సేవలకు సలాం

ABN , First Publish Date - 2020-04-05T10:55:02+05:30 IST

కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ, వారు ఏది లెక్క చేయకుండా తన విధులను నిర్వరిస్తున్నారు.. విపత్తు సమయంలో కూడా వెరవకుండా, ప్రభుత్వ ఆదేశాలను శిరసావిహిస్తూ సేవలు

సేవలకు సలాం

క్లిష్ట పరిసితుల్లో కూడా విధుల నిర్వహణ

ప్రభుత్వ ఆదేశాలతో అందరికీ వైద్య సేవ

కట్టడితో ప్రజలకు రక్షణ 

శభాష్‌ అనిపించుకుంటున్న మునిసిపల్‌, వైద్య, ఆరోగ్య, పోలీస్‌ శాఖ


గద్వాల, ఆంధ్రజ్యోతి :

కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ, వారు ఏది లెక్క చేయకుండా తన విధులను నిర్వరిస్తున్నారు.. విపత్తు సమయంలో కూడా వెరవకుండా, ప్రభుత్వ ఆదేశాలను శిరసావిహిస్తూ సేవలు అందిస్తున్నారు.. ప్రజలను కట్టడి చేయడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణ బాధ్యతలు తీసుకొని, శభాష్‌ అనిపించుకుంటున్నారు.. వారే ప్రాణం పోసే వైద్యులు, పారిశుధ్య పనులు చేసే కార్మికులు, ప్రజలకు రక్షణగా నిలిచే పోలీసులు..


డాక్టర్‌ దేవుళ్లు

జోగుళాంబ గద్వాల జిల్లాలో 23 మంది వైద్యులు, 140 మంది ఏఎన్‌ఎంలు, 625 అశవర్కర్లు, 40 మంది సూపర్‌వైజర్లు, మరో 22 మంది హెల్త్‌ వర్కర్లు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం కరోనాను కట్టడి చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో వైద్యులు, ఇతర సిబ్బంది ఐసొలేషన్‌ వార్డులో, క్వారంటైన్‌ కేంద్రాల్లో రోగులకు సేవలందిస్తున్నారు. ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరుగుతూ కుటుంబంలోని వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని, విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 24 గంటలు వైద్య సేవలోనే ఉంటున్నారు. వీరితోపాటు చెక్‌పోస్టుల వద్ద వైద్య సిబ్బంది రాత్రి, పగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.


విపత్కర పరిస్థితుల్లో విధులు

పారిశుధ్య కార్మికులు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కూడా తమ సేవలను అందిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది, మునిసిపల్‌ కార్మికులు అన్ని కాలనీల్లో తిరుగుతూ కాలువల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో ఉన్న 200 మంది పారిశుధ్య సిబ్బందితో పాటు 255 గ్రామ పంచాయతీల్లో ఉండే 500 మంది సిబ్బంది కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కాలనీలు, వీధులను శుభ్రం చేస్తున్నారు.


సెల్యూట్‌ పోలీస్‌

జిల్లాలో 14 పోలీస్‌ స్టేషన్లు, డీఎస్పీ, ఎస్పీలతో మొత్తంగా 595 మంది సేవలను అందిస్తున్నారు. జనతా కర్ఫ్యూ, ఆ మరుసటి రోజు నుంచి ప్రారంభమైన లాక్‌డైన్‌లో సమర్తవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. వీధుల్లో పెట్రోలింగ్‌ చేస్తూ, గుంపులు గుంపులుగా జనం గుమిగూడితే కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. వైరస్‌ లక్షణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి, రాకపోకలను నిలిపివేశారు. సరిహద్దుల నిరంతరం నిఘా ఉంచి, ఇతర రాష్ర్టాలు నుంచి వాహనాల రాకపోకలను అరికడుతున్నారు.

Updated Date - 2020-04-05T10:55:02+05:30 IST