమ్మల్ని గౌరవంగా చూడాలన్నారు’’ అంటూ రష్యా బలగాలు ప్రకటిస్తూ.. ముందుకు సాగాయి. ఉక్రెయిన్‌ బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నా.. రాత్రి 8 గంటలకల్లా రాజధాని నగరం తమ ఆధీనంలోకి వచ్చినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. కీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తమ నియంత్రణలో ఉన్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌ సైన్యానికి మానసిక ధైర్యం అందించేందుకు అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్స్కీ స్వయంగా యుద్ధరంగానికి చేరుకున్నారు. సైనిక దుస్తులు ధరించిన ఆయన.. దాడులు జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. 


రష్యా గుప్పిట్లోకి చెర్నోబిల్‌ అణుకేంద్రం

రష్యా సైన్యం ఓ పక్క రాజధాని నగరం కీవ్‌లోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుటూనే.. నగరానికి ఉత్తరాన 130 కిలోమీటర్ల విస్తరణలో ఉన్న చెర్నోబిల్‌ అణుకేంద్రంపై దృష్టిసారించాయి. దీనిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.


ఎవరి వాదన వారిదే..

యుద్ధంలో ఆస్తి, ప్రాణ నష్టంపై ఇరు దేశాలు పరస్పర విరుద్ధ డేటాను అంతర్జాతీయ మీడియాకు విడుదల చేశాయి. 203 చోట్ల దాడులు చేసినట్లు ప్రకటించిన రష్యా.. 11 ఎయిర్‌బే్‌సలు సహా.. మొత్తం 83 సైనిక/రక్షణ కార్యాలయాలు/స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. వీటిల్లో 18 రాడార్‌ స్టేషన్లు, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్‌ మిసైల్‌ వ్యవస్థలు ఉన్నట్లు తెలిపింది. ప్రధానంగా.. ఉక్రేనియల్‌ నేషనల్‌ గార్డ్స్‌ ప్రధాన కార్యాలయాన్ని నేలకూల్చామని పేర్కొంది. ఈ ఘటనలో ఉక్రెయిన్‌ సైన్యంలో 74 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేస్తోంది. కీవ్‌ నగరం తమ హస్తగతమైందని, ఒడోసా పోర్టు కూడా తమ నియంత్రణలోనే ఉందని చెప్పింది. ఒడోసా పోర్టు వద్ద దాడిలో 40 మంది చనిపోయారని వివరించింది. తమ బలగాలను నియంత్రించేందుకు వచ్చిన ఉక్రెయిన్‌ మిలటరీ విమానాన్ని కూల్చేశామని, అందులో ఉన్న 14 మంది సైనికులు, పైలట్లు చనిపోయారని తెలిపింది. మొత్తంమీద 300 మంది ఉక్రెయిన్‌ సైనికులను హతమార్చినట్లు చెబుతోంది. ఆ మేరకు వీడియోలను ట్విటర్‌లో విడుదల చేసింది. అయితే.. రష్యా తన బాలిస్టిక్‌, క్రూయిజ్‌ క్షిపణులతో దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. ఉక్రెయిన్‌ విజయం సాధిస్తుందని విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు. తమ జవాన్ల దాడుల్లో రష్యాకు చెందిన నాలుగు యుద్ధ ట్యాంకులు ధ్వంసమైనట్లు చెప్పారు. కీవ్‌, ఇతర నగరాల్లో తమ సైనికులు 10 యుద్ధవిమానాలు/హెలికాప్టర్లను కూల్చేసినట్లు వివరించారు. 50 మంది రష్యా సైనికులను కాల్చి చంపినట్లు తెలిపారు. ఈ ప్రకటనలను రష్యా ఖండించింది. 

Updated Date - 2022-02-25T08:06:30+05:30 IST