పాక్, చైనాల నుంచి ముప్పును తిప్పికొట్టే క్షిపణి వ్యవస్థ పంజాబ్ సెక్టర్‌లో మోహరింపు

ABN , First Publish Date - 2021-12-21T15:49:51+05:30 IST

రష్యాలో తయారైన ఎస్-400 మిసైల్ సిస్టమ్‌

పాక్, చైనాల నుంచి ముప్పును తిప్పికొట్టే క్షిపణి వ్యవస్థ పంజాబ్ సెక్టర్‌లో మోహరింపు

న్యూఢిల్లీ : రష్యాలో తయారైన ఎస్-400 మిసైల్ సిస్టమ్‌ తొలి స్క్వాడ్రన్‌ను భారత వాయు సేన (ఐఏఎఫ్) పంజాబ్ సెక్టర్‌లో సోమవారం మోహరించింది. దీంతో దేశ గగనతల రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. 


ఎస్-400 మిసైల్ సిస్టమ్ మొదటి స్క్వాడ్రన్‌ను పంజాబ్ సెక్టర్‌లో మోహరిస్తున్నట్లు ఓ ప్రభుత్వ అధికారి చెప్పారని ఈ వార్తా సంస్థ తెలిపింది. పాకిస్థాన్, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి రక్షించగలిగే సామర్థ్యం దీని బ్యాటరీలకు ఉన్నట్లు తెలిపారని పేర్కొంది. 


భారత దేశానికి రక్షణ రంగంలో ప్రధాన భాగస్వామి అమెరికా. ఈ ఎస్-400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తుండటంపై అమెరికా విముఖత ప్రదర్శించింది. అయితే అమెరికా తన ప్రత్యర్ధి దేశాలను ఎదుర్కొనే ఆంక్షల చట్టం అమల్లోకి రావడానికి ముందే ఈ ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమయ్యాయని భారత్ సర్ది చెప్పింది. 2015లో ఈ వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం కుదిరిందని, 4.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం 2018లో ఖరారైందని వివరించింది. అయినప్పటికీ దీనిని అడ్డుకోవడానికి అమెరికా ప్రయత్నించింది. తాను అభివృద్ధిపరచిన టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (టీహెచ్ఏడీ), పేట్రియాట్ సిస్టమ్స్‌ను ఇస్తామని భారత్‌కు చెప్పింది. 


రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలతో ఆర్థిక, రక్షణ సంబంధాలను కలిగియుండే దేశాలపై ఆంక్షలు విధించడానికి ఈ ఆంక్షల చట్టాన్ని అమెరికా ఉపయోగిస్తోంది. ఎస్-400 మిసైల్ సిస్టమ్స్ కొనుగోలు చేయకుండా చైనా, టర్కీలను నిలువరించేందుకు ఈ చట్టాన్ని ప్రయోగించింది.


Updated Date - 2021-12-21T15:49:51+05:30 IST