సచివాలయ పరీక్షల్లో సత్తా చాటారు

ABN , First Publish Date - 2020-10-29T17:27:25+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ప్రతిభ చాటి, తమ సత్తా నిరూపించారు. జిల్లాలో 13 విభాగాల్లో 1,586 పోస్టులకు గత నెలలో ఈ పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల మనోగతం వారి మాటల్లోనే...

సచివాలయ పరీక్షల్లో సత్తా చాటారు

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ప్రతిభ చాటి, తమ సత్తా నిరూపించారు. జిల్లాలో 13 విభాగాల్లో 1,586 పోస్టులకు గత నెలలో ఈ పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల మనోగతం వారి మాటల్లోనే...


ఉన్నత స్థానానికి ఎదగాలన్నదే లక్ష్యం: కీర్తి శ్రీకావ్య (కూర్మన్నపాలెం), విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ ప్రథమ ర్యాంకర్‌

ఉద్యానవన శాఖలో ఉన్నత స్థానానికి చేరుకోవటమే నా లక్ష్యం. 81 మార్కులతో జిల్లాలో మొదటి ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. పార్వతీపురంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టీకల్చర్‌ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేశాను. గతంలో నీట్‌లో మంచి ర్యాంకు రావడంతో  ఢిల్లీ సమీపంలోని గజియా కళాశాలలో మెడిసిన్‌లో చేరాను. అయితే అక్కడ వాతావరణం నచ్చక మానేశాను. సచివాలయ పరీక్షకు హార్టీకల్చర్‌ సబ్జెక్టుతోపాటు జీకేపై దృష్టి సారించాను. నాన్న ప్రేమ్‌ కుమార్‌  స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి. అమ్మ లత గృహిణి.  1 నుంచి 10 తరగతుల వరకు స్టీల్‌ప్లాంట్‌ చైతన్య  పబ్లిక్‌ స్కూల్‌, ఇంటర్‌ శ్రీచైతన్య కాలేజీలో చదివాను. 2016లో జాతీయ స్థాయి రోలర్‌ స్కేటింగ్‌ పోటీల్లో వెండి పతకం సాధించాను.


చిన్ననాటి కల ఫలించింది: జీవిరెడ్డి నాగమణి, (ఏపీపురం నాతవరం), ‘శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’లో ద్వితీయ ర్యాంకర్‌

 ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న చిన్ననాటి కల ఫలించింది. వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ పరీక్షల్లో 82 మార్కులు సాధించి, జిల్లాలో రెండో ర్యాంకర్‌గా నిలిచాను.  టెన్త్‌ నర్సీపట్నం ప్రతిభ స్కూల్‌, ఇంటర్‌ విజయనగరం ఏపీఆర్‌జేసీ కళాశాల, డిగ్రీ (బీఎస్సీ సీబీజెడ్‌) నర్సీపట్నం శ్రీసాయి కళాశాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలినయ్యాను. మాది సాధారణ రైతు కుటుంబం. నా చదువుకు తల్లిదండ్రులు పోతురాజు, చిన్నతల్లి చక్కని ప్రోత్సాహం అందించారు. పోటీ పరీక్షకు దరఖాస్తు చేసిన నాటి నుంచి రోజుకు ఎనిమిది గంటలు చదివాను. ఇష్టంగా చదివితే సాధించలేనిది ఏదీ ఉండదన్న నిజాన్ని ఈ ఫలితాలతో నాకు రుజువైంది.


సివిల్స్‌ నా లక్ష్యం - తప్పెట్ల శ్రీనివాస్‌ , (రైల్వే న్యూకాలనీ, సుబ్బలక్ష్మీనగర్‌) (జనరల్‌), కేటగిరీ-1 ప్రథమ ర్యాంకర్‌

సివిల్‌ సర్వీస్‌లో విజేతగా నిలిచి మంచి సర్వీస్‌ సాధించాలన్నది నా లక్ష్యం. అందుకు సచివాలయం ఉద్యోగం ఊతమవుతుందని భావిస్తున్నాను. సచివాలయ ఉద్యోగాల పరీక్షలో కేటగిరీ-1 (గ్రామ కార్యదర్శి, వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ, మహిళా పోలీస్‌) విభాగంలో జిల్లాలో అత్యధిక మార్కులతో (99.25 శాతం) మొదటి ర్యాంకు సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను నగరంలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో టెన్త్‌ వరకు చదివాను. నారాయణ కళాశాలలో ఇంటర్‌, ఏయూలో బీటెక్‌ (జియో ఇన్‌ఫర్మేషన్‌) పాసయ్యాను. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఎంటెక్‌ పూర్తిచేశాను. 2015 నుంచి ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాను. నాన్న ఫిజిక్స్‌ లెక్చరర్‌గా చేసి రిటైర్‌ అయ్యారు. అమ్మ గృహిణి. అన్నయ్య ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగంలో జాయిన్‌ అయి నా లక్ష్యం సివిల్స్‌ సాధించేందుకు కృషి చేస్తాను.


ఎంతో ఆనందంగా ఉంది: మువ్వల ఉమామహేశ్వరరావు (రావికమతం), ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ రెండో ర్యాంకర్‌ 

ప్రభుత్వ కొలువు సాధించాలని రేయింబవళ్లు కష్టపడి చదివా. గ్రామ సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు మొదటి ప్రయత్నంలో విఫలమైనా నిరాశ చెందలేదు. ఈసారి జిల్లాలో 96 మార్కులతో రెండో ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు పోతురాజు, అచ్చియ్యమ్మ గొర్రెలు పెంచుతూ కుటుం బాన్ని పోషిస్తున్నారు. స్వగ్రామం గొల్లలపాలెంలో ప్రాథమిక విద్యను, మేడివాడ ప్రభుత్వ హైస్కూల్‌లో పది తరగతి పూర్తిచేశాను. 2019లో విశాఖ లోని విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ (మోకానికల్‌ ఇంజనీరింగ్‌) పూర్తిచేశా. వెంటనే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చింది. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు మొదటి ప్రయత్నంలో విఫలమైనా, రెండోసారి మరింత పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాను.


సోదరుడి ప్రోత్సాహంతో విజయం: దాసరి హరి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ విభాగంలో మూడో ర్యాంకు, ప్రహ్లాదపురం.

కంచరపాలెం పాలిటెక్నిక్‌లో డిప్లొ మో మెకానికల్‌ పూర్తి చేశాను. ఏడా దిగా పోటీ పరీక్షలు రాస్తున్నాను. అన్నయ్య తపాలా శాఖలో ఉద్యోగం సాధించాడు. అతడి ప్రేరణ, ప్రోత్సాహంతో పరీక్షలకు ఎలా ప్రిపేర్‌ అవ్వాలో తెలుసుకున్నాను. జీకేలో బాగా సహాయం చేసి, ఏం చదవాలో చెప్పేవాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రహ్లాదపురం ఉంటున్నాం. మా అమ్మ, నాన్న, అన్నయ్య అందరం ఉదయం టిఫిన్స్‌ వ్యాపారం చేస్తాం. సచివాలయ పరీక్షల్లో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ విభాగంలో 3వ ర్యాంకు రావడం ఎంతో సంతోషంగా ఉంది.


సివిల్స్‌లో ఎంపికే లక్ష్యం: ఎం.రేవతి(హనుమంతువాక), కేటగిరీ-1(రెండవ ర్యాంకర్‌)

మా స్వస్థలం విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలస.  పదో తరగతి వరకు విజయవాడ కేకేఆర్‌ గౌతమ్స్‌లో, ఇంటర్‌ నగరంలోని శ్రీచైతన్యలో పూర్తి చేశాను.  ఏయూ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసీఈలో చేరి 85 శాతం మార్కు లతో ఇంజనీరింగ్‌ పూర్తిచేశా. సివిల్స్‌లో చేరాలనే లక్ష్యంతో పరీక్షలకు సిద్ధమవుతున్నా. గత ఏడాది సచివాలయ పరీక్ష లలో నాన్న అప్పలనాయుడితో కలిసి  పరీక్ష రాస్తే ఇద్దరమూ ఎంపికయ్యాం. ఆయన జాబ్‌లో చేరారు. నేను చేరలేదు. ఈ ఏడాది మళ్లీ పరీక్షలు రాస్తే 98 మార్కులు సంపాదించి జిల్లా లో రెండో ర్యాంకర్‌గా నిలిచా. ఈ పర్యాయం తప్పకుండా ఉద్యోగంలో చేరుతా. అయినా భవిష్యత్తులో సివిల్స్‌కు ఎంపిక వ్వడమే లక్ష్యంగా ప్రిపేరవుతున్నా. సచివాలయ పరీక్షలకు ఇంట్లోనే చదివా. అమ్మ గంగాభవానీ గృహిణి. పెద్ద చెల్లి శ్రావణి సీఏ చేస్తుండగా, రెండో చెల్లి దీప్తి అనిట్స్‌ డెంటల్‌ కళాశాలలో ఫస్టియర్‌ చదువుతున్నది.


గత ఏడాది తండ్రితో పాటు విజయం

కాగా గత ఏడాది తండ్రి అప్పలనాయుడుతోపాటు సచివాలయ పోస్టుకు ఎంపికైన  రేవతి, ఈ ఏడాది ఏకంగా జిల్లా ర్యాంకు సాధించడంతో ఆమెను పలువురు అభినందించారు.

Updated Date - 2020-10-29T17:27:25+05:30 IST